Water tanks
-
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
ఎస్సీ ప్రాంతాలకు రూ.3,853.93 కోట్లతో మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు రూ.3,853.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జల్‌జీవన్ మిషన్(జేఎంఎం) ద్వారా 45,13,256 మంది ఎస్సీలకు మేలు కలగనుంది. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో మొత్తం రూ.25,485.36 కోట్ల అంచనాతో 71,201 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఎస్సీ ప్రాంతాల్లో రూ.3,853.93 కోట్లతో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎస్సీలకు చెందిన 7,917 శివారు ప్రాంతాలున్నాయి. వాటిలో 4,852 ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతోంది. మరో 3,065 ప్రాంతాలకు నిర్దేశించినంత (మనిíÙకి 55 లీటర్లు) నీటి సరఫరాలేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఎస్సీ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొత్తం 19,619 పనులు ప్రతిపాదించారు. నీటి ట్యాంకు (రక్షిత నీటిపథకాలు), పైపులైను వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. 2024 నాటికి మొత్తం మూడుదశల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎస్సీ కాలనీలు, ఎస్సీలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలు, జగనన్న కాలనీల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, ట్యాప్ కనెక్షన్లు ఇచ్చే పనులు పూర్తయితే 45,13,256 మంది ఎస్సీలకు లబ్ధికలుగుతుంది. వేగంగా పనులు పూర్తి చేస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసరమైన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే పనుల పురోగతిపై సమీక్షించాం. పనులకు అడ్డంకులు లేకుండా చూడటం, వేగంగా జరిగేలా చూడటం, బిల్లుల చెల్లింపు వంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో అవసరమైనమేరకు మంచినీటిని అందించడం కోసం కృషిచేస్తోంది. గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) యంత్రాంగం సమన్వయంతో ప్రస్తుత వేసవిలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా చేశాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
ఆరు లేయర్లతో ప్లాస్టో వాటర్ ట్యాంకులు
హైదరాబాద్: నీటి ట్యాంకుల తయారీ సంస్థ ప్లాస్టో ఆరు లేయర్లతో కూడిన ట్యాంక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాణ్యమైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేసిన ఈ ట్యాంకు సూర్యరశ్మిని లోపలికి ప్రవేశించనీయకుండా చేసి అధిక ఉష్ణోగ్రతల్లోనూ నీటిని చల్లగా ఉంచుతుంది. ప్రమాదకర యూవీ కిరణాల నుంచి రక్షణనిస్తుంది. సులభంగా శుభ్రం చేసుకునేలా వీటిని రూపొందించారు. ‘‘ప్రతి ఒక్కరికి ఏడాది పాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగునీటికి అందించాలనే లక్ష్యంతో వీటిని తయారు చేసాము. ప్లాస్టో డీలర్ స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి’’ అని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. -
గుక్కెడు నీటికి గంపెడు కష్టాలు
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని చోడవరం గ్రామస్తులకు రక్షిత మంచినీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు మూసి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ ఉంది. దీంతో పాటు ఇటీవల రామతీర్థం రిజర్వాయర్ నుంచి మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నామని అధికారులు పాలకులు చెబున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామస్తులకు గుక్కెడు మంచినీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభాతో పాటు మరో 500 మందికి పైగా కాలనీవాసులు ఉన్నారు. మంచినీరు అందించటం కోసం 50వేల లీటర్ల సామర్థ్యంతో గ్రామంలో ఒక ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మూసిలో బోర్లు వేసి బావికి నీరు సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామానికి మంచినీరు వచ్చేలా పథకం రూపొందించారు. దీంతో పాటు రామతీర్థం రిజర్వాయర్ నుంచి సైతం మంచినీరు గ్రామానికి మంచినీరు సరఫరా చేయటం కోసం పైప్‌లైన్ ట్యాంకుకు సైతం అనుసంధానం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా రామతీర్థం రిజర్వాయర్ నుంచి ఒక్కరోజు సైతం గ్రామానికి మంచినీరు సరిగా సరఫరా చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా అంతకు ముందు గ్రామంలోని రక్షిత పథకం నుంచి మంచినీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 20 కుటుంబాలకు నీరు ఆధారంగా ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురైనా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో వాడుకనీరు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అలంకారప్రాయంగా ఓవర్‌హెడ్‌ట్యాంకు పట్టించుకోని అధికారులు గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయతీ కార్యదర్శి గానీ ప్రత్యేకాధికారి గానీ మంచినీరు సరఫరా విషయమై పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులకు పక్షం రోజులు పైగా మంచినీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామతీర్థం నుంచి సరఫరా చేసే రక్షిత మంచినీరు పథకం పైపులైన్లో సమస్య ఉండి నీరు ట్యాంకుకు ఎక్కటం లేదని, పైప్‌లైన్ పగిలిందనే విషయం పథకం సిబ్బందికి తెలిపినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. పొరుగు గ్రామాలకు పరుగు.. గ్రామంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్న వెన్నూరు, దేవిరెడ్డిపాలెం గ్రామాలకు ద్విచక్రవాహనాలతో వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులు పొరుగు గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది గ్రామానికి వచ్చే బబుల్వాటర్ వ్యాన్ల నుంచి మంచినీరు కొనుక్కోని తాగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి కిరణ్‌ను ఫోన్లో వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని రామతీర్థం పైప్‌లైన్ పగిలిందని, పైప్ జాయింట్ మిషన్‌తో వేయాలని అప్పటి లోగా గ్రామంలోని రక్షితపథకం నీరు అందిస్తాన్నారు. ప్రత్యేక అధికారి సురేఖను వివరణ కోరగా మంచినీరు సమస్య ఎవ్వరు తనదృష్టికి తీసుకరాలేదని, సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా అయినా తొలిస్తామని, ఎన్నికల పనుల్లో తీరికలేకున్నామని తెలిపారు. పది రోజులుగా మంచినీరు సరఫరాలేదు గ్రామానికి పక్షం రోజులుగా మంచినీరు సరఫరా లేదు. దీంతో గ్రామస్తులు మంచినీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవటంలేదు. రామతీర్థం మంచినీరు సైతం రావడం లేదు. – ఆర్ వెంకటనారాయణ, చోడవరం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది మంచినీరు కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వయస్సు మళ్లిన వారు మంచినీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రెండు పథకాలు ఉన్నా మంచినీరు అందించలేకపోవటం దారుణం. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడం లేదు. – ఎన్ రమణయ్య, చోడవరం -
కందకాలుంటే భయం అక్కర్లేదు!
నాలుగేళ్ల క్రితం నుంచి విస్తృతంగా కందకాలు తవ్వుతున్నందు వల్ల తమ ఉద్యాన తోట భూమిలో నీటి తేమ పుష్కలంగా ఉందని, వచ్చే ఫిబ్రవరి నెల వరకూ ప్రత్యేకంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కె. చైతన్య రెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామ పరిధిలో ఆయనకు 40 ఎకరాల ఉద్యాన తోట ఉంది. ఇది ప్రధానంగా మామిడి తోట అయినప్పటికీ శ్రీగంధం, ఎర్రచంద్రనం, కొబ్బరి సహా కొన్ని సంవత్సరాల క్రితమే మొత్తం లక్ష మొక్కలు నాటటం విశేషం. గతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో బయటి నుంచి నీటి ట్యాంకులు తెచ్చి పోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ జి. దామో దర్‌రెడ్డి(94407 02029)లను సంప్రదించి 4 ఏళ్ల క్రితం మొదటి విడత కందకాలు తవ్వారు. తర్వాత ప్రతి ఏటా ఖాళీ ఉన్న చోటల్లో కందకాలు తవ్వుతూనే ఉన్నారు. ఆ కందకాలలో ఆకులు అలములు వేయడం, అవి కుళ్లి కంపోస్టుగా మారిన తర్వాత కొత్తగా కొన్ని పండ్ల జాతుల మొక్కలు నాటడం.. దగ్గర్లో మళ్లీ కందకాలు తవ్వటం విశేషం. కందకాల్లో కంపోస్టుపై నాటిన మొక్కల వేళ్లు భూమి లోతుల్లోకి సులువుగా చొచ్చుకెళ్తున్నాయని, తద్వారా చెట్లు ఆరోగ్యదాయకంగా పెరగడంతోపాటు.. వాన నీరు కూడా సమర్థవంతంగా భూమిలోకి ఇంకుతున్నదని, తద్వారా లోపలి మట్టిపొరల్లోనూ నీటి తేమ నిల్వ ఉంటున్నదని చైతన్య రెడ్డి తెలిపారు. ఒక్క వానతోనే బోర్చు రీచార్జ్ ఈ ఖరీఫ్ సీజన్లో చాలా రోజుల వరకు తమ తోట వద్ద సరైన వర్షం పడలేదని, 20 రోజుల క్రితం కురిసిన ఒక్క వానతోనే కందకాల ద్వారా బోర్లు రీచార్జ్ అయ్యాయని తెలిపారు. తమ తోటకు 3 వైపులా ఎత్తయిన ప్రదేశాలుండటం వల్ల వర్షపు నీరు భారీగా తమ తోటలోకి వస్తుందని, కందకాలు విస్తృతంగా తవ్వడం వల్ల ఆ నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడే ఇంకుతున్నదన్నారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వడం వల్ల ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి ఇంకి, మట్టిలో తేమ బాగా ఉందన్నారు. ఫిబ్రవరి వరకు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మనం పైన అందించే నీరు లోపలి పొరలకు చేరదని, భూమి లోపలికి ఇంకిన నీటి తేమే తోటలను బెట్ట నుంచి రక్షిస్తుందన్నారు. రైతులు ఎవరి భూముల్లో వారు కందకాలు తవ్వుకుంటే నీటి వనరుల పరిరక్షణతోపాటు మన పొలంలోని విలువైన పైపొర మట్టి వానకు కొట్టుకుపోకుండా నిలబడుతుందని, లోపలి మట్టి పొరల్లోనూ నీటి తేమ చాలా కాలంపాటు ఉంటుందన్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీటి తేమ ఫిబ్రవరి వరకు చెట్లను నిలబెడుతుందన్నారు. ఆ తర్వాత నీటిని అందిస్తే సరిపోతుందని చైతన్య రెడ్డి(95500 23456) వివరించారు. -
వాటర్ ట్యాంకులెక్కి నిరసన
అవనిగడ్డ/ఒంగోలు: టెట్ పీఈటీ ప్రశ్నపత్రం లీకైందని, అందువల్ల ఈ నెల 19న జరగనున్న పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా ఒంగోలులో అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకులు ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది పీఈటీ అభ్యర్థులు అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా పీఈటీ అభ్యర్థులకు టెట్ నిర్వహిస్తుండటంతో రెండు నెలల నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న తేళ్ల వంశీకృష్ణ విజయవాడలో బాసర ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఒంగోలులోనూ ఆయనకు శిక్షణా కేంద్రం ఉంది. స్కూల్ గేమ్ ఫెడరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న సయ్యద్ బాషా సహకారంతో వంశీకృష్ణ టెట్ పేపర్ లీక్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. వంశీకృష్ణ శిక్షణ ఇచ్చిన వారందరినీ చెన్నై సెంటర్లో వేయించుకున్నారని చెప్పారు. జాబ్ గ్యారెంటీ అంటూ 75 మందికి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.8లక్షలు తీసుకుని టెట్ పేపర్ లీక్ చేయించారని వారు ఆరోపించారు. టెట్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో మధ్యాహ్నం 1.15 గంటలకు స్ధానిక సంత వద్ద ఉన్న రెండు వాటర్ ట్యాంకులపై 28 మంది పీఈటీ అభ్యర్థులు ఎక్కారు. మరో రెండొందల మంది పీఈటీలు కింద నిలబడి టెట్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఘటనా స్ధలికి చేరుకుని పీఈటీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుతో వీరి సమస్యలపై మాట్లాడించారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థులు అంబటిని కోరారు. ఇదిలా ఉండగా టెట్‌ను రద్దు చేయాలంటూ ఒంగోలు లోనూ సుమారు 50 మంది అభ్యర్థులు ఓవర్‌హెడ్‌ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చచెప్పడంతో రాత్రి 8 గంటలకు కిందికి దిగారు. టెట్ పీఈటీ పేపర్ యథాతథం: మంత్రి ఈ నెల 19న నిర్వహించే టెట్ పీఈటీ పేపర్ లీకైందనే వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. 19న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తుందున ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీకృష్ణను సస్పెండ్ చేస్తున్నామన్నారు. టెట్ రద్దు చేయాలి విజయవాడతో పాటు, ఒంగోలులో తేళ్ల వంశీకృష్ణ పీఈటీలకు టెట్‌కు శిక్షణ ఇచ్చారు. టెట్ పేపరు సెట్‌చేసే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సయ్యద్‌బాషాకు ఇతనికి సన్నిహిత సంబం«ధాలున్నాయి. ఇతని ద్వారా తమ దగ్గర శిక్షణ తీసుకున్నవారికి టెట్ పేపర్ ముందుగానే లీక్ చేశారు. అందువల్ల టెట్ని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి. – శ్రీరామకృష్ణ, పెద్దాపురం, తూర్పుగోదావరి చెన్నై సెంటర్ రద్దు వివాదానికి కారణమైన చెన్నై పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం తహశీల్దార్ బి ఆశయ్య ద్వారా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు తెలిపారు. ఈ సెంటర్లో పరీక్ష రాసేవారికి రాష్ట్రంలోని వేర్వేరు కేంద్రాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న తేళ్ల వంశీకృష్ణపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈనెల 19వ తేదీన పీఈటీలకు టెట్ జరుగుతుందని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెప్పారని తహశీల్దార్ వెల్లడించారు. -
మూగ వేదన
వేసవి తాపం పెరిగి పోతోంది. శేషాచలంలోని జలపాతాలు, నీటి గుంటలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. వీటిపై ఆధారపడ్డ మూగజీవులు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రెండు ఘాట్‌రోడ్లలో టీటీడీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెలే శరణ్యంగా మారాయి. తిరుమల: శేషాచలం తూర్పు కనుమల్లో భాగం. చిత్తూరు, వైఎస్సార్ కడప జల్లాల్లో వ్యా పించి ఉన్నాయి. ఇవి సుమారు ఐదున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించాయి. తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు వ్యాపించి ఉన్నాయి. భారత పర్యావరణ, అటవీశాఖ 2010 సెప్టెంబర్ 20న శేషాచల బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించాయి. ఈ బయోస్పియర్ మొత్తం విస్తీర్ణం 4,756 చ.కి.మీ. జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. అందుకే ‘శేషాచల బయోస్పియర్ రిజర్వు’గా ప్రకటించారు. అరుదైన వన్యప్రాణుల ఆవాసం అరుదైన జంతు, జీవజాతులకు ఆవాసం శేషాచలం. అనేక రకాల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరజీవులు, కీటకాలు, సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన 38 రకాల క్షీరదాల్లో .. ఏనుగులు, చిరుత, రేసు కుక్కలు, ఎలుగు బంటి, పునుగుపిల్లి, గుంటనక్కలు, అడవిపిల్లి, ముంగిస, కణుతులు, దుప్పులు, చుక్కల జింక, కొండ గొర్రె, బెట్లు ఉడత, దేవాంగ పిల్లి ఉన్నాయి. 178 రకాల పక్షిజాతుల్లో ప్రధానంగా ఎల్లో (తోటెడ్ బుల్బుల్ )పక్షి, గ్రీన్ పీజియన్, లార్జ్హక్– కుకు పక్షి జాతులు అరుదైనవి. 63 రకాల సీతాకోక చిలుకలు, 27 రకాల సరీçసృపాల జాతుల్లో అతిముఖ్యమైన స్లెండర్ కోరల్, బ్రై న్వైన్, ఏలియట్ సీల్డ్టైర్ సర్పం ఉన్నాయి. వీటితోపాటు 12 రకాల ఉభయచర జీవులు కూడా ఉన్నాయి. దాహం..దాహం పచ్చని ప్రకృతికి శేషాచలం పెట్టింది పేరు. వరుణుడు ముఖం చాటేయడంతో శేషాచలంలో నీటి జాడలేకుండాపోతోంది. శేషాచలంలో ప్రధానంగా గుర్తించిన 365 జలపాతాల్లో చేతివేళ్ల మీద లెక్కపెట్టే తలకొన, గుండ్లకోన, గుంజన వంటి వాటిల్లో మినహా మిగిలినచోట్ల నీటి జాడలేదు. అడవిలో ఉండే నీటి గుంటలు కూడా ఎండిపోయాయి. తాపం తీర్చుకునేందుకు జంతువులు, ఇతర వన్యప్రాణి జాతులు అలమటించాల్సి వస్తోంది. నీటికోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే .. మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాహం తీరుస్తున్న టీటీడీ నీటి తొట్టెలు తిరుమల రెండు ఘాట్ రోడ్లలో వాహనాల రేడియేటర్లకు నీళ్లు పోసుకునేందుకు టీటీడీ ప్రత్యేకంగా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసింది. ఇవి జంతువుల దాహం తీర్చేం దుకు ఉపయోగపడేవి. ఈ తొట్టెల్లో నీటి శాతం తగ్గిపోవడంతో జంతువులు, పిట్టలు అష్టకష్టాలు పడేవి. దాహం తీర్చుకునే క్రమంలో అనేక పక్షులు మృత్యువాత పడేవి. దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు చిన్నపాటి ప్లాస్టిక్ నీటి తొట్టెలు అమర్చారు. వీటిచుట్టూ సిమెంట్ ప్యాకింగ్ చేపట్టారు. వీటికి రోజూ టీటీడీ లారీల ద్వారా నీటిని నింపుతున్నారు. మూగజీవులు తాగునీటి కోసం వీటిపైనే ఆధారపడుతున్నాయి. -
వృథాగా నీటి సంపులు
కొల్చారం: గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ట్యాంకులు, సంపులు వృథాగా మారి ప్రజాధనం వృథాగా మారుతున్నాయి. మండలంలోని రంగంపేట గ్రామంలో 12 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వెచ్చించి సంపు నిర్మించారు. నాటి నుంచి నేటికీ సంపును ఉపయోగంలోకి తేవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం సంపు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ పెచ్చులూడి ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది సంపు. చిన్నఘనాపూర్ గ్రామంలో ఏడాది క్రితం పాఠశాల ఆవరణలో ప్రజా అవసరాల కోసం సంపును నిర్మించినా ఇప్పటికి వినియోగంలోకి తేవడం లేదు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే సంపుల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
సుందర తిరునగరి
రూ.1200 కోట్లతో నగరాభివృద్ధికి డీపీఆర్ తాగునీరు, డ్రైనేజీ, రింగురోడ్డు, రవాణాపై ప్రధాన దృష్టి త్వరలోనే కలెక్టర్‌కు అందనున్న డీపీఆర్ నివేదిక సాక్షి, తిరుపతి : తిరుపతి నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు నడుస్తోంది. కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, రవాణ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ అవసరాలను గుర్తిస్తున్నారు. ప్రధానంగా నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వనరులు, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్- రవాణా, రింగురోడ్డు తదితర సౌకర్యాల కల్పనకు ఒక సమగ్ర నివేదిక రూపొందుతోంది. నగరానికి చెందిన సిస్ట్ అనే సంస్థకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపొందించే బాధ్యతలు అప్పగించారు. కేవలం డీపీఆర్ రూపొందించే ప్రైవేటు కన్సల్టెన్సీకి రూ.56 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అధికారుల అంచనాల ప్రకారం డీపీఆర్‌లో పొందుపరిచే అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు *1,200 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోనున్నారని సమాచారం. దశల వారీగా నిధులు మంజూరు చేసినా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కష్టం కాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. మరో తాగునీటి ట్యాంకు తిరుపతి నగరానికి తాగునీటినందించేందుకు రామాపురం వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తరహాలోనే మరో ట్యాంకు అవసరమని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. రామాపురం ట్యాంకు సామర్థ్యం 200 ఎంసీఎఫ్‌టీలు కాగా తాజాగా అంతే సామర్థ్యం కలిగిన మరో ట్యాంకు నిర్మిస్తే భవిష్యత్తులో నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ట్యాం కు నిర్మాణానికి కనీసంగా 250 ఎకరాల స్థలం అవసరం. తిరుపతి పరిసరాల్లో అంత స్థలం దొరకడం కష్టం. ఒకవేళ స్థల సేకరణ సమస్యగా మారితే రామాపురం ట్యాంకు సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా నగరంలో అంతర్గత రోడ్లు, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలను మెరుగుపరచేందుకు కూడా కొత్త ప్రాజెక్ట్‌లో మార్గాలు పొందుపరుస్తున్నారు. కార్పొరేషన్లో విలీనం చేసిన ఎమ్మార్‌పల్లె సహా మిగిలిన మూడు మేజ ర్ పంచాయతీలను కూడా ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి చేర్చారు. దీంతో తా గునీరు, డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న ఈ పంచాయతీలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఈ పంచాయతీలకు ప్రధానంగా తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు అంతర్గత డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ సిస్టంను కూడా తాజా డీపీఆర్‌లో పొందుపరుస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తిరుపతి జాతీయ రహదారికి సమాంతరంగా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను కూడా సర్వేసంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చితే తిరుపతి నగర పరిసరాల్లోని నివాస ప్రాంతాలు అత్యంత ఖరీదైనవిగా మారుతాయని, తద్వారా ఆయా ప్రాంతవాసుల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. డీపీఆర్ రూపొందిస్తున్న కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఇటీవల జిల్లా కలెక్టర్, తిరుపతి నగర ప్రత్యేకాధికారి సిద్ధార్థజైన్ పలు దఫాలు సమావేశమై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ రిపోర్టును త్వరలోనే కలెక్టర్‌కు అందజేయనున్నారు. -
సాగర్ జలాలొచ్చాయ్..
త్రిపురాంతకం: జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85/3 వద్ద 700 క్యూసెక్కుల నీరు జిల్లాలో ప్రవేశించింది. ఈ నీటితో అధికారులు తాగునీటి చెరువులు నింపనున్నారు. జిల్లాలోని తాగునీటి చెరువుల్లో నీటిమట్టం అడుగంటింది. 129 ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులున్నాయి. వీటిని ముందుగా నింపేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటి తరువాత మరో 160 మంచినీటి చెరువుల్ని నింపుతారు. తొలిరోజు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా..క్రమేణా రెండు వేల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని సాగర్ డీఈ సత్యకుమార్ తెలిపారు. పది రోజుల పాటు నీరు విడుదల చేస్తారన్నారు. రైతులు సాగు అవసరాలకు ఈ నీటిని వినియోగించరాదని హెచ్చరించారు. సాగర్ కాలువలు పరిశీలించిన ఎస్ఈ : జిల్లాలోని తాగునీటి ట్యాంకులు నింపేందుకు సాగర్ జలాలు విడుదల చేసేందుకు ముందు ఎన్ఎస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు సాగర్ కాలవపై పర్యటించారు. రామతీర్థం జలాశయం నుంచి జిల్లా సరిహద్దు 85-3 వరకు ప్రధాన కాలువపై పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు, సలహాలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదలవుతున్న నీరు వృథా కాకుండా ఉపయోగించుకోవాలని కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోకి తాగునీరు ప్రవేశించే సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉండి పరిశీలించారు. ఆయన వెంట సాగర్ డీఈఈ సత్యకుమార్, ఏఈలు దేవేందర్, విజయేందర్ గుంటూరు జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు. -
లక్షలు వెచ్చించినా లక్ష్యం నెరవేరలేదు
న్యూస్‌లైన్ నెట్వర్క్/కొవ్వూరు : ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొవ్వూరు మండలంలో ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు నిరుపయోగంగా మారడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని కుమారదేవం ఎస్సీ కాలనీలో జాతీయ గ్రామీణ మంచినీటి సరఫరా పథకంలో భాగంగా రూ.12.5 లక్షలు వ్యయంతో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు, బోరు, పైపులు ఏర్పాటు చేశారు. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో తొమ్మిది నెలలుగా ఈ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆరికిరేవులలో ఎన్ఆర్డీడబ్యూపీ పథకం కింద రూ.15 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో గ్రామస్తులకు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పశివేదలలో తాగునీరందక 10, 11, 12 వార్డుల ప్రజలు అల్లాడుతున్నారు. నీటి కోసం గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. తాళ్లపూడిలో తప్పని తిప్పలు మండలంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి జలాలు శుద్ధి చేసి అందించే జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పథకం పూర్తయితే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరతాయి. పోచవరం పంచాయతీ పరిధిలోని తుపాకులగూడెంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించాల్సి ఉంది. గజ్జరంలో అదనంగా ట్యాంకు నిర్మించాల్సి ఉంది. బల్లిపాడు, పెద్దేవం శివారు చిడిపి వార్డులోను ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అదనంగా రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుగుడుమెట్టలో అదనంగా మరో ట్యాంకు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వేగేశ్వరపురంలో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. కిలోమీటర్ వెళ్లాల్సిందే చాగల్లు మండలంలో తాగునీటి కోసం పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దారవరం, ఊనగట్ల ఎస్సీ కాలనీల్లో తాగునీరు అందడం లేదు. మీనానగరంలో వాటర్ ట్యాంకు నుంచి నీరు అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. -
కార్యదర్శుల కొరత.. పాలన పడక
యాచారం, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో పాలన పడకేసింది. మండలంలో 20 గ్రామాలకు గాను నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికీ ఐదేసి గ్రామాల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు నిత్యం ఏ గ్రామంలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్ర స్థాయిలో పరిపాలన సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో ముఖ్యం. రెండు, మూడేళ్లుగా పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. మూడు నెలల క్రితం ఆరుగురు పంచాయతీ కార్యదర్శులుండగా మాల్ కార్యదర్శి వీణ ప్రసూతి సెలవులో వెళ్లగా, చౌదర్పల్లి కార్యదర్శి మిస్కిన్ రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలింది శ్రీనివాస్, రాములు, సురేష్‌కుమార్, పురుషోత్తంరెడ్డి మాత్రమే. ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు అప్పగించారు. మండలంలోని 14 క్లష్టర్లకు గాను 14 మంది పంచాయతీ కార్యదర్శులుండాలి. కానీ మండలంలో నలుగురు మాత్రమే ఉండడంతో విధుల్లో భారంతో పాటు ప్రజలకు సరైనా న్యాయం చేయలేకపోతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా తెరుచుకోని పరిస్థితి ఉంది. ముందుకు సాగని అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేక పర్యవేక్షణ కరువై అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సీసీ రోడ్లు, నీటి ట్యాంకులు, డ్రైనేజీ కాల్వలు, భవన నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్ల పనులు పూర్తిగా కుంటుబడ్డాయి. పలు గ్రామాల్లో రూ. కోట్ల విలువ జేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా కట్టడి చేసే నాథుడే లేకుండా పోయారు. కొద్ది రోజుల క్రితం తక్కళ్లపల్లి తండాలో రూ. పది లక్షలకు పైగా విలువ జేసే జీపీ ఆక్రమణకు గురవగా ప్రజల ఫిర్యాదు మేరకు ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ రక్షించి హద్దులు పాతారు. రూ. లక్షలాది పన్నులు కూడా వసూలు కాని పరిస్థితి ఉంది. వీధిలైట్లు కాలిపోయి మరమ్మతులు లేక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. అనుమతుల్లేకుండానే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకుంటున్నా అడిగే వారు లేరు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాల నమోదు, పన్నులు చెల్లింపు, ఇంటి అనుమతులు, లెసైన్సులు తదితర పనుల నిమిత్తం ప్రజలు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శులను నియమించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
గొంతెండుతున్న పల్లెలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం... 20రోజుల క్రితం ఈ గ్రామానికి నీరు అందించే ట్రాన్స్ఫార్మర్, సబ్మెర్సిబుల్ పంపులు చెడిపోయాయి. అధికారులు ఇప్పటివరకు వాటికి మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద కెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఉదయం నుం చి రాత్రి వరకు కరెంటు ఉండకపోవడంతో నీటి కటకట ఏర్పడింది. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఇక జిల్లా సరిహద్దు గ్రామాలలో గ్రామీణుల తాగునీటి అవస్థలు చెప్పనలవి కాకుం డా ఉన్నాయి. చుక్క నీరు లేదు ఎండలు మండుతున్నాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. ఏకధాటిగా 12 గంటల నుంచి 14 గంటల వరకు కరెంటు సరఫరా లేకపోవడం ఇం దుకు ప్రధాన కారణమవుతోంది. మరోవైపు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు నీటికోసం గోస పడుతున్నారు. గ్రామాలలో ఉన్న నీటి ట్యాంకుల వినియోగం సక్రమంగా లేదు. కొన్నిచోట్ల అవసరమైన మేరకు ట్యాంకుల నిర్మాణం లేనందున సరిపోయేంత నీరు అందుబాటులో ఉం డడం లేదు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, తం డాలలో నీటి కటకట ఏర్పడింది. గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట, మద్నూరు, జుక్కల్, భీంగల్, సిరి కొండ, డిచ్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో నీటి తీవ్రత ఎక్కువగా ఉంది. తండాలలోని వాగుల్లోని చెలిమలు, ఊట బావులనుంచి నీటిని తోడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇందు కోసం కిలోమీటర్ల చొప్పు న కాలినడకన వెళుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,640 ఆవాస ప్రాంతాలు ఉండగా, 1,054 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. 590 ఆవా స ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా అవుతోంది. 159 ఆవాస ప్రాంతాలు సురక్షితం కానివి. ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. అధికారులు చెబుతున్న వివరాలు ఇవి. కాగా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అధికారులు చెప్పినట్లు 1,054 ఆవాస ప్రాంతాలకు కాకుండా, 600 ఆవాస ప్రాంతాలకు కూడా నీటి సరఫరా అందుబాటులో లేదు. 590 ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా ఉందని పేర్కొనడంలోనూ నిజం లేదు. వంద ప్రాంతాలకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. 39 బోర్లను అద్దెకు తీసుకుని, 31 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలపడం మరీ పచ్చి అబద్ధంగా కనిపిస్తోంది. బోర్ల నుంచి నీటిని అందించేందుకు కరెంటు సదుపాయమే లేదు. అయి నా అధికారులు వీటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా నామమాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది వేసవి ప్రణాళికలో భాగంగా రూ. 1.50 కోట్లతో ప్రణాళిక లు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయి తే ఆ ప్రణాళికలు ఎక్కడా అమలవుతున్నట్లు కని పించడం లేదు. జిల్లాలో 347 బోర్లు, చేతిపంపులకు ఫ్లషింగ్, డిఫెనింగ్ చేసినట్లు అధికారులు రికార్డులలో చూపుతున్నారు. చేతిపంపుల వినియోగం అక్కడక్కడ మాత్రమే ఉంది. వేసవి కాలంలో చేతిపంపులే ప్రధాన నీటి వనరులుగా ఉపయోగపడతాయి. వీటి ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. దీంతో నీటి ఎద్దడిపై చర్యలు తీసుకునేందుకు తీవ్ర ఆటం కాలు ఎదురవుతున్నాయి. అధికారులు ప్రధానమైన నీటి అవసరాలను పట్టించుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
వెక్కిళ్లొస్తే.. పరుగోపరుగు!
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: పాఠశాలల్లో విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. చాలాచోట్ల నీటి ట్యాంకులు, సింటెక్స్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. రక్షిత మంచినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన జలమణి పథకం పలు పాఠశాలల్లో అటకెక్కింది. తాగునీటి సరఫరాకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు మొరాయించడంతో అనేక ప్రాంతాల్లో మరమ్మతుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. పథకాల ఏర్పాటు వరకే తమ పని.. నిర్వహణ భారం పాఠశాలలదేనంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తేల్చి చెబుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అనేక పాఠశాలల్లో పైపులు పగిలిపోవడం, విద్యుత్ మోటార్లు పాడైపోవడం.. సింటెక్స్ ట్యాంకుల లీకేజీ తదితర కారణాలతో నీటి పథకాలు నిరుపయోగమయ్యాయి. ఈ కారణంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనానంతరం తాగునీటి కోసం సమీపంలోని బోర్లు, హోటళ్లు, ఇళ్లను ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఇళ్ల నుంచే నీటి బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 2,524 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అధికారికంగా 2,170 పాఠశాలల్లో మంచినీటిని అందిస్తున్నామని చెబుతున్నా.. సగం పాఠశాలల్లోనూ నీరందడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడం గమనార్హం. అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య... ఆదోని మండలంలోని మదిరె జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో బోరు, మంచినీటి కొళాయి కనెక్షన్లు లేకపోవడంతో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మధ్యాహ్న భోజన నిర్వాహకులు గ్రామం నుంచి సైకిళ్లపై నీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. బలదూర్,ఆరేకల్, బసరకోడు, దిబ్బనకల్లు గ్రామాల్లోని పాఠశాలల్లో ఎలాంటి నీటి వసతి లేకపోవడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఆళ్లగడ్డ మండలంలోని తాండ, రుద్రవరం మండలంలో రెడ్డిపల్లె, పేరూరు, మాచినేనిపల్లె గ్రామాల్లోని పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు సమీపంలోని బోర్ల వైపునకు పరుగులు తీస్తున్నారు. బోర్లపై ఆధారపడుతున్నారు. ఆలూరులోని బాలుర ఉన్నత పాఠశాల-01, 02, బాలిక ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 600 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్దనున్న మంచినీటి లీకేజి పైపు గుంత వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు. మరికొందరు పాలిటెక్నిక్ కళాశాల వద్దనున్న ఉప్పునీటితో సరిపెట్టుకుంటున్నారు. దేవనకొండ, ఆలూరు ఎమ్మెల్యే స్వగ్రామమైన తెర్నేకల్లు జెడ్పీ పాఠశాలల్లో తాగునీరు లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచే నీటిని బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. హొళగుంద హైస్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఎక్కిళ్లొస్తే ప్లేట్లతో పాఠశాలకు సమీపంలోని పంప్‌హౌస్ వద్దకు పరుగులు తీస్తున్నారు. బనగానపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సమీపంలో ఉన్న వ్యవసాయ బావులే శరణ్యమవుతున్నాయి. -
మేరీమాత ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఆలయంలో ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు. గుణదలమాత ఆలయ ఆవరణలోని కమ్యూనిటీ హాలులో గురువారం సాయంత్రం ఉత్సవాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పటిష్టమైన ప్రణాళికతో తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కొండ ఎగువ భాగం నుంచి పలు ప్రదేశాల్లో తాత్కాలిక నీటి ట్యాంకులు సిద్ధం చేస్తామని చెప్పారు. భక్తులు క్రమపద్ధతిలో మేరీమాతను దర్శించుకునేందుకు బారికేడ్లు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదించి విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కథోలిక పీఠం కోశాధికారి ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఎస్ఎస్సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, యూత్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ దేవకుమార్, ఫాదర్ కిషోర్ పాల్గొన్నారు. -
వరద ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ప్రారంభం
సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్‌కు ప్రశంసలు జిల్లాలోని వరద ప్రాంతాల్లో సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నీటి ట్యాంకులను శుక్రవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రారంభించారు. 2009 అక్టోబర్ 2వ తేదీన జిల్లాను వరద ముంచెత్తిన సందర్భంలో తుంగభద్ర నదీ తీర ప్రాంతాలు అతలాకుతలమై లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని తక్షణమే ఆదుకునేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. వైఎస్సార్ ఫౌండేషన్ సహకారంతో సహాయ నిధిని సేకరించి... వరదలు ముంచెత్తిన కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని బాధితులకు చీర, ధోవతి, దుప్పటి, టవల్తోపాటు బియ్యం తదితర నిత్యావసర సరుకులు గల కిట్లను తక్షణ సాయంగా అందజేసింది. అనంతర కార్యక్రమంలో భాగంగా మంచి నీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టింది. నలభై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆరు ట్యాంకులను నిర్మించింది. ఇలా కర్నూలు మండలంలోని నిడ్జూరు, సుంకేశుల, జి శింగవరం, సీ బెళగల్ మండలంలోని ముడుమాల, సంగాల, గుండ్రేవుల గ్రామాల్లో ఈ ట్యాంకులను సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించాయి. కనీసం 500 అడుగులకు మించి లోతుగా బోర్లు వేస్తే తప్ప మంచినీరు పడని తమ గ్రామాల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకుల ద్వారా రక్షిత మంచినీటిని అందించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వై. ఈశ్వరప్రసాదరెడ్డి, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, ప్రొడక్షన్ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, వైఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి జనార్దన్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.