వరద ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ప్రారంభం
సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్‌కు ప్రశంసలు
జిల్లాలోని వరద ప్రాంతాల్లో సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నీటి ట్యాంకులను శుక్రవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రారంభించారు. 2009 అక్టోబర్ 2వ తేదీన జిల్లాను వరద ముంచెత్తిన సందర్భంలో తుంగభద్ర నదీ తీర ప్రాంతాలు అతలాకుతలమై లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని తక్షణమే ఆదుకునేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. వైఎస్సార్ ఫౌండేషన్ సహకారంతో సహాయ నిధిని సేకరించి... వరదలు ముంచెత్తిన కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని బాధితులకు చీర, ధోవతి, దుప్పటి, టవల్‌తోపాటు బియ్యం తదితర నిత్యావసర సరుకులు గల కిట్లను తక్షణ సాయంగా అందజేసింది. అనంతర కార్యక్రమంలో భాగంగా మంచి నీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టింది.
నలభై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆరు ట్యాంకులను నిర్మించింది. ఇలా కర్నూలు మండలంలోని నిడ్జూరు, సుంకేశుల, జి శింగవరం, సీ బెళగల్ మండలంలోని ముడుమాల, సంగాల, గుండ్రేవుల గ్రామాల్లో ఈ ట్యాంకులను సాక్షి, వైఎస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించాయి. కనీసం 500 అడుగులకు మించి లోతుగా బోర్లు వేస్తే తప్ప మంచినీరు పడని తమ గ్రామాల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకుల ద్వారా రక్షిత మంచినీటిని అందించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వై. ఈశ్వరప్రసాదరెడ్డి, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి, ప్రొడక్షన్ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, వైఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి జనార్దన్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.