లక్షలు వెచ్చించినా లక్ష్యం నెరవేరలేదు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్/కొవ్వూరు : ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొవ్వూరు మండలంలో ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు నిరుపయోగంగా మారడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని కుమారదేవం ఎస్సీ కాలనీలో జాతీయ గ్రామీణ మంచినీటి సరఫరా పథకంలో భాగంగా రూ.12.5 లక్షలు వ్యయంతో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు, బోరు, పైపులు ఏర్పాటు చేశారు.
బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో తొమ్మిది నెలలుగా ఈ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆరికిరేవులలో ఎన్‌ఆర్‌డీడబ్యూపీ పథకం కింద రూ.15 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో గ్రామస్తులకు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పశివేదలలో తాగునీరందక 10, 11, 12 వార్డుల ప్రజలు అల్లాడుతున్నారు. నీటి కోసం గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు.
తాళ్లపూడిలో తప్పని తిప్పలు మండలంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి జలాలు శుద్ధి చేసి అందించే జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పథకం పూర్తయితే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరతాయి. పోచవరం పంచాయతీ పరిధిలోని తుపాకులగూడెంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించాల్సి ఉంది. గజ్జరంలో అదనంగా ట్యాంకు నిర్మించాల్సి ఉంది. బల్లిపాడు, పెద్దేవం శివారు చిడిపి వార్డులోను ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అదనంగా రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుగుడుమెట్టలో అదనంగా మరో ట్యాంకు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వేగేశ్వరపురంలో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు.
కిలోమీటర్ వెళ్లాల్సిందే
చాగల్లు మండలంలో తాగునీటి కోసం పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దారవరం, ఊనగట్ల ఎస్సీ కాలనీల్లో తాగునీరు అందడం లేదు. మీనానగరంలో వాటర్ ట్యాంకు నుంచి నీరు అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది.