Kovvur zone
-
కొవ్వూరులో వలస కూలీల ఆందోళన
కొవ్వూరు: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని వందలాది మంది వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం ఆందోళనకు దిగారు. గోదావరిలో ఇసుక తవ్వే పనుల కోసం ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కొవ్వూరుకు వందలాది కార్మికులు వలస వచ్చారు. లాక్డౌన్ కారణంగా వారంతా పనులు లేకుండా ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కొవ్వూరు టోల్గేట్ జంక్షన్ వద్దకు చేరుకునే సరికి వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. అనంతరం కార్మికులు కొంతమంది పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్లదాడిలో తణుకు సీఐ చైతన్యకృష్ణతో పాటు పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజేశ్వరరెడ్డి 3 రోజుల్లో తరలింపునకు రైలు ఏర్పాటు చేస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు. -
మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త
సాక్షి, పెరవలి(పశ్చిమగోదావరి) : తణుకు పరిసర ప్రాంతాల్లో చైన్ స్కాచింగ్ చేసే 30 మంది మహిళా దొంగలు ఉన్నారని, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని, వారు కనబడితే సమాచారం ఇవ్వాలని కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెరవలి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వచ్చిన ఆయన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా దొంగలు రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ఎక్కి మహిళల మెడలో ఉండే వస్తువులను ఎంతో చాకచక్యంగా దొంగిలిస్తారని తెలిపారు. అదే నిర్మానుష ప్రాంతాలైతే దాడులకు కూడా తెగబడతారని హెచ్చరించారు. నగలు వేసుకుని ఒంటరిగా వెళ్లవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, వాహనదారులు కూడా సహకరించాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి గ్రామం వద్ద స్పీడ్ కంట్రోల్ చేసే స్టాపర్లు ఏర్పాటు చేశామని దీనివల్ల ప్రమాదాలు తగ్గాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, లేనిపక్షంలో జరిమానా తప్పదని, దీనివల్ల ప్రయాణికులకే భద్రత ఉంటుందన్నారు. పెరవలి పోలీస్‌స్టేషన్ రికార్డుల నిర్వహణ బాగుందని, సిబ్బంది పనితీరు కూడా బాగానే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వైబీ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరుగురు అరెస్ట్: రూ.11.13 లక్షల సొత్తు సీజ్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,13,600లు విలువ చేసే బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 28 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. -
లక్షలు వెచ్చించినా లక్ష్యం నెరవేరలేదు
న్యూస్‌లైన్ నెట్వర్క్/కొవ్వూరు : ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొవ్వూరు మండలంలో ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు నిరుపయోగంగా మారడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని కుమారదేవం ఎస్సీ కాలనీలో జాతీయ గ్రామీణ మంచినీటి సరఫరా పథకంలో భాగంగా రూ.12.5 లక్షలు వ్యయంతో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు, బోరు, పైపులు ఏర్పాటు చేశారు. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో తొమ్మిది నెలలుగా ఈ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆరికిరేవులలో ఎన్ఆర్డీడబ్యూపీ పథకం కింద రూ.15 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో గ్రామస్తులకు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పశివేదలలో తాగునీరందక 10, 11, 12 వార్డుల ప్రజలు అల్లాడుతున్నారు. నీటి కోసం గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. తాళ్లపూడిలో తప్పని తిప్పలు మండలంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి జలాలు శుద్ధి చేసి అందించే జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పథకం పూర్తయితే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరతాయి. పోచవరం పంచాయతీ పరిధిలోని తుపాకులగూడెంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించాల్సి ఉంది. గజ్జరంలో అదనంగా ట్యాంకు నిర్మించాల్సి ఉంది. బల్లిపాడు, పెద్దేవం శివారు చిడిపి వార్డులోను ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అదనంగా రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుగుడుమెట్టలో అదనంగా మరో ట్యాంకు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వేగేశ్వరపురంలో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. కిలోమీటర్ వెళ్లాల్సిందే చాగల్లు మండలంలో తాగునీటి కోసం పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దారవరం, ఊనగట్ల ఎస్సీ కాలనీల్లో తాగునీరు అందడం లేదు. మీనానగరంలో వాటర్ ట్యాంకు నుంచి నీరు అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది.