సోమవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆందోళన చేస్తున్న వలస కార్మికులు
కొవ్వూరు: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని వందలాది మంది వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం ఆందోళనకు దిగారు. గోదావరిలో ఇసుక తవ్వే పనుల కోసం ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కొవ్వూరుకు వందలాది కార్మికులు వలస వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా వారంతా పనులు లేకుండా ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కొవ్వూరు టోల్‌గేట్ జంక్షన్ వద్దకు చేరుకునే సరికి వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. అనంతరం కార్మికులు కొంతమంది పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్లదాడిలో తణుకు సీఐ చైతన్యకృష్ణతో పాటు పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజేశ్వరరెడ్డి 3 రోజుల్లో తరలింపునకు రైలు ఏర్పాటు చేస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment