యాచారం, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో పాలన పడకేసింది. మండలంలో 20 గ్రామాలకు గాను నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికీ ఐదేసి గ్రామాల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు నిత్యం ఏ గ్రామంలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్ర స్థాయిలో పరిపాలన సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో ముఖ్యం. రెండు, మూడేళ్లుగా పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు.
మూడు నెలల క్రితం ఆరుగురు పంచాయతీ కార్యదర్శులుండగా మాల్ కార్యదర్శి వీణ ప్రసూతి సెలవులో వెళ్లగా, చౌదర్‌పల్లి కార్యదర్శి మిస్కిన్ రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలింది శ్రీనివాస్, రాములు, సురేష్‌కుమార్, పురుషోత్తంరెడ్డి మాత్రమే. ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు అప్పగించారు. మండలంలోని 14 క్లష్టర్లకు గాను 14 మంది పంచాయతీ కార్యదర్శులుండాలి. కానీ మండలంలో నలుగురు మాత్రమే ఉండడంతో విధుల్లో భారంతో పాటు ప్రజలకు సరైనా న్యాయం చేయలేకపోతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా తెరుచుకోని పరిస్థితి ఉంది.
ముందుకు సాగని అభివృద్ధి పనులు
పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేక పర్యవేక్షణ కరువై అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సీసీ రోడ్లు, నీటి ట్యాంకులు, డ్రైనేజీ కాల్వలు, భవన నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్ల పనులు పూర్తిగా కుంటుబడ్డాయి. పలు గ్రామాల్లో రూ. కోట్ల విలువ జేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా కట్టడి చేసే నాథుడే లేకుండా పోయారు. కొద్ది రోజుల క్రితం తక్కళ్లపల్లి తండాలో రూ. పది లక్షలకు పైగా విలువ జేసే జీపీ ఆక్రమణకు గురవగా ప్రజల ఫిర్యాదు మేరకు ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ రక్షించి హద్దులు పాతారు. రూ. లక్షలాది పన్నులు కూడా వసూలు కాని పరిస్థితి ఉంది.
వీధిలైట్లు కాలిపోయి మరమ్మతులు లేక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. అనుమతుల్లేకుండానే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకుంటున్నా అడిగే వారు లేరు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాల నమోదు, పన్నులు చెల్లింపు, ఇంటి అనుమతులు, లెసైన్సులు తదితర పనుల నిమిత్తం ప్రజలు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శులను నియమించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
కార్యదర్శుల కొరత.. పాలన పడక
Published Mon, May 26 2014 12:02 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
Advertisement