కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: పాఠశాలల్లో విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. చాలాచోట్ల నీటి ట్యాంకులు, సింటెక్స్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. రక్షిత మంచినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన జలమణి పథకం పలు పాఠశాలల్లో అటకెక్కింది. తాగునీటి సరఫరాకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు మొరాయించడంతో అనేక ప్రాంతాల్లో మరమ్మతుకు నోచుకోని పరిస్థితి నెలకొంది.
పథకాల ఏర్పాటు వరకే తమ పని.. నిర్వహణ భారం పాఠశాలలదేనంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తేల్చి చెబుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అనేక పాఠశాలల్లో పైపులు పగిలిపోవడం, విద్యుత్ మోటార్లు పాడైపోవడం.. సింటెక్స్ ట్యాంకుల లీకేజీ తదితర కారణాలతో నీటి పథకాలు నిరుపయోగమయ్యాయి. ఈ కారణంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనానంతరం తాగునీటి కోసం సమీపంలోని బోర్లు, హోటళ్లు, ఇళ్లను ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఇళ్ల నుంచే నీటి బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 2,524 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అధికారికంగా 2,170 పాఠశాలల్లో మంచినీటిని అందిస్తున్నామని చెబుతున్నా.. సగం పాఠశాలల్లోనూ నీరందడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడం గమనార్హం.
అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య...
ఆదోని మండలంలోని మదిరె జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో బోరు, మంచినీటి కొళాయి కనెక్షన్లు లేకపోవడంతో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మధ్యాహ్న భోజన నిర్వాహకులు గ్రామం నుంచి సైకిళ్లపై నీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. బలదూర్,ఆరేకల్, బసరకోడు, దిబ్బనకల్లు గ్రామాల్లోని పాఠశాలల్లో ఎలాంటి నీటి వసతి లేకపోవడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
ఆళ్లగడ్డ మండలంలోని తాండ, రుద్రవరం మండలంలో రెడ్డిపల్లె, పేరూరు, మాచినేనిపల్లె గ్రామాల్లోని పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు సమీపంలోని బోర్ల వైపునకు పరుగులు తీస్తున్నారు. బోర్లపై ఆధారపడుతున్నారు.
ఆలూరులోని బాలుర ఉన్నత పాఠశాల-01, 02, బాలిక ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 600 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్దనున్న మంచినీటి లీకేజి పైపు గుంత వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు. మరికొందరు పాలిటెక్నిక్ కళాశాల వద్దనున్న ఉప్పునీటితో సరిపెట్టుకుంటున్నారు.
దేవనకొండ, ఆలూరు ఎమ్మెల్యే స్వగ్రామమైన తెర్నేకల్లు జెడ్పీ పాఠశాలల్లో తాగునీరు లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచే నీటిని బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు.
హొళగుంద హైస్కూల్‌లో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఎక్కిళ్లొస్తే ప్లేట్లతో పాఠశాలకు సమీపంలోని పంప్‌హౌస్ వద్దకు పరుగులు తీస్తున్నారు.
బనగానపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సమీపంలో ఉన్న వ్యవసాయ బావులే శరణ్యమవుతున్నాయి.
వెక్కిళ్లొస్తే.. పరుగోపరుగు!
Published Tue, Dec 17 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement
Advertisement