సుందర తిరునగరి
రూ.1200 కోట్లతో నగరాభివృద్ధికి డీపీఆర్
తాగునీరు, డ్రైనేజీ, రింగురోడ్డు, రవాణాపై ప్రధాన దృష్టి
త్వరలోనే కలెక్టర్‌కు అందనున్న డీపీఆర్ నివేదిక
సాక్షి, తిరుపతి : తిరుపతి నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు నడుస్తోంది. కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, రవాణ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ అవసరాలను గుర్తిస్తున్నారు. ప్రధానంగా నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వనరులు, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్- రవాణా, రింగురోడ్డు తదితర సౌకర్యాల కల్పనకు ఒక సమగ్ర నివేదిక రూపొందుతోంది. నగరానికి చెందిన సిస్ట్ అనే సంస్థకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపొందించే బాధ్యతలు అప్పగించారు. కేవలం డీపీఆర్ రూపొందించే ప్రైవేటు కన్సల్టెన్సీకి రూ.56 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అధికారుల అంచనాల ప్రకారం డీపీఆర్‌లో పొందుపరిచే అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు *1,200 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోనున్నారని సమాచారం. దశల వారీగా నిధులు మంజూరు చేసినా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కష్టం కాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది.
మరో తాగునీటి ట్యాంకు
తిరుపతి నగరానికి తాగునీటినందించేందుకు రామాపురం వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తరహాలోనే మరో ట్యాంకు అవసరమని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. రామాపురం ట్యాంకు సామర్థ్యం 200 ఎంసీఎఫ్‌టీలు కాగా తాజాగా అంతే సామర్థ్యం కలిగిన మరో ట్యాంకు నిర్మిస్తే భవిష్యత్తులో నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ట్యాం కు నిర్మాణానికి కనీసంగా 250 ఎకరాల స్థలం అవసరం. తిరుపతి పరిసరాల్లో అంత స్థలం దొరకడం కష్టం. ఒకవేళ స్థల సేకరణ సమస్యగా మారితే రామాపురం ట్యాంకు సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా నగరంలో అంతర్గత రోడ్లు, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలను మెరుగుపరచేందుకు కూడా కొత్త ప్రాజెక్ట్‌లో మార్గాలు పొందుపరుస్తున్నారు. కార్పొరేషన్‌లో విలీనం చేసిన ఎమ్మార్‌పల్లె సహా మిగిలిన మూడు మేజ ర్ పంచాయతీలను కూడా ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి చేర్చారు. దీంతో తా గునీరు, డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న ఈ పంచాయతీలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఈ పంచాయతీలకు ప్రధానంగా తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు అంతర్గత డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ సిస్టంను కూడా తాజా డీపీఆర్‌లో పొందుపరుస్తున్నారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తిరుపతి జాతీయ రహదారికి సమాంతరంగా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను కూడా సర్వేసంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చితే తిరుపతి నగర పరిసరాల్లోని నివాస ప్రాంతాలు అత్యంత ఖరీదైనవిగా మారుతాయని, తద్వారా ఆయా ప్రాంతవాసుల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. డీపీఆర్ రూపొందిస్తున్న కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఇటీవల జిల్లా కలెక్టర్, తిరుపతి నగర ప్రత్యేకాధికారి సిద్ధార్థజైన్ పలు దఫాలు సమావేశమై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ రిపోర్టును త్వరలోనే కలెక్టర్‌కు అందజేయనున్నారు.