Tirupati Urban Development Authority (tuda)
-
తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం తుడా కార్యాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టిన చెవిరెడ్డి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మహానేత వైఎస్ఆర్ హయాంలోనూ చెవిరెడ్డి తుడా చైర్మర్‌గా పనిచేశారు. తుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెవిరెడ్డి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారిని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విడివిడిగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబసమేతంగా... ఎమ్మెల్యేలు స్వామివారిని సేవించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందజేస్తామన్నారు. ఏపీకి వైఎస్ జగన్ దీర్ఘకాలం సీఎంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. -
తుడా అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు కృష్ణారెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. తుడాలో కృష్ణారెడ్డి స్పెషల్ గ్రేడ్ ప్లానింగ్ ఆఫీసర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శాటిలైట్ సాయంతో తుడా మాస్టర్ ప్లాన్
తిరుపతి తుడా: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు శాటిలైట్ సహాయం తీసుకోనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులతో ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం అధికారులతో చర్చించి ప్లాన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఆరు నెలలుగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు తుడా కృషి చేస్తోంది. ఎట్టకేలకు ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం తుడా మాస్టర్ ప్లాన్‌కు ముందుకొచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో తొమ్మిది నెలల కాల వ్యవధికి తుడాకు మాస్టర్ ప్లాన్ పూర్తి చేసిచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధుల బృందం సమావేశమై చర్చించింది. శనివారం రోజున మరోసారి లీ బృందం తుడా అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో శాటిలైట్, ఏరియల్ సర్వేపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. తుడా పరిధిలోకి తొమ్మిది మండలాలు (తిరుపతి అర్బన్,రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, పుత్తూరు మండలాలు) వస్తాయి. ఈ తొమ్మిది మండలాలను కలుపుతూ తుడా మాస్టర్ ప్లాన్ కోసం లీ బృందం శాటిలైట్ సహాయం తీసుకోనుంది. అదేవిధంగా ఆగస్టు మూడో వారంలోపు ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందుకు లీ బృందం తుడా సహకారం కోరినట్టు అధికారులు తెలిసింది. ఆగస్టులో పర్యటన తుడా మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి లీ కన్సల్టెన్సీ బృందం ఆగస్టు మూడోవారంలో పూర్తి స్థాయిలో పర్యటించనునంది. ఆ సంస్థకు చెందిన ప్రధాన బృందం ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి తుడా పరిధిని పర్యవేక్షిస్తారు. తుడా పరిధిలోని గ్రామాలు, ప్రధాన రోడ్లు, ైరె ల్వే మార్గాలు, చెరువులు, కాలువలు, భూముల వివరాలతో పక్కా మాస్టర్ ప్రింట్‌ను సిద్ధం చేయనున్నారు. మూడు నెలల్లో ముందుగా బ్లూప్రింట్ సిద్ధం చేయాలి తుడా వీసీ లీ కన్సల్టెన్సీని ఆదేశించారు. -
కేంద్రం చేతిలో తిరుపతిభవిత
- ఏపీ హై పవర్ కమిటీ సిఫార్సు - స్మార్ట్ సిటీ జాబితాలో చోటుకోసం పోటీ తిరుపతి తుడా: ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి నగర అభివృద్ధి కేంద్రం చేతుల్లో ఉంది. దేశవ్యాప్తంగా 100నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ నుంచి మూడు నగరాలను స్మార్ట్ సిటీకి అర్హత కలిగినవిగా ఎంపిక చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల మొదటి వారంలో ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నగరాలను ఎంపిక చేసుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కమిటీ ఈ నెల 28న సమావేశమై విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్‌కు ఎంపిక చేసింది. ఎంపికచేసిన జాబితాను కేంద్రానికి జూలై 31న అందజేశారు. స్మార్ట్ సిటీలకు అవసరమయ్యే అర్హతలను పరిశీలించి కేంద్రం ఆగస్టుకల్లా తుది జాబితాను విడుదల చేయనుంది. ఈ జాబితాలో తిరుపతికి స్థానం దొరికినట్టేగా దాదాపు కనిపిస్తోంది. అన్ని విధాలా సానుకూలంగా ఉన్నాయి. చివరి దిశలో ఉన్న ఈ వ్యవహారం తుది జాబితా విడుదల కేంద్ర చేతుల్లో ఉంది. ఆధునిక హంగులు స్మార్ట్ నగరంగా అభివృద్ధి చెందితే తిరుపతి నగరం పరిధి విస్తరించనుంది. మరో వెయ్యి ఎకరాలతో పాటు చుట్టపక్కల గ్రామాలు తిరుపతిలో కలిసిపోనున్నాయి. దీంతో తిరుపతి నగర పరిధి విస్తరించనుంది. అభివృద్ధి విషయానికి వస్తే అత్యాధునిక భవనాలు, కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఆధునిక మల్టీప్లెక్స్ హాల్స్, పార్కులు, ఫుట్‌పాత్‌లు, బస్టాప్‌లు, మరుగుదొడ్లు, ఆస్పత్రులు ఇలా అన్ని హంగులతో అభివృద్ధి చేస్తారు. స్మార్ట్ సిటీలో 24 గంటలూ విద్యుత్, తాగునీరు, వైఫై సౌకర్యాలుంటాయి. విశాలవంతమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు కూడళ్లను అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు పట్టాలెక్కితే కేంద్రం తొలివిడతగా సెప్టెంబర్ కల్లా రూ.500 కోట్లను విడుదల చేస్తుంది. -
టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ
తిరుమల: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)లో ఎండోమెంట్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ జనవరి 31, 2013లో టీటీడీకి వచ్చారు. దేవస్థానం రెవెన్యూ, పంచాయతీ విభాగాలను సమర్థంగా నడిపారు. దేవస్థానం పరిధిలో పేరుకుపోయిన రెవెన్యూ బకాయిలనువసూలు చేయించగలిగారు. ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టు విషయంలో ఆశావహుల జాబితా పెరిగింది. అప్పట్లో ఈయన బదిలీపై ఊహాగానాలు వచ్చాయి. ఆయన పదవీ కాలాన్ని జనవరి 2016 వరకు పెంచుతూ రెండు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో టీటీడీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తిరుపతిలో ఉండే స్థలాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది వివాదాస్పదమైంది. ఈ తరుణంలో ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. చడీచప్పుడు లేకుండా ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ కావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టును తమ వారికి ఇప్పించేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు బడా నేతలు రంగంలో దిగి తీవ్రస్థాయిలో పోటీపడుతున్నట్టు సమాచారం. -
ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల పేరొందింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో.. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పూనుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ(యూఎంటీసీ) అనే ప్రైవేటు సంస్థతో సర్వే చేయించింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్‌స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కిమీల మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించింది. మోనో రైలు మార్గం.. ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్ల మేర అవసరం అవుతాయని ఆ సంస్థ తుడాకు నివేదిక ఇచ్చింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ పక్కనే ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళుతున్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని తేల్చింది. ఒక్కో సారి గరిష్ఠంగా 500 మంది భక్తులను మోనో రైలు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆవశ్యకతను తుడా గుర్తించింది. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ సెప్టెంబర్ 15న తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆమోదానికి పంపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. మోనో రైలు ప్రాజెక్టును ఆ ప్రణాళికలోనే చేర్చాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పూనమలై-గిండీ-పోరూర్-వడపళణి మధ్య 20.68 కిమీల మేర రూ.3,267 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ ఆమోదం తెలిపింది. కానీ.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరించింది. తుడా వద్ద ఆ మేరకు నిధులు అందుబాటులో లేని నేపథ్యంలో.. తిరుమల మోనో రైలు ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించింది. స్మార్ట్ సిటీలను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)లో చేపడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టునూ అదే పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? ప్రభుత్వ నిధులతోనే చేపడుతుందా? ఆ ప్రాజెక్టును తిరస్కరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరుమల మోనో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
33 మండలాలతో నుడా!
నెల్లూరు, సిటీ: 33 మండలాలతో కూడిన ‘నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ’(నుడా) ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటనలో భాగంగా నగరం అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరారన్నారు. 33 మండలాలతో కూడిన ‘నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ’(నుడా) ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాగునీరు, అండర్‌బ్రిడ్జ్ సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా చీఫ్ ఇంజనీర్ పోస్టును కూడా భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మీసేవలో పొందుతున్నారని, త్వరలో మరిన్ని మున్సిపాలిటీ సేవలను మీసేవలోనే పొందేందుకు వీలు కల్పిస్తామని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేలు చేయిస్తామని పేర్కొన్నారు. డ్రైనేజీని శుభ్రపరిచేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. -
తుడా.. నేల విడిచి సాము
నేల విడిచి సాము చేయడమంటే ఇదే..! నిధుల లభ్యత .. ప్రజావసరాలను విస్మరించి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ క్రమంలో నగరాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరునగరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నవంబర్ 6, 1981న ప్రభుత్వం తుడాను ఏర్పాటుచేసింది. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, ఏర్పేడు, పుత్తూరు మండలాల్లోని 160 గ్రామాలను తుడా పరిధలోకి తెచ్చింది. రియల్ ఎస్టేట్ లే-అవుట్లకు ఆమోదం, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) ద్వారా వచ్చే ఆదాయం, వాణిజ్య దుకాణాల అద్దెలు, టీటీడీ, వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తుడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఆ మేరకు ఏటా బడ్జెట్‌ను రూపొందించుకుని.. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ.. తుడా తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిధుల రాబడి.. లభ్యతతో నిమిత్తం లేకుండా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ ప్రాజెక్టుల అమలుకు నిధులు లేకపోవడంతో చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో నగరాభివృద్ధికి దోహదం చేసే.. ప్రజాసమస్యలు పరిష్కరించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. తిరుపతిలో ట్రాఫిక్ నానాటికీ అధికమవుతోండటంతో పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం రద్దీ అధికంగా ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్, ఎస్వీ మహిళా కాలేజీల వద్ద సబ్‌వేలు, లీలా మహల్ జంక్షన్, అన్నమయ్య జంక్షన్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జిలను రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ఓ ప్రాజెక్టును తుడా సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్య కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ.. ఇప్పటికి కేవలం శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద మాత్రమే సబ్వే నిర్మించారు. నిధులు లేకపోవడంతో తక్కిన వాటిని పక్కన పెట్టేశారు. తిరుపతిలో వసతి లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. దీన్ని నివారించేందుకు శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుచానూరు ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో మల్టీస్టోర్ పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తుడా ప్రాజెక్టును రూపొందిం చింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్యన పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఇప్పటికీ ఆ ప్రాజెక్టులను చేపట్టలేని దుస్థితి నెలకొంది. డెయిరీ ఫామ్ సర్కిల్ లెవల్ క్రాసింగ్ నుంచి ప్రకాశం రోడ్డు వరకు ఒకటి, రాయలచెరువు రోడ్డు లెవల్ క్రాస్ వద్ద మరొక రోడ్ ఓవర్ బ్రిడ్జి, అన్నమయ్య జంక్షన్ నుంచి తిరుచానూరు వైపు ఫ్లై ఓవర్‌ను రూ.90 కోట్లతో నిర్మించేందుకు రూపొందించిన ప్రాజెక్టునూ 2012-16లోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండును రూ.47 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టుతో పాటు ఎన్నో ప్రాజెక్టులు నిధుల్లేక చేపట్టలేని దుస్థితి నెలకొంది. మింగ మెతుకు లేదు గానీ.. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తుడా అధికారులు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులను రూపొందించి.. అమలుచేయలేక చతికిలపడుతుండటం గమనార్హం. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజూ 75 వేల మంది భక్తులు తిరుపతికి వస్తోన్న నేపథ్యంలో.. రవాణాను మెరుగుపర్చడానికి శ్రీకాళహస్తి-చంద్రగిరి మధ్య 53 కిమీల మేర బస్సులు ప్రయాణించడానికి మాత్రమే రూ.1020 కోట్లతో బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(బీఆర్టీఎస్)ను రూపొందించారు. ఈ ప్రాజెక్టును 2012-16లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ.. ఆ మేరకు నిధులు అందుబాటులో ఉంటాయా అన్న ఆలోచన కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, ఇస్కా న్ టెంపుల్, కపిలతీర్థం, అలిపిరి గేట్, అలివేలు మంగాపురంను కలిపేలా 22 కి.మీల మేర పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(పీఆర్టీఎస్)ను రూ.1100 కోట్లతో చేపట్టే ప్రణాళికను సైతం 2012-16లోగా పూర్తిచేయాలని తుడా అధికారులు నిర్దే శించుకోవడం గమనార్హం. కానీ.. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధులే అందుబాటులో లేవు. ఈ ప్రాజెక్టుల కథ ఇలా ఉంటే.. తాజాగా శ్రీకాళహస్తి నుంచి రాచగున్నేరి, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి మీదుగా పనపాకం వరకూ 53 కిమీల మేర రూ.2650 కోట్లతో కంప్యూటర్ రైల్ సిస్టమ్(సీఆర్ఎస్)ను చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును 2017-21 మధ్య కాలంలో పూర్తిచేయాలని నిర్దేశించడం కొసమెరుపు. -
తుడాకు కేంద్రం ఊతం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలోని ప్రజల రవాణా కష్టాలు కడతేరనున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్) పథకం కింద 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను కేంద్రం విడుదల చేసింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డీ.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుడా పరిధిలోని తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతూ వస్తోంది. పట్టణీకరణ అధికమవుతున్న మేరకు రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు అప్పలాయగుంటకు భక్తుల తాకిడి అధికమవుతుండడం.. స్థానిక జనాభా పెరిగిపోతుండడం.. రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో తుడా పరిధిలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. తుడా పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి 2011-12లో రూ.225 కోట్లతో తుడా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కనీసం లక్ష జనాభాకు 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని తుడా అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. తుడా పరిధిలో 450 బస్సుల కొనుగోలుకు రూ.225 కోట్లను విడుదల చేస్తామని అప్పట్లో కేంద్రం అంగీకరించింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలుకు రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లోనే కేంద్రం స్పష్టీకరించింది. ఆ మేరకు 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లను మంజూరు చేసింది. 2013-14లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను 4 నెలల క్రితం విడుదల చేసింది. 2014-15 బడ్జెట్లో 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లో 65 బస్సుల కొనుగోలుకు నిధులను విడుదల చేస్తే.. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తవుతుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్లో 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను మంజూరు చేశారు. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తై రవాణా కష్టాలు తీరడం ఖాయం. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయడం సంస్థకు జీవం పోసినట్లయిందని ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలకు కూ.. చుక్‌చుక్!
తిరుపతి నుంచి తిరుమలకు సురక్షితంగా భక్తులను చేర్చడానికి మోనో రైలును ఏర్పాటుచేయాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రతిపాదించింది. రూ.3,510 కోట్లతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను రూపొందించింది. ప్రాజెక్టును చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలని తుడా అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి విరాజిల్లుతోంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ మొత్తం పదివేల వాహనాల్లో 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. వాహనాలు అధికమవుతుండడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రమాదాలకు దారి తీస్తోంది. భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగి పడడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. భక్తులను సులభంగా ఏడుకొండల స్వామి వద్దకు చేర్చడానికి తుడా అనేక మార్గాలను అన్వేషించింది. అందులో రోప్ వే ఒకటి. రోపే వే పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. మోనో రైలుపై తుడా అధికారులు కసరత్తు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయడానికి నిపుణులతో కలిసి తుడా అధికారులు సర్వే చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు వెంబడే రైలు మార్గాన్ని నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తేల్చారు. ఇప్పటికే రోడ్డు మార్గం ఉండటంతో ఆ పక్కనే మోనో రైలు మార్గాన్ని నిర్మించడానికి అటవీశాఖ అనుమతులు కూడా సులభంగా వస్తాయని అంచనా వేశారు. ఈ క్రమంలోనే మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు రైలు మార్గం నిర్మించడానికి.. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ సముదాయంలో ఉన్న తిరుమల బస్‌స్టేషన్‌ను మోనో రైల్వే స్టేషన్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కపిలతీర్థం వద్ద ఓ రైల్వే స్టేషన్.. అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నివేదిక పంపారు. మోనో రైలు ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడినది కావడంతో కేంద్రంపైనే తుడా అధికారులు ఆశలు పెంచుకున్నారు. ఈనెల 15న తిరుపతి ఎంపీ వి.వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మోనో రైల్వే ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టు నివేదికను తనకు ఇవ్వడంతోపాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. తుడా అధికారులు ఈనెల 16న ఎంపీ వరప్రసాదరావుకు మోనో రైల్వే ప్రాజెక్టు నివేదికను అందించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు నివేదిక పంపారు. మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరిస్తే.. తక్కిన 50 శాతం టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం, తుడా భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఏదిఏమైనా మోనో రైల్వే ప్రాజెక్టు సాకారమైతే తిరుమలకు భక్తుల రవాణా కష్టాలు తీరినట్లే..! -
సుందర తిరునగరి
రూ.1200 కోట్లతో నగరాభివృద్ధికి డీపీఆర్ తాగునీరు, డ్రైనేజీ, రింగురోడ్డు, రవాణాపై ప్రధాన దృష్టి త్వరలోనే కలెక్టర్‌కు అందనున్న డీపీఆర్ నివేదిక సాక్షి, తిరుపతి : తిరుపతి నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు నడుస్తోంది. కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, రవాణ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ అవసరాలను గుర్తిస్తున్నారు. ప్రధానంగా నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వనరులు, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్- రవాణా, రింగురోడ్డు తదితర సౌకర్యాల కల్పనకు ఒక సమగ్ర నివేదిక రూపొందుతోంది. నగరానికి చెందిన సిస్ట్ అనే సంస్థకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపొందించే బాధ్యతలు అప్పగించారు. కేవలం డీపీఆర్ రూపొందించే ప్రైవేటు కన్సల్టెన్సీకి రూ.56 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అధికారుల అంచనాల ప్రకారం డీపీఆర్‌లో పొందుపరిచే అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు *1,200 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోనున్నారని సమాచారం. దశల వారీగా నిధులు మంజూరు చేసినా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కష్టం కాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. మరో తాగునీటి ట్యాంకు తిరుపతి నగరానికి తాగునీటినందించేందుకు రామాపురం వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తరహాలోనే మరో ట్యాంకు అవసరమని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. రామాపురం ట్యాంకు సామర్థ్యం 200 ఎంసీఎఫ్‌టీలు కాగా తాజాగా అంతే సామర్థ్యం కలిగిన మరో ట్యాంకు నిర్మిస్తే భవిష్యత్తులో నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ట్యాం కు నిర్మాణానికి కనీసంగా 250 ఎకరాల స్థలం అవసరం. తిరుపతి పరిసరాల్లో అంత స్థలం దొరకడం కష్టం. ఒకవేళ స్థల సేకరణ సమస్యగా మారితే రామాపురం ట్యాంకు సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా నగరంలో అంతర్గత రోడ్లు, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలను మెరుగుపరచేందుకు కూడా కొత్త ప్రాజెక్ట్‌లో మార్గాలు పొందుపరుస్తున్నారు. కార్పొరేషన్లో విలీనం చేసిన ఎమ్మార్‌పల్లె సహా మిగిలిన మూడు మేజ ర్ పంచాయతీలను కూడా ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి చేర్చారు. దీంతో తా గునీరు, డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న ఈ పంచాయతీలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఈ పంచాయతీలకు ప్రధానంగా తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు అంతర్గత డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ సిస్టంను కూడా తాజా డీపీఆర్‌లో పొందుపరుస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తిరుపతి జాతీయ రహదారికి సమాంతరంగా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను కూడా సర్వేసంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చితే తిరుపతి నగర పరిసరాల్లోని నివాస ప్రాంతాలు అత్యంత ఖరీదైనవిగా మారుతాయని, తద్వారా ఆయా ప్రాంతవాసుల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. డీపీఆర్ రూపొందిస్తున్న కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఇటీవల జిల్లా కలెక్టర్, తిరుపతి నగర ప్రత్యేకాధికారి సిద్ధార్థజైన్ పలు దఫాలు సమావేశమై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ రిపోర్టును త్వరలోనే కలెక్టర్‌కు అందజేయనున్నారు. -
తుడా చైర్మన్‌గా వెంకటరమణ కొనసాగేనా?
తుడా వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో పోతుంది ధర్మసంకటంలో ఎమ్మెల్యే సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కొనసాగే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ప్రమాణం చేశారు. ఇదంతా వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తిరుపతి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ్యునిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంకటరమణ తుడా చైర్మన్ పదవిలో కొనసాగే విషయమై శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనందున తుడాను వదులుకున్నట్టయితే ఆ పదవి మరో కార్యకర్తకు ఇచ్చే అవకాశం ఉంటుందని కొందరు సూచించినట్టు చెబుతున్నారు. నైతికంగా కూడా ఇది మంచిదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తుడాను వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యత్వం కూడా పోతుంది. దీంతో తుడాను వదులుకునే విషయంలో ఎమ్మెల్యే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ కీలకం కానుంది. దీంతో వెంకటరమణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలుగుదేశం వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. -
కూతెయ్యని రైలు
రైల్వే బడ్జెట్లో..జిల్లాకు మొండిచేయి తిరుపతి ‘మోడల్ స్టేషన్’కూ మోక్షం లేదు జిల్లాలో ట్రాక్ డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రస్తావనేదీ...? ‘డబుల్ డెక్కర్’ రైలైనా వచ్చేనా.! తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో మన జిల్లాకు మొండిచేయే మిగిలింది. అయితే గత ఏడాది రైల్వే మంత్రి ప్రకటించిన కాచిగూడ-తిరుపతి మధ్య ఒక డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్లు ఆర్భాటం చేశారు. ఇదైనా వస్తుందా అనేది అనుమానమే. అలాగే చెన్నై నుంచి రేణిగుంట మీదుగా ఔరంగాబాద్ వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించగా, ఈ రైలుకు సంబంధించి స్పష్టత లేదని రైల్వే యూనియన్లు అంటున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌కున్న ప్రాధాన్యం, వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ప్రతిసారీ రైల్వే అభివృద్ధి కమిటీ, రైల్వే యూనియన్లతో పాటు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నా రైల్వే మంత్రులు పెడచెవిన పెడుతున్నారు. జిల్లాలోని మదనపల్లె మార్గంలో విద్యుద్దీకరణ, చిత్తూరు మార్గంలో ట్రాక్ డబ్లింగ్ కోసం ప్రతిపాదనలు ఉన్నా బడ్జెట్లో వాటి గురించి ప్రస్తావనే చేయలేదు. జిల్లాలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల అవసరం ఉన్నా, బడ్జెట్లో వాటి ఊసే లేదు. గత ఏడాది చెప్పి.. అమలు కానివి మదనపల్లె నుంచి శ్రీనివాసపురం(కర్ణాటక) వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు సర్వేకి కూడా నోచుకోలేదు. మంగళూరు-కాచిగూడ మధ్య కొత్తగా రైలు ఏర్పాటు చేసి రేణిగుంట మీదుగా నడపాలని నిర్ణయించారు. ఇదీ అమలు కావడం లేదు. చెన్నై నుంచి నాగర్సోల్(షిరిడీకి దగ్గర) వరకు రేణిగుంట మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామన్నారు. ఇదీ ఏర్పాటు చేయలేదు. -
ఇక యుద్ధమే
=రాళ్లు రువ్వితే కాల్పులకు ఆదేశం =కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చిన ఎస్పీ సాక్షి, తిరుపతి : ఎర్రదొంగలపై యుద్ధం చేయడానికి పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. దాదాపు 500 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించేందుకు శుక్రవారం శేషాచలం అడవులకు బయల్దేరి వెళ్లారు. రాత్రి అటవీ శాఖ కార్యాలయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అదనపు ఎస్పీ ఉమామహేశ్వర శర్మ, సీఎఫ్‌వో రవికుమార్‌లు కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చారు. ఆ సమయంలో మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వీలైనంత వరకు ఎర్ర కూలీలను అరెస్టుచేసే ప్రయత్నం చేయాలని, రాళ్లు విసిరిన పక్షంలో కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశించినట్టు తెలిసింది. కూలీలు ఎక్కడెక్కడ ఉంటారు, వారి జాడలు ఏ విధంగా తెలుసుకోవాలి.. అనే అంశాలపై ఎస్పీ వీరికి వివరించారు. సాయుధ పోలీసులు తిరుపతి అర్బన్, కడప, చిత్తూరుల నుంచి కూంబింగ్‌కు వచ్చారు. చట్టపరిధిలో చేయాల్సింది చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు 342 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశాం. దీని వెనుక ఉన్న పెద్దలను అరెస్టు చేస్తాం... మా వద్ద కొన్ని పేర్లు ఉన్నాయి. కూలీలను పంపిస్తున్న మేస్త్రీలు, స్మగ్లర్లు, కింగ్పిన్లనూ వదిలేది లేదురూ. అని అన్నారు. దీని వెనుక ఎవరు ఆర్థికంగా ఆదుకుంటున్నారనే విషయాలపైనా ఆరా తీస్తున్నామని చెప్పారు. మార్గాలను చూపించే వారిని, వాహనాలను సరఫరా చేసే వారిపైనా దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులను హత్య చేయడం చిన్న విషయం కాదని అన్నారు. అటవీ సంపదను రక్షించడం అటవీ శాఖ బాధ్యత అని, అటవీ సిబ్బందిని ఆదుకోవడం తమ బాధ్యతని తెలిపారు. ఎర్రకూలీలకు ష్యూరిటీ ఇచ్చే వారిపైనా దృష్టి సారిస్తున్నామన్నారు. తమిళనాడులోని తిరునల్వేలి, వేలూరు జిల్లాలకు చెందిన ఎస్పీలతోనూ మాట్లాడుతున్నామని తెలిపారు. అక్కడ నుంచి కూలీలు రాకుండా ఉండేలా, అక్కడి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందని అన్నారు. అయితే ముందుగా ఈ జిల్లా వారికీ దీనిపై అవగాహన ఉండాలని సూచించారు. ఎర్రకూలీలు సిబ్బందిపై రాళ్ల దాడి చేస్తే కాల్పులు జరపడానికి అనుమతిచ్చినట్టు వెల్లడించారు. మరో మూడు నెలల్లో ఎర్రదొంగలు లేకుండా చేస్తాం : రవికుమార్ శేషాచలం అడవుల్లో ఎర్ర దొంగలను మరో మూడు నెలల్లో పూర్తిగా లేకుండా చేస్తామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవి కుమార్ అన్నారు. ఆయన ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ నుంచి అటవీ సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇస్తామని, ప్రస్తుతానికి పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుంటున్నామని, త్వరలోనే అటవీ సిబ్బందికి వాటిని అందజేస్తామని ఆయన వివరించారు. -
అడవిదొంగల అంతుచూస్తాం
=‘ఎర్ర’ కూలీల అదుపునకు సరికొత్త వ్యూహాలు =ఆయుధాలతోనే అడవుల్లోకి ఎర్రచందనం కోసం ఎంతకైనా తెగించే అడవిదొంగల అంతు చూడాలని అటవీశాఖ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే అనంతపురం నుంచి మంగళవారం రాత్రి ఆయుధాలు వచ్చాయి. తమ ఉద్యోగులపై జరిగిన దాడిని అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ఎర్రకూలీలను అడవిలోకే రానీయకుండా కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు. సాక్షి, తిరుపతి: ఎర్రచందనం కూలీలను, స్మగ్లర్లను అదుపు చేయడంలో భాగంగా అటవీ శాఖ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. అవసరమైతే కొత్త చట్టాల కోసం పోరాటం చేయాలని కూడా నిర్ణ యం తీసుకుంది. ఎర్రచందనం కోసం శేషాచల అడవుల్లోకి వచ్చే కూలీలను, స్మగ్లర్లను అడ్డుకునేందుకు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి 10 తుపాకులు కూడా మంగళ వారం రాత్రి వచ్చాయి. ఇప్పటి వరకూ ఇది కేవలం అట వీశాఖ సమస్య కావడంతో పోలీసు వ్యవస్థ దీనిపై పెద్ద గా దృష్టి కేంద్రీకరించలేదు. రెండురోజుల క్రితం ఇద్దరు అటవీ అధికారులు హత్యకు గురికావడంతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమయింది. రెండు శాఖలు కలసి నిర్ణయాలు తీసుకుని, ప్రస్తుతం శేషాచలం అడవుల్లో దాగి ఉన్న ఎర్రచందనం కూలీలను అక్కడి నుంచి తరి మికొట్టే యత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో శేషాచలం అడవుల నుంచి దాదాపు 300 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 103 మందిని మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టారు. వీరికి కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. మిగిలిన కూలీలను విచారిస్తున్నారు. కొండల్లో దాక్కుని ఉన్న వారినికూడా పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాల యంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. తిరుపతి అర్బన్ ఎస్పీ విభాగం నుంచి 20 మంది సాయుధ పోలీసులతో పాటు మరికొంత మంది టాస్క్ఫోర్సు సిబ్బందిని కలిపి ఇకపై అడవులకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఆయుధాలు లేకుండా అడవుల్లోకి వెళ్లరాదనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన ఆవశ్యకత లేదని, సమాచారం అందినా ఇకపై ఆయుధాలు లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు కూడా సూచనలు ఇచ్చారు. సాయుధ పోలీసుల సహాయంతోనే అడవుల్లోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. సాయుధ పోలీసులను కూడా రేంజర్ అదుపులో ఉంచాలని సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి షూట్ అట్ సైట్ ఆదేశాలు తీసుకుని రావాలని ఉన్నత స్థాయి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితిని స్వయంగా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చూడడంతో దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. కూలీలపై 302 సెక్షన్ కింద కేసు నమోదు? కూలీలపై పోలీసు శాఖ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసే విషయంపై ఆలోచిస్తోంది. 302 కేసు నమోదుచేస్తే ఇది దేశంలోనే అతి పెద్దదవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సాధారణ కోర్టులో విచారణ చేయడానికి, సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.