కూతెయ్యని రైలు
- రైల్వే బడ్జెట్‌లో..జిల్లాకు మొండిచేయి
- తిరుపతి ‘మోడల్ స్టేషన్’కూ మోక్షం లేదు
- జిల్లాలో ట్రాక్ డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రస్తావనేదీ...?
- ‘డబుల్ డెక్కర్’ రైలైనా వచ్చేనా.!
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో మన జిల్లాకు మొండిచేయే మిగిలింది. అయితే గత ఏడాది రైల్వే మంత్రి ప్రకటించిన కాచిగూడ-తిరుపతి మధ్య ఒక డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్లు ఆర్భాటం చేశారు. ఇదైనా వస్తుందా అనేది అనుమానమే. అలాగే చెన్నై నుంచి రేణిగుంట మీదుగా ఔరంగాబాద్ వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించగా, ఈ రైలుకు సంబంధించి స్పష్టత లేదని రైల్వే యూనియన్లు అంటున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌కున్న ప్రాధాన్యం, వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ప్రతిసారీ రైల్వే అభివృద్ధి కమిటీ, రైల్వే యూనియన్లతో పాటు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నా రైల్వే మంత్రులు పెడచెవిన పెడుతున్నారు.
జిల్లాలోని మదనపల్లె మార్గంలో విద్యుద్దీకరణ, చిత్తూరు మార్గంలో ట్రాక్ డబ్లింగ్ కోసం ప్రతిపాదనలు ఉన్నా బడ్జెట్‌లో వాటి గురించి ప్రస్తావనే చేయలేదు. జిల్లాలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల అవసరం ఉన్నా, బడ్జెట్‌లో వాటి ఊసే లేదు.
గత ఏడాది చెప్పి.. అమలు కానివి
మదనపల్లె నుంచి శ్రీనివాసపురం(కర్ణాటక) వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు సర్వేకి కూడా నోచుకోలేదు.
మంగళూరు-కాచిగూడ మధ్య కొత్తగా రైలు ఏర్పాటు చేసి రేణిగుంట మీదుగా నడపాలని నిర్ణయించారు. ఇదీ అమలు కావడం లేదు.
చెన్నై నుంచి నాగర్‌సోల్(షిరిడీకి దగ్గర) వరకు రేణిగుంట మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామన్నారు. ఇదీ ఏర్పాటు చేయలేదు.