నేల విడిచి సాము చేయడమంటే ఇదే..! నిధుల లభ్యత .. ప్రజావసరాలను విస్మరించి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ క్రమంలో నగరాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరునగరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నవంబర్ 6, 1981న ప్రభుత్వం తుడాను ఏర్పాటుచేసింది. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, ఏర్పేడు, పుత్తూరు మండలాల్లోని 160 గ్రామాలను తుడా పరిధలోకి తెచ్చింది. రియల్ ఎస్టేట్ లే-అవుట్లకు ఆమోదం, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా వచ్చే ఆదాయం, వాణిజ్య దుకాణాల అద్దెలు, టీటీడీ, వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తుడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి.
ఆ మేరకు ఏటా బడ్జెట్‌ను రూపొందించుకుని.. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ.. తుడా తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిధుల రాబడి.. లభ్యతతో నిమిత్తం లేకుండా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ ప్రాజెక్టుల అమలుకు నిధులు లేకపోవడంతో చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో నగరాభివృద్ధికి దోహదం చేసే.. ప్రజాసమస్యలు పరిష్కరించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
తిరుపతిలో ట్రాఫిక్ నానాటికీ అధికమవుతోండటంతో పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం రద్దీ అధికంగా ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్, ఎస్వీ మహిళా కాలేజీల వద్ద సబ్‌వేలు, లీలా మహల్ జంక్షన్, అన్నమయ్య జంక్షన్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జిలను రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ఓ ప్రాజెక్టును తుడా సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్య కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ.. ఇప్పటికి కేవలం శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద మాత్రమే సబ్‌వే నిర్మించారు. నిధులు లేకపోవడంతో తక్కిన వాటిని పక్కన పెట్టేశారు.
తిరుపతిలో వసతి లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. దీన్ని నివారించేందుకు శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుచానూరు ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో మల్టీస్టోర్ పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తుడా ప్రాజెక్టును రూపొందిం చింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్యన పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఇప్పటికీ ఆ ప్రాజెక్టులను చేపట్టలేని దుస్థితి నెలకొంది.
డెయిరీ ఫామ్ సర్కిల్ లెవల్ క్రాసింగ్ నుంచి ప్రకాశం రోడ్డు వరకు ఒకటి, రాయలచెరువు రోడ్డు లెవల్ క్రాస్ వద్ద మరొక రోడ్ ఓవర్ బ్రిడ్జి, అన్నమయ్య జంక్షన్ నుంచి తిరుచానూరు వైపు ఫ్లై ఓవర్‌ను రూ.90 కోట్లతో నిర్మించేందుకు రూపొందించిన ప్రాజెక్టునూ 2012-16లోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండును రూ.47 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టుతో పాటు ఎన్నో ప్రాజెక్టులు నిధుల్లేక చేపట్టలేని దుస్థితి నెలకొంది.
మింగ మెతుకు లేదు గానీ..
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తుడా అధికారులు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులను రూపొందించి.. అమలుచేయలేక చతికిలపడుతుండటం గమనార్హం. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజూ 75 వేల మంది భక్తులు తిరుపతికి వస్తోన్న నేపథ్యంలో.. రవాణాను మెరుగుపర్చడానికి శ్రీకాళహస్తి-చంద్రగిరి మధ్య 53 కిమీల మేర బస్సులు ప్రయాణించడానికి మాత్రమే రూ.1020 కోట్లతో బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(బీఆర్‌టీఎస్)ను రూపొందించారు. ఈ ప్రాజెక్టును 2012-16లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ.. ఆ మేరకు నిధులు అందుబాటులో ఉంటాయా అన్న ఆలోచన కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, ఇస్కా న్ టెంపుల్, కపిలతీర్థం, అలిపిరి గేట్, అలివేలు మంగాపురంను కలిపేలా 22 కి.మీల మేర పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(పీఆర్‌టీఎస్)ను రూ.1100 కోట్లతో చేపట్టే ప్రణాళికను సైతం 2012-16లోగా పూర్తిచేయాలని తుడా అధికారులు నిర్దే శించుకోవడం గమనార్హం. కానీ.. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధులే అందుబాటులో లేవు.
ఈ ప్రాజెక్టుల కథ ఇలా ఉంటే.. తాజాగా శ్రీకాళహస్తి నుంచి రాచగున్నేరి, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి మీదుగా పనపాకం వరకూ 53 కిమీల మేర రూ.2650 కోట్లతో కంప్యూటర్ రైల్ సిస్టమ్(సీఆర్‌ఎస్)ను చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును 2017-21 మధ్య కాలంలో పూర్తిచేయాలని నిర్దేశించడం కొసమెరుపు.
తుడా.. నేల విడిచి సాము
Published Thu, Nov 13 2014 2:21 AM | Last Updated on Tue, Aug 28 2018 5:59 PM
Advertisement
Advertisement