త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై దేశ ఆర్ధిక ప్రగతికి దోహదం చేసే రంగాల్లో ఒకటిగా నిలుస్తోన్న స్థిరాస్థి (రియల్ ఎస్టేట్) రంగం గంపెడాశలు పెట్టుకుంది. కరోనా తగ్గడంతో 2022లో ఇళ్ల విక్రయాలు 50 శాతానికి పైగా పెరిగాయి. రానున్న రోజుల్లో అదే జోరు కొనసాగాలంటే బడ్జెట్‌లో స్థిరాస్థి రంగానికి కేంద్రం ఊతం ఇవ్వాలని ఆ రంగం కోరుతోంది.
దేశ ప్రజలందరికి అందరికి ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద 2022 మార్చి 31 నాటికి మొత్తం 2 కోట్ల మంది లబ్ధి దారులు ఆమోదయోగ్యమైన ధరలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా కొన్ని రాయితీల్ని ప్రకటించింది.
ఇందులో భాగంగా 2019లో జీఎస్టీ కౌన్సిల్ మండలి సొంతింటిపై విధించే ట్యాక్స్‌ను తగ్గించింది. గతంలో ఎవరైనా ఇల్లు కొనుగోలు చేస్తే ఆ ఇంటిపై 8శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా.. దానిని కాస్త ఒక శాతానికి కుదించింది. ఆయా కేటగిరీలకు చెందిన ఇళ్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులు ఇళ్ల కొనుగోలు చేసేందుకు మక్కువ చూపే వారు.
ఇళ్ల ధరల పరిమితిని రూ.75లక్షలకు పెంచాలి
ప్రస్తుతం రూ.45లక్షలు అంతకంటే తక్కువ ధరలో ఉన్న ఇళ్లను అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. వీరికి కొన్ని ప్రయోజనాల్ని ప్రత్యేకంగా కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఇళ్ల ధరల్ని పరిగణలోకి తీసుకొని రూ45లక్షల పరిమితిని రూ.75లక్షలకు పెంచాలని స్థిరాస్థి వర్గాలు కోరుతున్నాయి.
గడువు 5ఏళ్లకు పెంచాలి
ప్రస్తుతం ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన లాభాల్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ - 54 ప్రకారం.. కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి వినియోగించుకోవచ్చు. ఆ డబ్బుతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కొనొచ్చు. కానీ దాని నిర్మాణం 3ఏళ్ల లోపు పూర్తయితేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నందున ఈ గడువును 5ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
జీఎస్టీ తగ్గించాలి
ఇళ్ల నిర్మాణానికి వాడే స్టీల్‌పై 18శాతం, సిమెంట్‌పై 28 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. కాబట్టి నిర్మాణ వ్యయాలు పెరిగి ఆ భారాన్ని కొనుగోలు దారులపై మోపాల్సి వస్తుందని స్థిరాస్థి వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment