Union Budget 2023-24 Highlights: In Rs 45.03 Lakh Crore Budget, Here Is How Much Each Sector Received - Sakshi
Sakshi News home page

‘అమృత’ ప్రగతికి... సప్తరుషి మంత్రం

Published Thu, Feb 2 2023 4:26 AM | Last Updated on Thu, Feb 2 2023 9:44 AM

In Rs 45 03 lakh crore Budget, Here is how much each sector Received - Sakshi

న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం పలు ప్రోత్సాహకాలు. మూలధన వ్యయంతో పాటు వృద్ధికి దోహదపడే రంగాలకు కేటాయింపుల్లో భారీ పెంపు. కీలకమైన వ్యవసాయానికి తగ్గింపు. ఆరోగ్య, విద్యా రంగాలకు అంతంతమాత్రం. రోడ్లు, మౌలిక తదితర రంగాలకు ఊపు. స్థూలంగా ఇవీ ‘అమృత్‌కాల్‌’బడ్జెట్‌ విశేషాలు. ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతకు, లోక్‌సభ ఎన్నికల వేళ ఓటరును సంతృప్తి పరచాల్సిన అనివార్యతకు మధ్య సమ తూకం సాధించేందుకు విత్త మంత్రి శాయశక్తులా ప్రయత్నించారు.

అదే సమయంలో వీలున్నంత వరకూ ‘వృద్ధి బాట’నే సాగారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్‌లో వేసిన పునాదులపై ముందుకు సాగుతూ ‘వందేళ్ల భారత్‌’బ్లూప్రింట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తోడ్పడేలా పద్దును రూపొందించినట్టు వెల్లడించారు. రానున్న పాతికేళ్ల అమృత కాలంలో ఆశించిన ప్రగతి లక్ష్యాల సాధనకు మంత్రి సప్తర్షి మంత్రం జపించారు. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం... ఇలా వృద్ధి ఏడు విభాగాలుగా అభివృద్ధి బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక రంగంపై ‘తళుకులీనుతున్న తార’గా అభివర్ణించారు.

‘‘మన ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. వృద్ధి బాటన అది శరవేగంగా పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది’’అంటూ భరోసా ఇచ్చారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధిస్తామని ధీమా వెలిబుచ్చారు. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు తదితరాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తలసరి ఆదాయం రెట్టింపై ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. ‘అందరికీ తోడు, అందరి అభివృద్ధి’లక్ష్యంతో సాగుతున్నామన్నారు. వ చ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌. 2024లో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లనుంది. 

డిజిటల్‌ బాటన వడివడిగా... 
సుపరిపాలనే దేశ ప్రగతికి మూలమంత్రమన్న విత్త మంత్రి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సామాన్యుడి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలో ప్రపంచ స్థాయి డిజిటల్‌ వ్యవస్థ సాకారమైందని చెప్పారు. ఆధార్, కొవిన్, యూపీఐ, డిజి లాకర్స్‌ తదితరాలన్నీ ఇందుకు నిదర్శనమేనన్నారు. కృత్రిమ మేధలో లోతైన పరిశోధనల నిమిత్తం మూడు అత్యున్నత విద్యా సంస్థల్లో సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ తేనున్నట్టు చెప్పారు. 5జీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. అదే సమయంలో పేదలు, దిగువ తరగతి సంక్షేమానికీ పెద్ద పీట వేశామని చెప్పారు. ‘‘కరోనా వేళ దేశంలో ఎవరూ ఆకలి బాధ పడకుండా చూడగలిగాం. 80 శాతం మంది పేదలకు ఆహార ధాన్యాలందించాం. ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద రూ.2 లక్షల కోట్లతో పేదలకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేశాం. వంద కోట్ల పై చిలుకు మందికి వ్యాక్సిన్లిచ్చాం. వాటిని పంపి ఎన్నో ప్రపంచ దేశాలను ఆదుకున్నాం’’అన్నారు. 

పెద్ద దేశాల్లో మనమే టాప్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఏకంగా 7 శాతంగా మంత్రి అంచనా వేశారు. ‘‘పెద్ద దేశాలన్నింట్లోనూ ఇదే అత్యధికం. అంతర్జాతీయంగా తీవ్ర మాంద్యం, కరోనా కల్లోలం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటి గడ్డు సమస్యలను తట్టుకుంటూ ఇంతటి ఘనత సాధించనుండటం గొప్ప ఘనత’’అని చెప్పారు. ప్రస్తుతం 6.4గా ఉన్న ద్రవ్య లోటును 2023–24లో 5.9 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యమన్నారు. 

ఐటీ పరిమితి 7 లక్షలకు... 
కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదా రులు పాత విధానం నుంచి మారేలా ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయతి్నంచారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 42.7 శాతం నుంచి 39 శాతానికి, సర్‌చార్జిని 37 నుంచి 27 శాతానికి తగ్గించారు. సీనియర్‌ సిటిజన్లకు కూడా గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.30 లక్షలకు పెంచారు. మొబైల్‌ ఫోన్‌ విడి భాగాలు, టీవీలు తదితరాలపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు ద్వారా మధ్య, దిగువ తరగతికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వెండి ప్రియం కానుండటం మహిళలకు దుర్వార్తే.

మౌలికంపై మరింత దృష్టి... 
మౌలిక సదుపాయాలు తదితరాలపై ఈసారి మరింత దృష్టి పెడుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కలి్పంచే పీఎం ఆవాస్‌ యోజనకు కేటాయింపులను రూ.79 వేల కోట్లకు (ఏకంగా 66 శాతం) పెంచారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధిని ప్రకటించారు. ఇక దేశానికి జీవనాడి అయిన రైల్వేలకు ఇప్పటిదాకా అత్యధికంగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక పోర్టులు, పరిశ్రమలకు అనుసంధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఏకంగా రూ.77 వేల కోట్లతో కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రైవేట్‌ రంగం నుంచి సేకరించనున్నారు. 

హరిత నినాదం 
కాలుష్యకారక శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా పూర్తిస్థాయిలో కాలుష్యరహిత స్వచ్ఛ ఇంధనానికి మారే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. బయో వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా సంపద సృష్టికి గోబర్ధన్‌ పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. సాగు, భవనాలు, పరికరాలు తదితరాలన్నింటినీ హరితమయం చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఎం కిసాన్‌ పథకానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు. పశుగణాభివృద్ధి, మత్స్య విభాగాలపై ఫోకస్‌ పెంచారు. ప్రధాని బాగా ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారు. 

మహిళలకు మరింత సాధికారత 
మహిళా సాధికారత దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 81 లక్షల పై చిలుకు స్వయం సహాయ బృందాలను స్టార్టప్‌ల తరహాలో తీర్చిదిద్దడం ద్వారా నెక్స్‌ట్‌ లెవెల్‌కు తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలిస్తామన్నారు. మధ్య తరగతి దర్శనీయ ప్రాంతాల్లో పర్యటించేందుకు పథకం ప్రకటించారు. 

జి–20 సారథ్యం.. గొప్ప అవకాశం 
‘‘జి–20 సదస్సుకు ఈ ఏడాది భారత్‌ సారథ్యం వహించనుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు గొప్ప అవకాశం. వసుధైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) నినాదంతో ఈ దిశగా ముందుకెళ్తున్నాం’’అని నిర్మల తెలిపారు. 

బడ్జెట్‌ సైడ్‌లైట్స్‌... ఈసారి 87 నిమిషాలే... 
బడ్జెట్‌ ప్రసంగాన్ని విత్త మంత్రి ఈసారి 8,000 పై చిలుకు పదాల్లో, కేవలం 87 నిమిషాల్లోనే ముగించారు. 2020 బడ్జెట్‌ సమరి్పంచినప్పుడు ఆమె ఏకంగా 162 నిమిషాలు మాట్లాడటం విశేషం! బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి సుదీర్ఘమైనదిగా అది చరిత్రకెక్కింది కూడా. ఆ తర్వాత క్రమంగా నిడివి తగ్గతూ వస్తోంది. నిర్మల 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో 2021లో తొలి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆమెదే. 

క్షమాపణలతో నవ్వులు పూయించి... 
►కాలం చెల్లిన పాత వాహనాలను పక్కన పెట్టే పథకానికి నిధులు ప్రకటించే క్రమంలో ఆర్థిక మంత్రి కాస్త తడబడి ‘ఓల్డ్‌ పొలిటికల్‌ వెహికిల్స్‌’అనడంతో సభ్యులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నిర్మల వెంటనే సర్దుకుంటూ ‘ఓల్డ్‌ పొల్యూటింగ్‌ వెహికిల్స్‌. సరేనా? అయాం సారీ’అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. 
►అధికార సభ్యుల స్వాగతం నడుమ లోక్‌సభలోకి ప్రవేశించిన నిర్మల, ఎరుపు రంగు బహీ ఖాతా నుంచి బయటికి తీసిన ట్యాబ్లెట్‌ పీసీ సాయంతో పద్దును ప్రవేశపెట్టారు. ఆమె కూతురు, బంధువులు స్పీకర్‌ గ్యాలరీ నుంచి వీక్షించారు. 
►కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ వరుసగా ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ప్రసంగం ముగిశాక ప్రధాని ఆమె దగ్గరికి వెళ్లి అభినందించారు. మంత్రివర్గ సభ్యులతో పాటు కొందరు విపక్ష సభ్యులు కూడా ఆమెను చుట్టుముట్టారు. 
►ఆమె ప్రసంగం పొడవునా అధికార సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా ఐటీ రాయితీలు ప్రకటిస్తుండగా మోదీ, మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చిరుధాన్యాల ప్రస్తావన రాగానే ప్రధాని మోదీ బల్లపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. అప్పుడప్పుడూ విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. 
►బడ్జెట్‌ ప్రసంగం మొదలైన కాసేపటికి సభలోకి అడుగు పెట్టిన రాహుల్‌గాం«దీని కాంగ్రెస్‌ సభ్యులు ‘జోడో జోడో. భారత్‌ జోడో’అని నినదిస్తూ స్వాగతించారు. అప్పుడప్పుడూ ‘అదానీ, అదానీ’నినాదాలూ విన్పించాయి. 
►మామూలుగా నినాదాలు, నిరసనలతో హోరెత్తించే తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రసంగాన్ని నిశ్శబ్దంగా వింటూ కని్పంచారు.  

ఆర్థిక వృద్ధి అవసరాలు, ప్రజాకాంక్షల మధ్య చక్కని సమతౌల్యం కుదిరిన బడ్జెట్‌ ఇది. పెట్టుబడి వ్యయ పద్దు తొలిసారి రూ.10 లక్షల కోట్లను తాకింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను వ్యవస్థలోనూ మధ్యతరగతికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఆ దాయ పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయం చేయడం దీని ఉద్దేశం. మహిళా సాధికారతకూ మరింత పెద్దపీట వేశాం. కస్టమ్స్‌ సుంకాలనూ హేతుబద్దీకరించే ప్రయత్నం చేశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement