సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
వాడీవేడిగా చర్చలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు.
ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్‌లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్‌పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్‌లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు.
14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత
గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్‌లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్‌ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు.
పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్‌సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment