పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా వారం రోజులే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అతిపెద్ద ఆదాయ వనరుల్లో ఒకటైన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్‌పై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఓవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు, మరోవైపు అంచనాలు.. ఈ రెండింటినీ కేంద్రం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
పన్ను స్లాబ్ రేట్ల సవరణ
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల స్లాబ్ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం స్వల్ప రేట్లతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారుల అత్యధిక పన్ను రేటును 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే.. రూ.10-12.5 లక్షల నుంచి రూ.10-20 లక్షలకు, 20 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చే స్లాబ్‌ని విస్తరించడంతో పాటు దీనికి అనుబంధంగా ఉండాలని ఆశిస్తున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. అలాగే, గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన రిటర్న్స్‌కు ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతున్నారు.
పన్ను మినహాయింపు పరిమితులు
మరింత మెరుగైన పన్ను మినహాయింపు పరిమితుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు పన్నుచెల్లింపుదారులు. ఆర్థిక సంస్థల ద్వారా మంజూరైన రుణాలకు సెక్షన్ 80ఈఈబీ కింద మినహాయింపు ఉంది. అయితే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే అది వర్తిస్తోంది. ఈ కాలపరిమితిని 2025 మార్చి 31 వరకు పొడిగించాలంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు.
పీఎఫ్ కంట్రిబ్యూషన్ మినహాయింపు
2020 బడ్జెట్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌లో యాజమాన్య వాటా రూ. 7.5 లక్షలు దాటితే పన్ను వర్తిస్తుంది. అలాగే పీఎఫ్ నిధుల ఉపసంహరణపై కూడా పన్ను విధించబడుతోంది. అయితే.. ఈ పన్నులో మినహాయింపు కోరుతున్నారు పన్ను చెల్లింపుదారులు. ఇక ఇప్పటికే కంట్రిబ్యూషన్ సంవత్సరంలో పన్ను చెల్లించి ఉంటే, సేకరించబడిన పీఎఫ్/ఎన్‌పీఎస్/ఎస్‌ఏఎఫ్ బ్యాలెన్స్‌లో ఏదైనా భాగానికి డబుల్ టాక్సేషన్‌ను తొలగించే విధానంపై స్పష్టత ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తులో తలెత్తే అనవసర వ్యాజ్యాల నుంచి పన్ను చెల్లింపుదారులను ఇది కాపాడుతుందని భావిస్తున్నారు.
టాక్స్ రిటర్న్స్ సవరణ కోసం కాలపరిమితి
అసలు రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి గడువు కాగా.. సవరించిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ డిసెంబర్ 31. అయితే.. తక్కువ వ్యవధి ఉండటంతో లోపాలు సరిచేసుకునేందుకు తగినంత అవకాశం లభించడం లేదంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. సవరించిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కోసం గడువు తేదీని అసెస్‌మెంట్ సంవత్సరం ముగింపు నుంచి ఒక ఏడాదికి పునరుద్ధరిస్తే సవరింపులకు తగిన సమయం లభిస్తుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment