ఇంటి కలకు  భరోసా! | Infrastructure status to reforms in Affordable Housing, real estate sector demands | Sakshi
Sakshi News home page

ఇంటి కలకు  భరోసా!

Published Thu, Jan 30 2025 5:09 AM | Last Updated on Fri, Jan 31 2025 1:36 PM

Infrastructure status to reforms in Affordable Housing, real estate sector demands

అమ్మకాలు పెరగాలంటే ప్రోత్సాహకాలు కల్పించాల్సిందే 

సింగిల్‌ విండో ద్వారా సులభతర అనుమతులు 

అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని సవరించాలి 

మౌలిక రంగం హోదా కల్పించాలి 

గృహ రుణం వడ్డీ చెల్లింపులకు మరింత పన్ను రాయితీ 

రియల్‌ ఎస్టేట్‌ రంగం డిమాండ్లు 

గత బడ్జెట్‌లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్‌లోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి.

 అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్‌ హౌసింగ్‌) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్‌ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్‌లో చోటు కల్పించడం గమనార్హం. 

పరిశ్రమ వినతులు 
→ మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది.   
→ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్‌ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి.   
→ గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ  కార్పెట్‌ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి.   
→ ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్‌ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. 
→ మరింత మంది డెవలపర్లు ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి.   
→ దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్‌టీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయం అందించాలి.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement