Single Window System
-
ఇంటి కలకు భరోసా!
గత బడ్జెట్లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్ హౌసింగ్) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్లో చోటు కల్పించడం గమనార్హం. పరిశ్రమ వినతులు → మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది. → రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి. → గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ కార్పెట్ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి. → ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. → మరింత మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. → దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం అందించాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు ‘సింగిల్ విండో’
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. దీనితో వ్యాపారాలను నమోదు చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, భారత్ సిసలైన స్వావలంబన సాధించడం లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా ఇది ముఖ్యమైన పరిణామం. దీనితో బ్యూరోక్రసీ నుంచి, వివిధ విభాగాల చూట్టూ తిరగడం నుంచి స్వాతంత్య్రం లభిస్తుంది‘ అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 9 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు పొందవచ్చు. డిసెంబర్ ఆఖరు నాటికి మరో 14 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇంకో 5 రాష్ట్రాలను చేరుస్తామని గోయల్ తెలిపారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ బీటా వెర్షన్ ప్రజలు, సంబంధిత వర్గాలందరికీ అందుబాటులో ఉంటుంది. యూజర్లు, పరిశ్రమ ఫీడ్‌బ్యాక్ బట్టి ఇందులో మరిన్ని అనుమతులు, లైసెన్సుల జారీ ప్రక్రియకు సంబంధించిన అంశాలను జోడించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పారదర్శకతకు పెద్ద పీట..: సమాచారం అంతా ఒకే పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని గోయల్ వివరించారు. పరిశ్రమ, ప్రజలు, సంబంధిత వర్గాలు అందరితో కలిసి టీమ్ ఇండియాగా పనిచేసేందుకు ప్రభుత్వం ముందుకొచి్చందని, సమష్టి కృషి ఫలితమే ఈ పోర్టల్ అని చెప్పారు. దరఖాస్తు మొదలుకుని దాని అనుమతుల ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, సందేహాలకు తగు వివరణలు ఇచ్చేందుకు ఇందులో దరఖాస్తుదారు కోసం ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఉంటుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ వైపే యావత్ప్రపంచం చూస్తోందని గోయల్ చెప్పారు. -
జగన్‌గారికి ధన్యవాదాలు
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పథకం జీవోను ఇవ్వటం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరికీ మేలు కలుగుతుంది. అందుకు ఏపీ సీయం వైయస్. జగన్మోహన్ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడానికి తీసుకోవలసిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియపరుస్తున్నాం. గతంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమను తరలించినందుకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిల్మ్‌నగర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. తర్వాతి రోజుల్లో వాటిని షూటింగ్‌ల కోసమే కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియోలకు స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించేవారికే స్థలాలు కేటాయించాలి. అలాగే ఆన్లైన్ టికెటింగ్‌ను ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న సినిమాల ప్రయోజనం కోసం బస్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌లలో సుమారు 200 థియేటర్స్‌ను ప్రభుత్వం కట్టించాలి’’ అన్నారు. -
సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ దర్శనీయ, విహార, చారిత్రక ప్రాంతాల్లో సినిమా, టీవీ, ఇతర కార్యక్రమాల చిత్రీకరణకు సింగిల్ విండో ద్వారా అనుమతినివ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాల్లోని ఆయా ప్రదేశాలు, ప్రాంతాల్లో షూటింగ్‌కు ఎక్కడెక్కడ అనుమతినివ్వవచ్చన్న దానిపై సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) సమాచారాన్ని సేకరిస్తోంది. ఐ అండ్ పీఆర్ ద్వారా సింగిల్ విండో విధానం ద్వారా ఈ అనుమతులకు సంబంధించి ఆన్లైన్లో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భాగంగా నీటి పారుదల, రోడ్లు, భవనాలు, అటవీ, పర్యావరణ.. ఇలా అన్ని శాఖల నుంచి ఏయే ప్రాంతాల్లో ఫిలిం, టీవీ, ఇతర కార్యకమాల చిత్రీకరణకు అనుమతినిచ్చే అవకాశముందన్న దానిపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆస్తులు, భవనాలు, సుందర ప్రదేశాలు, ఇతర ఆవాసాలకు షూటింగ్ సందర్భంగా ఏ నష్టమూ జరగకుండా చూడటం.. ప్లాస్టిక్, ఇతర కాలుష్యం వెదజల్లకుండా, పరిసరాల పరిశుభ్రత పాడుచేయకుండా చిత్రీకరణ బృందాలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి షూటింగ్‌కు అనుమతించే ప్రాంతాలు ఏమిటన్న వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ సమాచారం ప్రాతిపదికన అనుమతికి ఔత్సాహికులు, చిత్ర, టీవీ బృందాలు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. అన్నీ సజావుగా ఉంటే ఆన్లైన్లోనే రుసుము చెల్లించి అనుమతులు పొందేం దుకు వీలుంటుందని అధికారులు వెల్లడించారు. మూడు జోన్లుగా ‘అటవీ’ విభజన అటవీశాఖకు సంబంధించి రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్ల కింద రాష్ట్రంలోని అటవీ ప్రాంతాన్ని విభజించారు. రెడ్ జోన్ పరిధిలోని పులులు ఇతర అభయారాణ్యాలు, జాతీయపార్కుల్లో షూటింగ్‌లకు అనుమతినివ్వరు. ఎల్లో జోన్‌లోని రిజర్వ్ ఫారెస్ట్లు, వాటి పరిధిలోని పార్కుల్లో పరిమితంగా ఆయా అంశాల ప్రాతిపదికన అనుమతిస్తారు. సంబంధిత అటవీ అధికారుల పర్యవేక్షణలోనే, నియమ, నిబంధనలకు లోబడి షూటింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్‌జోన్ పరిధిలోని నెహ్రూ జూలాజికల్ పార్కు, దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, ఇతర జూ పార్కులు, అర్బన్ పార్కులు వంటి వాటిలో షూటింగ్‌కు అనుమతినిస్తారు. జిల్లాల వారీగా ఎల్లో, గ్రీన్ జోన్ల వివరాలను మ్యాప్‌ల రూపంలో పొందుపర్చడం ద్వారా ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకునేందుకు అవకాశం ఉంటుందో తెలియజేయాలనే ఆలోచనతో అటవీశాఖ ఉంది. అనుమతులకు నిబంధనలివే... ►పగటి పూట మాత్రమే షూటింగ్ ►అది కూడా 8 గంటల పాటు చిత్రీకరణకు అనుమతి ►అడవులు, పార్కుల్లో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించొద్దు ►పర్యావరణానికి, పరిసరాలకు ఎలాంటి నష్టం కలిగించొద్దు ►8 గంటలకు రూ. 50 వేల ఫీజు ప్రతిపాదన.. ►ఆయా సందర్భాలు, పరిస్థితులను బట్టి ఈ ఫీజు మారొచ్చు ►కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయించుకుని, నియమాలు పాటిస్తే తిరిగిస్తారు ►లేనిపక్షంలో పరిసరాల క్లీనింగ్, ఇతరత్రా ఖర్చులను అందులోంచి మినహాయిస్తారు. -
సింగిల్ విండో కావాలి!
సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా ఎలాగైతే పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులను మంజూరు చేస్తున్నారో.. అలాగే నిర్మాణ రంగ అనుమతులకూ ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. సింగిల్ విండో సిస్టమ్‌లో నిర్మాణ అనుమతులిచ్చే మున్సిపల్ శాఖతో పాటూ అగ్నిమాపక, నాలా కన్వర్షన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మైన్స్ అండ్ జియోలజీ విభాగాలనూ భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అనుమతుల మంజూరులో జాప్యం తగ్గడంతో పాటూ అవినీతి కూడా తగ్గుతుందని.. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అభిప్రాయపడింది. ఇటీవల టీబీఎఫ్ నాల్గవ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, పర్యావరణ, ఎయిర్పోర్ట్.. వంటి చాలా ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్వోసీ) తీసుకోవాలి. ఇందుకోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. కాబట్టి ఒక్క దరఖాస్తుతోనే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీలను జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ♦ రెవెన్యూ ల్యాండ్లను జియో ట్యాగింగ్ చేసి రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. అప్పుడే భూములకు వర్చువల్ బౌండరీలు కనిపిస్తుంటాయి. దీంతో ద్వంద్వ రిజిస్ట్రేషన్స్ వంటి అక్రమాలకు తావుండదు. ♦ అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలి. లుక్ ఈస్ట్ పాలసీతో తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉప్పల్‌లోని ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తాన్ని ఐటీ జోన్‌గా ప్రకటించాలి. పోచారంలోని రహేజా ఐటీ పార్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. నివాసితులకు ఆరోగ్య వాతావరణం కోసం నగరంలోని పార్క్‌లను కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్స్లాగా అభివృద్ధి చేయాలి. నెలకొకసారి స్థల మార్పిడి కమిటీ.. ప్రస్తుతం ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కమిటీ 2–3 నెలలకొకసారి సమావేశం అవుతోంది. దీంతో స్థల మార్పిడికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా ప్రతి నెలకు ఒకసారి సమావేశం జరగాలి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు, ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై కోర్టు కేసులో ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో చాలా మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారు. ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ ఒక సర్వే నంబరులో ఉండే వేల ఎకరాల్లో కొంత స్థలానికి ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే.. రెవెన్యూ శాఖ ఆ సర్వే నంబరు అంతటినీ ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్ కింద పెట్టేస్తున్నారు. దీంతో ఆ సర్వే నంబరులోని మిగిలిన స్థలానికి రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఏ స్థలం వరకైతే లీగల్ సమస్యలున్నాయో అంత వరకే ప్రొహిబిషనరీ విధించాలి. లేకపోతే మిగిలిన స్థలంలోని కొనుగోలుదారులకు నష్టం వాటిల్లుతుంది. ♦ ఉదాహరణకు భోగారం సర్వే నంబరు 281లో మొత్తం 12 ఎకరాల 19 గుంటల భూమి ఉంది. ఇందులో 4 ఎకరాల 2 గుంటలు పట్టా, 8 ఎకరాల 17 గుంటలు అసైన్డ్ ల్యాండ్. దీంతో రెవెన్యూ విభాగం ఈ సర్వే నంబరును ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ కింద పెట్టేసింది. దీంతో పట్టా ల్యాండ్‌లో భూమి కొన్నా.. రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఇదే అదనుగా ఆ సర్వే నంబరులోని పట్టా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్‌కు కూడా సబ్–రిజిస్ట్రార్లకు చేతులు తడపాల్సి వస్తోంది. అలా కాకుండా సర్వే నంబరు 281 (ఏ), (బీ) అని ప్రత్యేకంగా చూపించినట్లయితే.. కొనుగోలుదారులకు ఇబ్బందులుండవు.. జేబు భారమూ తప్పుతుంది. – సీ ప్రభాకర్ రావు, టీబీఎఫ్ ప్రెసిడెంట్ విజయవాడ రోడ్లో దృష్టి మెట్రో రైల్ ప్రారంభం, ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణంతో ఇప్పుడు ఎల్బీనగర్ ప్రాంతం అత్యంత బిజీ ఏరియాగా మారింది. పోచారం ఐటీ హబ్‌తో వరంగల్, ఆదిభట్ల ఎయిరో స్పేస్ హబ్‌తో సాగర్ రోడ్ ఎలాగైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో.. అలాగే విజయవాడ జాతీయ రహదారిలోనూ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రకటించాలి. దీంతో నగరం నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. – టీ నరసింహా రావు, ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్మికులకు బీమా సౌకర్యం భవన నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న కార్మికులున్నారు. నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాలకు డెవలపర్లను బాధ్యుల్ని చేయడం, కేసులు పెట్టడం సరైంది కాదు. భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుంది. – ఎం. సీహెచ్ రాఘవరావు,వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ లేబర్ సె‹స్పై అవగాహన నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నగరం చుట్టూ ఇసుక డిపోలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. డెవలపర్ల నుంచి వసూలు చేసే లేబర్ సెస్ ప్రభుత్వం వద్ద మూలుగుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ సొమ్మును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. – ఎం. శ్రీనివాసన్, కూకట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
సినిమాలకు.. సింగిల్ విండో!
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని - దసరాకు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం - చిన్న సినిమాలకు ఐదో ఆటకు అనుమతిలో జాప్యం వద్దు.. - బ్లాక్‌ను అరికట్టేందుకు ఆన్లైన్ టికెటింగ్ సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర నిర్మాణానికి వివిధ శాఖల నుంచి అనుమతులు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి సింగిల్ విండో సిస్టమ్‌ను అమల్లోకి తెస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రక్రియను దసరా పండుగ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారులతో చర్చించారు. చలనచిత్ర నిర్మాణాలకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు నిర్మాతలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని, కాలయాపన జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్లాక్ టికెటింగ్‌ను నిరోధించేందుకు ఆన్లైన్ టికెట్ విధానాన్ని అన్ని థియేటర్లలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే జిల్లాల్లోని సంబంధిత అధికారులకు, రాష్ట్రంలోని 437 థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం పంపినట్లు వివరించారు. 100 ఎకరాల్లో.. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి అనువైన 100 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో గుర్తించామని తలసాని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. 200 నుంచి 300 సీట్ల సామర్థ్యమున్న మినీ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో థియేటర్లలో ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు. చిన్న బడ్జెట్ చిత్రాల అర్హతను 35 నుంచి 100 స్క్రీన్లకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బాలల చలనచిత్ర ఉత్సవాల కోసం రూ.8 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. -
‘అందరికీ ఇళ్ల’లో భాగం కండి
ప్రైవేటు రంగానికి కేంద్రమంత్రి వెంకయ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ: ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ప్రైవేటు భాగస్వాముల పాత్ర చాలా కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలని, అందుబాటు ధరల్లో పేదలకు ఇళ్లు నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మురికివాడల పేదలను ఎక్కడికి తరలించబోమని స్పష్టంచేశారు. వారు కోరుకుంటే.. ఉన్నచోట లేదా మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి నిర్దేశిత కాలంలో... లే అవుట్లకు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు సింగిల్‌విండో వ్యవస్థ ప్రవేశపెడతామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఇళ్ల నిర్మాణంపై అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు వచ్చే ఎనిమిదేళ్లపాటు ఏడాదికి 20 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంది’ అని చెప్పారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షంపై వెంకయ్య మండిపడ్డారు. ‘ఇళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నిర్మించాలంటే భూమి కావాలి. వాటిని గాల్లో కట్టలేం. భూమి లేకుంటే ఇళ్లు ఎలా కడతారు? భూసేకరణ అసాధ్యంగా మారిందని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. 2013 నాటి భూసేకరణ బిల్లును సవరించాలని కోరాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ బిల్లును కొందరు అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. -
పన్నుల విధానాలు సరళతరం చేయాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేయటంతో పాటు నియంత్రణ, పన్నుల విధానాలను సరళతరం చేయాలని టాటా స్టీల్, జీఎంఆర్ తదితర దిగ్గజ సంస్థలు కేంద్రాన్ని కోరాయి. ఇన్వెస్టర్లు బహుళ అనుమతుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చర్యలు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అజయ్ శంకర్ కమిటీకి ఆయా సంస్థలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశాయి. -
పెట్టుబడిదారులకు విసృ్తత అవకాశం
సింగిల్ విండో విధానంలోతక్షణమే అనుమతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో అందులోనూ ఆన్లైన్లోనే అనుమతులు అందజేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు శివారులోని బిడిది వద్ద బాష్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమొబైల్ ఉత్పతి కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ మంది స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీని వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని తెలిపారు. చట్ట ప్రకారం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు. అనుమతుల్లో ఇబ్బందులు ఏర్పడితే వ్యక్తిగతంగా తనను కలుసుకుంటే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బాష్ సంస్థ వ్యవస్థాపక డెరైక్టర్ స్టీఫెన్ బ్రౌన్, ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ‘విప్రో’ విస్తరణకు అంగీకారం
-
కొత్త ఐటీ పరిశ్రమలకు నెలలోపే అనుమతులు
త్వరలో నూతన ఐటీ పాలసీ విశాఖలో ‘విప్రో’ విస్తరణకు అంగీకారం హిందూపురం వద్ద సంతూర్ సబ్బుల పరిశ్రమ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ కంపెనీలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా నెలలోపే అన్ని అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. త్వరలోనే నూ తన ఐటీ పాలసీని తీసుకు రానున్నట్టు ప్రకటించారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారమిక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ విశేషాలను మంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ కంపెనీ రాష్ట్రం లో చేపట్టబోయే ప్రతిపాదనలను సీఎంకు ప్రేమ్‌జీ వివరించారని, విశాఖపట్నం విప్రో ఐటీ సంస్థను విస్తరించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రూ.500 కోట్లతో సంతూర్ సబ్బుల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే... వైజాగ్, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, అనంతపురం, విజ యవాడల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. కాకినాడలో సిలికాన్ చిప్స్ తయారీ కంపెనీ రానుంది. రెవెన్యూ లోటు న్న ఏపీకి ఐటీ పరిశ్రమల వల్లే మేలు జరుగుతుంది. దేశంలోనే మొదటి ఐదు సంస్థల్లో ఒకటైన విప్రోతోపాటు టెక్‌మహీంద్ర, ఇన్ఫోసిస్, సమీర్ వంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. -
ఐటీ కోసం సింగిల్ విండో విధానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ విండో విధానం రూపొందించామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను నాలుగు వారాల్లోగా మంజూరు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే రాయితీలను పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక సమాచారాన్ని క్షణాల్లో అందిస్తామని, ఇందు కోసం డేటా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని రఘునాథ రెడ్డి చెప్పారు. -
మైనింగ్‌కు సింగిల్ విండో విధానం కావాలి
ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ సంస్థలు స్థల సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కో అనుమతి తీసుకోవాల్సి వస్తున్నందున, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసే దిశగా సింగిల్ విండో విధానం అవసరమని తెలిపారు. ఇటు వృద్ధి, అటు పర్యావరణ పరిరక్షణ విధానాల మధ్య సమతౌల్యం పాటించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘దేశ వృద్ధిలో మైనింగ్ కీలక పాత్ర’ అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎన్ఎండీసీ ప్రస్తుత మైనింగ్ వార్షిక సామర్థ్యం 30 మిలియన్ టన్నులు ఉండగా.. దీన్ని 50 మిలియన్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు, ఉక్కు రంగంలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా దాదాపు రూ. 15,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్‌మెంట్‌తో తలపెట్టిన స్టీల్ ప్లాంటు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఇక గనుల అప్‌గ్రెడేషన్ కోసం రూ.10,000 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. విస్తరణపై దృష్టి: నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర 12వ ప్రణాళిక కాలంలో (2012-2017) విస్తరణపై రూ. 29,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సెమినార్లో నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర మోహన్ తెలిపారు. ఇందులో 30 శాతం సొంత నిధులు కాగా, మిగతాది రుణం రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. ట్యుటికోరిన్‌లో తలపెట్టిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని వివరించారు. బొగ్గు బ్లాకుల కొనుగోలు కోసం మొజాంబిక్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేశామని, 2014-15 ఆఖరుకల్లా డీల్ పూర్తి కాగలదన్నారు. లిగ్నైట్‌లో తేమ శాతాన్ని తగ్గించి, నాణ్యతను పెంచే దిశగా అప్‌గ్రెడేషన్ కోసం జపాన్‌కి చెందిన కోబే స్టీల్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు.