‘అందరికీ ఇళ్ల’లో భాగం కండి
ప్రైవేటు రంగానికి కేంద్రమంత్రి వెంకయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ప్రైవేటు భాగస్వాముల పాత్ర చాలా కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలని, అందుబాటు ధరల్లో పేదలకు ఇళ్లు నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మురికివాడల పేదలను ఎక్కడికి తరలించబోమని స్పష్టంచేశారు. వారు కోరుకుంటే.. ఉన్నచోట లేదా మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
వచ్చే ఏడాది నుంచి నిర్దేశిత కాలంలో... లే అవుట్లకు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు సింగిల్‌విండో వ్యవస్థ ప్రవేశపెడతామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఇళ్ల నిర్మాణంపై అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు వచ్చే ఎనిమిదేళ్లపాటు ఏడాదికి 20 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంది’ అని చెప్పారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షంపై వెంకయ్య మండిపడ్డారు.
‘ఇళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నిర్మించాలంటే భూమి కావాలి. వాటిని గాల్లో కట్టలేం. భూమి లేకుంటే ఇళ్లు ఎలా కడతారు? భూసేకరణ అసాధ్యంగా మారిందని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. 2013 నాటి భూసేకరణ బిల్లును సవరించాలని కోరాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ బిల్లును కొందరు అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు.