Housing for All scheme
-
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ మాకొద్దు
-
కోర్టు స్టేతో ఆగిన ఇళ్ల నిర్మాణం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : హైకోర్టు స్టే కారణంగా ప్రభుత్వం హౌసింగ్‌ఫర్ ఆల్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కలెక్టర్‌తోపాటు అధికార పార్టీ నేతలెవ్వరికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రస్తుతం లబ్ధిదారులకు ఎవరు సమాధానం చెబుతారని, డిపాజిట్ ఎలా తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్‌పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ అధికారులు 76.17 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వైఎస్ మరణానంతరం పరిశ్రమలను ఏర్పాటు చేయలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అపెరల్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని హౌసింగ్ ఫర్ ఆల్పథకం కింద 4150 ఇళ్లు నిర్మించేందుకు కేటాయించారన్నారు. అందులో ఉచితంగా పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ముందుగా డిపాజిట్లు సేకరించి తర్వాత బ్యాంకు రుణం ద్వారా ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. అపార్ట్మెంట్ తరహాలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఈ సమస్యపై తాను గతంలోనే 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టానన్నారు. కలెక్టర్ కేవీ రమణ హయాంలోనే తాను అపెరల్‌పార్కు స్థలంలో ఇళ్లు నిర్మించొద్దని కోరానన్నారు. అయితే జిల్లా అధికారులు మాలెపాడు గ్రామం వద్ద నిర్మించనున్న స్థలాన్ని మినహాయించి అపెరల్ పార్కులో ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే సమస్య.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్ పార్కు ఏర్పాటు కోసం 34 మంది రైతుల నుంచి 76.17 ఎకరాల భూమిని సేకరించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన రైతు చిన్న వెంకటసుబ్బన్న సర్వే నంబర్ 679లోని 7.78 ఎకరాల భూమిపై, మల్లేల బాల పుల్లయ్య సర్వే నంబర్ 680లోని 3.76 ఎకరాలపై హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ ప్రకారం చిన్న వెంకటసుబ్బన్నకు గత ఏడాది నవంబర్ 23న, బాలపుల్లయ్యకు డిసెంబర్ 4న హైకోర్టు స్టే మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. అధికారులు మొత్తం 4150 మందికి ఇళ్లు నిర్మించాలని తలపెట్టగా 825 మంది డీడీలు చెల్లించి అధికారులకు ఇచ్చారన్నారు. 107 బ్లాకుల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. హైకోర్టు స్టే కారణంగా వీటిలోని 33 బ్లాకుల్లో నిర్మిస్తున్న 400 ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు. అధికారులు సమాచారాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి అధికారులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూమి ఇచ్చిన మిగతా 32 మంది రైతులు కోర్టును ఆశ్రయిస్తే హౌసింగ్ ఫర్ ఆల్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి విలువ రూ.4కోట్ల నుంచి రూ.5కోట్లు పలుకుతోందన్నారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇందుకు ప్రభుత్వంతోపాటు సంబంధిత అధికా రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ విషయంపై లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గోనా ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హౌసింగ్ స్కీం రియల్ ఎస్టేట్
ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తోంది. కనీస మౌలిక వసతులకూ ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో మొదటి విడత హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం కింద 2017–18కి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2వేలు చొప్పున ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కడప కార్పొరేషన్లో 4వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా కడపలో 1982 మంది, ప్రొద్దుటూరులో 900 మంది అంగీకారపత్రాలను ఇచ్చారు. వీరిలో కడప కార్పొరేషన్లో 800 మంది తమకు నచ్చిన కేటగిరీ ఇళ్లకు తమ వాటాగా డీడీలు తీయగా, ప్రొద్దుటూరులో ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2018–19 ఏడాదికి సంబంధించి రెండో విడతలో కడప కార్పొరేషన్ పరిధిలో 2281, మున్సిపాలిటీల్లోని ప్రొద్దుటూరులో 2150, రాజంపేటలో 1279, జమ్మలమడుగులో 1415, ఎర్రగుంట్ల 2046, పులివెందులలో 2143, బద్వేలులో 888, రాయచోటిలో 1011 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. ప్రభుత్వమే డబ్బు, స్థలం ఇచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ప్రభుత్వం రెండు సెంట్ల స్థలంతోపాటు ఒక్కో ఇంటికి రూ.80వేలు ఇచ్చి ఉచితంగా ఇళ్లను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రకాల ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కేటగిరీ ఒకటిలో ఉన్న వాటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా లబ్దిదారుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ రూ.3లక్షలు పోను, బ్యాంకు రుణం రూ.2.65లక్షలకు 30 ఏళ్లకు వడ్డీతో సహా రూ.11లక్షల 95వేల 300 చెల్లించాల్సి ఉంటుంది. రెండో కేటగిరిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.3.65 లక్షలకు వడ్డీతో రూ.14లక్షల 48వేల 200, మూడో కేటగిరి కింద 430 చదరపు అడుగుల ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.4.65లక్షలకు లబ్ధిదారుడు రూ.17లక్షల 54వేలు 400 వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా లబ్ధిదారుడు బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే బ్యాంకులు ఇళ్లు జప్తు చేసే పరిస్థితి ఉంది. ఈ ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు ప్రభుత్వం రూ.2,100 ముక్కుపిండి ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇందులోనే మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. స్థల అన్వేషణ మొదటి విడత గృహాల నిర్మాణం 2018 సంక్రాంతి పండుగ తర్వాతనే టిడ్కో సంస్థ ప్రారంభించే అవకాశం ఉంది. అంగీకార పత్రాలు ఇచ్చిన ప్రజలు డీడీలు తీస్తేనే పూర్తి అర్హత జాబితా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జిల్లా కమిటీ పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా టిడ్కో సంస్థనే టెండర్లు వేయడంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలను సంక్రాంతి లోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉండటంతో పనులు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మించే ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో 35 ఎకరాలను సేకరించారు. ఈ స్థలానికి ఆనుకుని వంక ఉండటంతో టిడ్కో ఈఈ లీలా ప్రసాద్ ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న దృష్టికి తీసుకొచ్చారు. రెండు ఎకరాల స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైంది. ఎలా జీవించాలి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లు ప్రజలకు ఏ మాత్రం అనుకూలం కాదు. అందులోనూ ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ల పద్ధతిలో నిర్మించే ఇంటిని 30 ఏళ్లు బ్యాంకుకు తనఖా పెట్టడం దారుణం. – మచ్చా ఉమాదేవి, ప్రొద్దుటూరు. పేదోడికి భారం పేదోళ్లకి ప్రభుత్వం నిర్మించి ఇస్తామంటున్న ఇళ్లు భారంగా మారనున్నాయి.. నెల నెల బ్యాంకుకు అసలూ, వడ్డీతో కలిపి కట్టే డబ్బుకు పట్టణ ప్రాంతంలోనే బాడుగకు ఇల్లు వస్తుంది. చేనేతలకు పైభాగంలో ఇల్లు ఇస్టే మగ్గం ఎక్కడ పెట్టుకుంటారు. – జి.జయమ్మ, ప్రొద్దుటూరు. -
‘అందరికీ ఇళ్ల’లో భాగం కండి
ప్రైవేటు రంగానికి కేంద్రమంత్రి వెంకయ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ: ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ప్రైవేటు భాగస్వాముల పాత్ర చాలా కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలని, అందుబాటు ధరల్లో పేదలకు ఇళ్లు నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మురికివాడల పేదలను ఎక్కడికి తరలించబోమని స్పష్టంచేశారు. వారు కోరుకుంటే.. ఉన్నచోట లేదా మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి నిర్దేశిత కాలంలో... లే అవుట్లకు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు సింగిల్‌విండో వ్యవస్థ ప్రవేశపెడతామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఇళ్ల నిర్మాణంపై అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు వచ్చే ఎనిమిదేళ్లపాటు ఏడాదికి 20 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంది’ అని చెప్పారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షంపై వెంకయ్య మండిపడ్డారు. ‘ఇళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నిర్మించాలంటే భూమి కావాలి. వాటిని గాల్లో కట్టలేం. భూమి లేకుంటే ఇళ్లు ఎలా కడతారు? భూసేకరణ అసాధ్యంగా మారిందని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. 2013 నాటి భూసేకరణ బిల్లును సవరించాలని కోరాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ బిల్లును కొందరు అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. -
305 నగరాల్లో ‘అందరికీ ఇళ్లు’
తొమ్మిది రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం * జాబితాలో తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలకు చోటు న్యూఢిల్లీ: పట్టణ పేదల కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ‘అందరికీ ఇళ్లు’ను అమలు చేసేందుకు దేశంలోని 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది. తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలు వీటిలో ఉన్నాయి. త్వరలోనే ఈ నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన(హెచ్‌యూపీఏ) శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే ఆరేళ్ల వ్యవధిలో రెండు కోట్ల మంది పట్టణ పేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు హెచ్‌యూపీఏ మంత్రిత్వ శాఖ రూ. 2 లక్షల కోట్లను వ్యయం చేయనుంది. ఈ పథకానికి తెలంగాణలోని 34 పట్టణాలు, నగరాలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 36, గుజరాత్ 30, జమ్మూకశ్మీర్ 19, జార్ఖండ్ 15, కేరళ 15, మధ్యప్రదేశ్ 74, ఒడిశా 42, రాజస్థాన్ నుంచి 40 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 9 రాష్ట్రాలతో పాటు మరో ఆరు రాష్ట్రాలు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఆరు తప్పనిసరి సంస్కరణలు అమలు కోసం హెచ్‌యూపీఏతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, బిహార్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఒప్పందం ప్రకారం లేఅవుట్ ప్రతిపాదనలు, నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో ద్వారా నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతులు ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన, అల్పా దాయ వర్గాల ఇళ్ల నిర్మాణానికి తక్కువ నిర్మాణ ప్రాంతంలోనూ నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. అద్దె చట్టాలకు హెచ్‌యూపీఏ సూచించిన మార్పులు చేయాలి. తక్కువ వ్యయ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు, మురికివాడలను అభివృద్ధికి సాంద్రత నిబంధనల సరళీకరణ వంటి సవరణలు చేయాలి. పట్టణ ఇళ్ల నిర్మాణ మిషన్‌లో భాగంగా కేంద్రం ఒక్కో యూనిట్‌కు రూ. లక్ష నుంచి రూ. 2.3 లక్షలను సహాయంగా అందజేస్తుంది.