
కొత్త ఐటీ పరిశ్రమలకు నెలలోపే అనుమతులు
త్వరలో నూతన ఐటీ పాలసీ
విశాఖలో ‘విప్రో’ విస్తరణకు అంగీకారం
హిందూపురం వద్ద సంతూర్ సబ్బుల పరిశ్రమ
మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ కంపెనీలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా నెలలోపే అన్ని అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. త్వరలోనే నూ తన ఐటీ పాలసీని తీసుకు రానున్నట్టు ప్రకటించారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారమిక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ విశేషాలను మంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ కంపెనీ రాష్ట్రం లో చేపట్టబోయే ప్రతిపాదనలను సీఎంకు ప్రేమ్‌జీ వివరించారని, విశాఖపట్నం విప్రో ఐటీ సంస్థను విస్తరించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రూ.500 కోట్లతో సంతూర్ సబ్బుల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే...
వైజాగ్, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, అనంతపురం, విజ యవాడల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. కాకినాడలో సిలికాన్ చిప్స్ తయారీ కంపెనీ రానుంది. రెవెన్యూ లోటు న్న ఏపీకి ఐటీ పరిశ్రమల వల్లే మేలు జరుగుతుంది. దేశంలోనే మొదటి ఐదు సంస్థల్లో ఒకటైన విప్రోతోపాటు టెక్‌మహీంద్ర, ఇన్ఫోసిస్, సమీర్ వంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి.