Palle Raghunadha Reddy
-
నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడి భూమాయ
గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదలకు అందాల్సిన ప్రతి సంక్షేమ ఫలాన్నీ అడ్డగోలుగా స్వాహా చేయడమే కాకుండా రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను సైతం రాచమార్గంలో తమ పేరిట పట్టాలు చేయించుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల అక్రమాలు బయటపడుతుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పల్లపు రవీంద్ర భూ అక్రమాల్లో ఆరితేరిపోయాడు. నియోజకవర్గంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములపై కన్నేసిన ఇతను నిబంధనలను తుంగలో తొక్కి టీడీపీ పాలనలో 39.52 ఎకరాలను స్వాహా చేశాడు. బుక్కపట్నం మండలం రామసాగారానికి చెందిన ఇతను తన సోదరుడు శంకర్, కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు పొందాడు. 1996 నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఈ బాగోతం కొనసాగుతూ వచ్చింది. అసైన్డ్ భూమి అంటే?.. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్ అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు. పుట్టపర్తి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు పైగా ఇలాంటి అసైన్డ్ భూములు ఉన్నాయి. వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు గత ప్రభుత్వాలు వీటిని పంపిణీ చేశాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయట పడాలన్నదే ప్రభుత్వాల లక్ష్యం. ఒకవేళ మొదటిసారి భూ బదలాయింపు జరిగితే తహసీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి. రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు ఇవ్వాలి. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాదు.. కొనడమూ నేరమని కూడా చట్టం చెబుతోంది. (జేసీ ఆరోగ్యం కాపాడుకో..) నిబంధనలకు విరుద్ధంగా.. రెండున్నర ఎకరాల తరి లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేల కన్నా తక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు. ఇలా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు అసైన్డ్ భూమికి పట్టా పొందవచ్చు. ఈ నిబంధనలకు విరుద్ధంగా 39.52 ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు పల్లపు రవీంద్ర, అతని సోదరుడు శంకర్, వారి కుటుంబ సభ్యులు పట్టాలు పొందారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పడితే అక్కడ ఇంటి పేర్లు మార్చి తమ పేరు మీదనే కాక భార్య పేరుపై కూడా పట్టాలు పొందారు. బుక్కపట్నం మండలం మారాల రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలకు పైగా, ముదిగుబ్బ మండలం మంగలమడక రెవెన్యూ పరిధిలో మరో 19 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను వీరు అప్పణంగా కాజేశారు. వీరిద్దరూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అప్పటి ఎంపీ నిమ్మలకిష్టప్పకు సన్నిహితులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపకుండా పట్టాలు రాసిచ్చేశారు. ►ఎకరాకు గరిష్టంగా రూ.25వేలు చొప్పున 39.52 ఎకరాలకు సుమారు రూ.10 లక్షల వరకు పావలా వడ్డీకే వివిధ బ్యాంక్‌ల ద్వారా రుణం. ►ఈ రెండేళ్లలో పంట పెట్టుబడి సాయంలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద లబ్ధి. ►కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైఎస్సార్ రైతు భరోసా వర్తిస్తుంది. అయితే రవీంద్ర తన మాయాజాలంతో ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున కుటుంబంలోని నలుగురి పేరుతో ఈ రెండేళ్లలో రూ.1,08,000 స్వాహా చేశాడు. ప్రభుత్వాలను మోసగిస్తూ.. తన పేరు మీదనే కాక తన భార్య కృష్ణవేణి, సోదరుడు శంకర్, అతని భార్య జానకి పేరుతో దాదాపు 38.86 ఎకరాల భూమిని పల్లపు రవీంద్ర రాచమార్గంలోనే స్వాహా చేశాడనే విమర్శలు ఉన్నాయి. ఇతను పట్టాలు పొందిన అసైన్డ్ భూములు ఏవీ సాగుకు అనుకూలమైనవి కావు. గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, వాటిని అడ్డుగా పెట్టి పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంక్షేమ ఫలాలను దోచేస్తూ వచ్చాడు. ఈ భూముల వివరాలను అడ్డగోలుగా వాడేస్తూ ఆదాయ పన్ను మినహాయింపు పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టాడు. ఇంత కాలం ప్రభుత్వాల కళ్లుగప్పుతూ వచ్చిన పల్లపు రవీంద్ర మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కాజేసి.. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో పల్లపు రవీంద్రను మించిన వారు లేరని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. పూర్వీకుల నుంచి పల్లపు రవీంద్ర కుటుంబసభ్యులకు 16 ఎకరాల మెట్ట భూమి సంక్రమించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తాను నిరుపేదనంటూ గత పన్నెండేళ్లలో రవీంద్ర, ఆయన సోదరుడు శంకర్, వీరి భార్య పేరుతో 39.52 ఎకరాల అసైన్డ్ భూమిని పొందారు. సాగుకు నోచుకోని ఈ భూములపై సబ్సిడీ రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా పరిహారాలను పొందుతుండటం గమనార్హం. -
టీడీపీ మాజీ మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో... మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు నదీం అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘునాథరెడ్డి భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రఘునాథరెడ్డిపై విత్తనాల వ్యాపారి ఆదినారాయణ యాదవ్, అలమూరు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆలమూరులో 29 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన ఆక్రమించారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని రైతులు ఫిర్యాదు చేశారు. తమ భూములను పల్లె రఘునాథరెడ్డి అక్రమంగా ఆక్రమించారని మీడియా ఎదుట రైతులు వాపోయారు. -
పరువు కోసం టీడీపీ చీఫ్ విప్ పాట్లు!
సాక్షి, అమడగూరు: ఇంటి పట్టాల పంపిణీ కోసం శనివారం అనంతపురం జిల్లా అమడగూరుకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డిని మండల వడ్డెర్ల సంఘం నాయకులు మార్గమధ్యలోనే ముట్టడించారు. మహమ్మదాబాద్ మూడు రోడ్ల కూడలిలోకి రాగానే ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వడ్డెర్లను ఎస్టీల్లోకి చేర్చాలంటూ నినాదాలు చేశారు. దీంతో గాభరాపడ్డ రఘునాథరెడ్డి ఎవరైనా చూస్తే బాగోదంటూ సమీపంలో ఉన్న ఇంటిలోకి నాయకులు సుధాకర్, కిష్టప్ప, ఉత్తప్ప, శీన, నాగరాజును పిలుచుకెళ్లి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. వాల్మీకులు, కాపుల అభ్యర్థనలకు తలొగ్గిన ప్రభుత్వం తమను ఎందుకు నిర్లక్ష్యం చేసిందంటూ నాయకులు నిలదీశారు. ఈ విషయంగా సీఎం వద్ద ప్రస్తావించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారికి ఎలాగైనా తన పరువు నిలపాలని, సీఎంతో కచ్చితంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నమ్మబలికినా.. నేతలు వినలేదు. -
మంత్రి 'పల్లె’ కు ముచ్చెమటలు!
- సర్వజనాస్పత్రి సమస్యలు తీర్చాలంటూ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని చుట్టుముట్టిన సీపీఎం కార్యకర్తలు - రెండు గంటల పాటు నడిరోడ్డుపై దిగ్బంధం - తనవల్ల కాదంటూ పరుగు పెట్టిన మంత్రి అనంతపురం సిటీ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సీపీఎం కార్యకర్తలు ముప్పుతిప్పలు పెట్టారు. రెండు గంటలకు పైగా నడిరోడ్డుపై దిగ్బంధించారు. వారి నుంచి తప్పించుకుపోవడానికి మంత్రి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, సిబ్బంది కొరత నివారణకు ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ గేయానంద్ ఆస్పత్రి ఎదుట దీక్ష చేపట్టారు. బుధవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆ మార్గంలో పార్టీ కార్యాలయానికి వెళుతూ సీపీఎం కార్యకర్తలకు తారసపడ్డారు. దీంతో వారు వాహనాన్ని అడ్డుకున్నారు. మంత్రిని చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకోవడానికి పల్లె అటూ ఇటు పరుగులు పెట్టారు. అయినా వారు వదలలేదు. పూర్తిగా దిగ్బంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. వారికి సమాధానం చెప్పలేని మంత్రి.. గేయానంద్‌తో మాట్లాడేందుకు శిబిరం వద్దకు బయలుదేరారు. అయితే.. ఆయన అక్కడికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మూడురోజులుగా దీక్ష చేస్తుంటే ఇంతవరకు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, సీపీఎం కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాట నుంచి తప్పించుకునేందుకు మంత్రి ప్రయత్నించగా.. ఆయన పాదరక్షలు రోడ్డు డివైడర్ల మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో పట్టు తప్పి కిందకు పడబోయారు. ఇదే సమయంలో ఆందోళనకారుల్లోని కొంత మంది యువకులను చూసిన మంత్రి..‘ నేను లెక్చరర్‌గా ఉన్నప్పుడు మీరు నా దగ్గర చదువు కున్నారు కదరా? నన్నే ఇలా నడిరోడ్డుపై ఇబ్బంది పడితే ఎలా?’ అంటూ వాపోయారు. ఈ సమస్య పరిష్కరించడం తన వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో మీ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చివరికి మంత్రి పాదరక్షలను కూడా అక్కడే వదిలి, కారును నడిరోడ్డుపై విడిచి పరుగు అందుకున్నారు. చివరకు పోలీసులు ఆయన్ను రక్షించి.. మరో వాహనంలో పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. -
అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది. -
'60 కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ క్లస్టర్ కోసం 250 హెక్టార్ల భూమిని కేటాయించినట్టు ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా అమరావతి ఇండ్రస్ట్రీయస్ అసోసియేషన్‌కు భూమిని కేటాయించినట్టు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 60 కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి కూచిపూడి, యక్షగాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. -
చేతగాని మంత్రులు రాజీనామా చేయాలి
సీపీఐ రైతు సంఘం నాయకుల డిమాండ్ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ జిలాల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని విత్తన పంపిణీ కేంద్రం వద్ద గురువారం సంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 3.28 లక్షలు క్వింటాళ్లు కేటాయించినా కనీసం 2 లక్షల క్వింటాళ్లు కూడా పంపిణీ చేయకుండానే కార్య క్రమాన్ని ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా కొనసాగడం కన్నా రాజీనామా చేయడం మేలన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రెండో విడత, మూడో విడత విత్తన పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరెడ్డి, రఘురామయ్య, నాగరాజు, వెంకటనారాయణ, వెంకటేష్‌నాయక్, సీపీఐ నాయకులు మస్తాన్, ఎర్రిస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
'పెట్టుబడులు పెట్టాలని జపాన్ని కోరాం'
-
'ఏపీలో పెట్టుబడులకు 8 ఐటీ కంపెనీల సుముఖత'
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు జపాన్ రాజధాని టోక్యో కు చెందిన 8 కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. జపాన్ రాజధాని టోక్యో పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను కలిసినట్టు ఐటీ మంత్రి పల్లె తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలను ఆహ్వానించామని అన్నారు. ఏపీ ఐటీ పరిశ్రమకు సంబంధించి పెట్టుబడులపై టోక్యోలో పలు సంస్థల ప్రతినిధులను కలిసేందుకు మంత్రి పల్లె టోక్యో పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు 8 కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని మంత్రి పల్లె చెప్పారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ, తోషిబా, ప్యాన్సోనిక్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నాయని మంత్రి పల్లె తెలిపారు. -
టోక్యోలో ఐటీ సంస్థలతో మంత్రి పల్లె భేటీ
సాక్షి, హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలను అధికారులు వివరించారు. నవ్యాంధ్రలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. దీంతో సోనీ ప్రతినిధులు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరింపచేసేందుకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఎన్టీటీ డాటా, బీపీవో, టెలికమ్యూనికేషన్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. టోక్యోలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ వారం, ప్రదర్శనను పలు కంపెనీల ప్రతినిధులు సందర్శించినట్లు సమాచార శాఖ మంత్రి పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె
తన ఇంగ్లండ్ పర్యటనపై మంత్రి పల్లె సాక్షి, హైదరాబాద్: తన ఇంగ్లండ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న మంత్రి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పర్యటనలో.. వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు, ఇండో-బ్రిటన్ బంధం, అవినీతిపై చర్యలు, అక్కడి పార్లమెంటు, అసెంబ్లీల పనితీరుపై అధ్యయనం చేసినట్లు మంత్రి వివరించారు. 16 ఐటీ, ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. విజయవాడ, తిరుపతి, అనంతపురం, గుంటూరులలో ఐటీ రంగం అభివృద్ధికి ఈ కంపెనీలన్నీ కృషి చేస్తాయన్నారు. -
గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని: కమిటీ స్పష్టత
హైదరాబాద్: ఏపి రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యేనని భూసేకరణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భూసేకరణ కమిటీ(మంత్రి మండలి ఉపసంఘం) సమావేశం ముగిసింది. అనంతరం కమిటీ సభ్యుడు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమావేశం వివరాలను విలేకరులకు తెలిపారు. భూసేకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీలలో విజయవాడ, గుంటూరులలో పర్యటిస్తామని చెప్పారు. తొలిదశలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ జరుగుతుందన్నారు. 60:40 శాతం నిష్పత్తిలో భూసేకరణ జరుగుతుందని చెప్పారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రి నారాయణను విశాఖపట్నం పంపిస్తున్నట్లు మంత్రి పల్లె తెలిపారు. ** -
ఇమేజ్ కోసం ఆరాటం
సాక్షి ప్రతినిధి, కడప: అందివచ్చిన అవకాశంతో ప్రాంతాభివృద్ధి కోసం పాటుపడే నేతలు కొందరైతే, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొనేందుకు ఆరాట పడేవారు మరికొందరు. జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండో కోవలోకి చేరుతున్నారు. జిల్లాలోని పెండింగ్ పథకాల పూర్తి కోసం ఏమాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే పనుల పైనే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక జిల్లా అభివృద్ధికి గ్రహణం పట్టిందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ వరుసగా రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు పర్యటించారు. మంత్రుల పర్యటనలకు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏ ఒక్కరూ దృష్టి సారించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రుల పర్యటనలోనూ నాయకులు వారిని అంటి పెట్టుకొని ఉండటం మినహా జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించిన దాఖలాలు లేవు. తక్కువ ఖర్చుతో అభివృద్ధి ఫలాలు అందించే పథకాన్ని సైతం గుర్తించలేని దుస్థితిలో తెలుగు తమ్ముళ్లు ఉండటం విచారకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల దృష్టిలో మంత్రులకు అత్యంత సన్నిహితులు అన్పించుకునేందుకే వారు ఆరాటపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్మానాలతోనే సరి.. జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అడిగిన, కనీసం వినతిపత్రం ఇచ్చిన నాయకుడు లేడనే విమర్శలు వినవస్తున్నాయి. కొత్త భిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు మంత్రులకు సన్మానాలు చేయడం, మెమెంటోలు ఇవ్వడం, అవకాశం దక్కితే డిన్నర్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాయకులు ప్రాంతం కోసం, ప్రజాసేవ కోసం పరితపించాలి. అయితే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాటపడుతుండటం విచారకరమని పలువురు పేర్కొంటున్నారు. వర్గరాజకీయాలకు ప్రాధాన్యత.. అధికారం దక్కిందనే ఉద్దేశంతో జిల్లా టీడీపీ నాయకులు వర్గ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అండతో జిల్లాలోని డీలర్‌షిప్‌లు మార్చడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు డివిజన్లో ఈ తరహా రాజకీయాలకు అధికారపార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అలాంటి రాజకీయ సమీకరణలు మినహా, జిల్లా అభివృద్ధి కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా సమగ్రమైన వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ల లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీఎంకు సన్నిహితుడిగా చెప్పుకునే మరో ముఖ్య నాయకుడు ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులు జిల్లాలో పనిచేయరాదనే తలంపుతో ఉన్నారని పలువురు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తన బ్రాండ్ ఉండాలనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎవరి పరిధిలో వారు వ్యక్తిగత ఇమేజ్ కోసం తాపత్రయ పడుతుండటం మినహా ప్రాంత అభివృద్ధి.. ప్రజల కోసం పాటుపడేవారు అధికార పార్టీలో మచ్చుకైనా కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
2019 నాటికి.. ఐటీ హబ్‌గా ఆంధ్ర: మంత్రి పల్లె
తిరుపతి: 2019 నాటికి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రూ. 30 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్, రూ. 12 వేల కోట్లతో ఐటీ పరిశ్రమ స్థాపించి.. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మంగళవారం తిరుపతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి తిరుపతిలోని ఎస్‌టీపీఏ కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆ సంస్థకు కేటాయించే భూమి విలువలో ఉద్యోగిపై రూ. 60 వేల రాయితీ కల్పిస్తామన్నారు. -
విశాఖలో ‘విప్రో’ విస్తరణకు అంగీకారం
-
కొత్త ఐటీ పరిశ్రమలకు నెలలోపే అనుమతులు
త్వరలో నూతన ఐటీ పాలసీ విశాఖలో ‘విప్రో’ విస్తరణకు అంగీకారం హిందూపురం వద్ద సంతూర్ సబ్బుల పరిశ్రమ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ కంపెనీలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా నెలలోపే అన్ని అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. త్వరలోనే నూ తన ఐటీ పాలసీని తీసుకు రానున్నట్టు ప్రకటించారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారమిక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ విశేషాలను మంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ కంపెనీ రాష్ట్రం లో చేపట్టబోయే ప్రతిపాదనలను సీఎంకు ప్రేమ్‌జీ వివరించారని, విశాఖపట్నం విప్రో ఐటీ సంస్థను విస్తరించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రూ.500 కోట్లతో సంతూర్ సబ్బుల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే... వైజాగ్, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, అనంతపురం, విజ యవాడల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. కాకినాడలో సిలికాన్ చిప్స్ తయారీ కంపెనీ రానుంది. రెవెన్యూ లోటు న్న ఏపీకి ఐటీ పరిశ్రమల వల్లే మేలు జరుగుతుంది. దేశంలోనే మొదటి ఐదు సంస్థల్లో ఒకటైన విప్రోతోపాటు టెక్‌మహీంద్ర, ఇన్ఫోసిస్, సమీర్ వంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. -
కొత్త ఐటీలకు 4 వారాల్లోనే అనుమతులు
* ఏపీలో సింగిల్ విండో విధానం * పదిరోజుల్లో పాలసీ.. మంత్రి పల్లె వెల్లడి సాక్షి, విశాఖపట్నం: గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ సింగిల్‌విండో విధానాన్ని అమలుచేసి ఐటీ రంగాన్ని అభివద్ధి చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీలో కంపెనీల స్థాపనకు ఇప్పటివరకు 400 వరకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయన్నారు. ఇకపై ఐటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసే కంపెనీలకు నాలుగువారాల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. విశాఖ ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-సమస్యలపై మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. విభజన వల్ల ఏపీలో ఐటీ రంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, ఈరాష్ట్రంలో 22 వేల మంది ఉద్యోగులుంటే, తెలంగాణలో 3.30 లక్షల మంది ఉన్నారన్నారు. ఐటీ రంగాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేయడానికి వీలుగా పదిరోజుల్లో ఐటీ పాలసీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ రీజియన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఐటీఐఆర్‌ను విశాఖనుంచి ప్రారంభిస్తామన్నారు. విశాఖలో పలు ఐటీ సెజ్‌ల్లో 334 ఎకరాల భూములు ఐటీ కంపెనీలు పొందాయని, పనిప్రారంభించని కంపెనీలు నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. లేకపోతే వాటికిచ్చిన భూములు వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఐటీ సెజ్‌లకు ఐలా(ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) హోదా కల్పించి ఐటీ రంగ మౌలిక సమస్యలు తీరుస్తామన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మిషన్‌ను త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామని, సిటీలో ఐటీ కంపెనీల సమస్యలు తీర్చేందుకు రూ.9.5 కోట్లతో పనులు చేయిస్తామని వివరించారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌జాజు తదితరులు ప్రసంగిస్తూ... ఐటీ కంపెనీలు తీసుకున్న భూములను తిరిగి సబ్లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు యాజమాన్యాలకు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాదాపూర్ తరహాలో విశాఖకూ కన్వెన్షన్ సెంటర్ మంజూరుచేస్తామని చెప్పారు. 2020నాటికి అయిదులక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు స్థాపిస్తామంటే నరకం చూపిస్తున్నారు ‘విశాఖలో రూ.10 కోట్లతో హోటల్, కమ్యునికేషన్ వ్యాపారం ప్రారంభించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా... ఒక కంపెనీకి భూమి ఇవ్వమన్నారు... మరో కంపెనీకి ఏపీఐఐసీ కాగితంపై భూమి మంజూరుచేసి ఇప్పటికీ చేతికి ఇవ్వలేదు.... కేవలం లంచం ఇవ్వలేదనే అధికారులు నాకు నరకం చూపిస్తున్నారు..’ అంటూ ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఐఏఎస్ అధికారులను నిలదీశారు. సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేష్కుమార్ మాట్లాడుతూ ఐటీరంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. రూ.80 కోట్లతో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మంజూరైనా ఇప్పటికీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నామన్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైన బ్రాండ్‌బ్యాండ్‌తో సహా కనీసం తాగునీరు, ఉద్యోగులకు భద్రత కల్పించడంలేదన్నారు. ఐటీ రంగానికి 24గంటల విద్యుత్ అవసరంకాగా, వారానికి ఒకరోజు పవర్‌హాలిడే వల్ల దివాళా తీసే పరిస్థితి నెలకొందన్నారు. -
పోలవరంపై పేచీ తగదు: పల్లె
అలాగైతే 1956కు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను కోరతాం హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సరికాదని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాజధానిని కోల్పోయి సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, ఇప్పుడు మరింత బాధించేలా వారి వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, ఆస్తులు తెలంగాణకు ఇచ్చి అప్పులను సీమాంధ్రకు మిగిల్చారని దుయ్యబట్టారు. పోలవరంపై పేచీ పెడితే తాము 1956కు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను కోరాల్సి ఉంటుందన్నారు. భద్రాచలం పట్టణం కూడా ఆంధ్రప్రదేశ్‌దేనని, పరిపాలనా సౌలభ్యంకోసమే దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారని గుర్తుచేశారు. పీపీఏల రద్దుపైనా కేసీఆర్ వాదన సరికాదన్నారు. ఇప్పటికే తీరని అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను మరింతగా ఇబ్బందులు చేసే కార్యక్రమాలను కేసీఆర్ మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి తగలక మానదన్నారు. -
ఇరాక్ లో చిక్కుకున్నవారిని ఆదుకుంటాం: పల్లె
హైదరాబాద్: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకుంటామని ఏపీ సమాచార శాఖా మంత్రి పల్లెరఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఇరాక్ అల్లర్లలో చిక్కుకున్న ఎవరైనా వెనక్కి రావాలనుకుంటే ప్రభుత్వమే తీసుకువస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాక్ బాధితులకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 040-23454946, 9949054467 ఫోన్ నెంబర్ తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇరాక్ లో సున్ని, షియా తెగల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆక్కడ పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. రెండు తెగల మధ్య జరుగుతున్న పోరు ఇరాక్ అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. ఇరాక్ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించింది.