
2019 నాటికి.. ఐటీ హబ్‌గా ఆంధ్ర: మంత్రి పల్లె
తిరుపతి: 2019 నాటికి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రూ. 30 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్, రూ. 12 వేల కోట్లతో ఐటీ పరిశ్రమ స్థాపించి.. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.
మంగళవారం తిరుపతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి తిరుపతిలోని ఎస్‌టీపీఏ కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆ సంస్థకు కేటాయించే భూమి విలువలో ఉద్యోగిపై రూ. 60 వేల రాయితీ కల్పిస్తామన్నారు.