చేతగాని మంత్రులు రాజీనామా చేయాలి
సీపీఐ రైతు సంఘం నాయకుల డిమాండ్
అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ జిలాల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని విత్తన పంపిణీ కేంద్రం వద్ద గురువారం సంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 3.28 లక్షలు క్వింటాళ్లు కేటాయించినా కనీసం 2 లక్షల క్వింటాళ్లు కూడా పంపిణీ చేయకుండానే కార్య క్రమాన్ని ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని ఆరోపించారు.
చేతకాని ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా కొనసాగడం కన్నా రాజీనామా చేయడం మేలన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రెండో విడత, మూడో విడత విత్తన పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరెడ్డి, రఘురామయ్య, నాగరాజు, వెంకటనారాయణ, వెంకటేష్‌నాయక్, సీపీఐ నాయకులు మస్తాన్, ఎర్రిస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.