
సాక్షి, అమడగూరు: ఇంటి పట్టాల పంపిణీ కోసం శనివారం అనంతపురం జిల్లా అమడగూరుకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డిని మండల వడ్డెర్ల సంఘం నాయకులు మార్గమధ్యలోనే ముట్టడించారు. మహమ్మదాబాద్ మూడు రోడ్ల కూడలిలోకి రాగానే ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వడ్డెర్లను ఎస్టీల్లోకి చేర్చాలంటూ నినాదాలు చేశారు. దీంతో గాభరాపడ్డ రఘునాథరెడ్డి ఎవరైనా చూస్తే బాగోదంటూ సమీపంలో ఉన్న ఇంటిలోకి నాయకులు సుధాకర్, కిష్టప్ప, ఉత్తప్ప, శీన, నాగరాజును పిలుచుకెళ్లి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు.
వాల్మీకులు, కాపుల అభ్యర్థనలకు తలొగ్గిన ప్రభుత్వం తమను ఎందుకు నిర్లక్ష్యం చేసిందంటూ నాయకులు నిలదీశారు. ఈ విషయంగా సీఎం వద్ద ప్రస్తావించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారికి ఎలాగైనా తన పరువు నిలపాలని, సీఎంతో కచ్చితంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నమ్మబలికినా.. నేతలు వినలేదు.