
పోలవరంపై పేచీ తగదు: పల్లె
అలాగైతే 1956కు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను కోరతాం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సరికాదని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాజధానిని కోల్పోయి సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, ఇప్పుడు మరింత బాధించేలా వారి వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, ఆస్తులు తెలంగాణకు ఇచ్చి అప్పులను సీమాంధ్రకు మిగిల్చారని దుయ్యబట్టారు.
పోలవరంపై పేచీ పెడితే తాము 1956కు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను కోరాల్సి ఉంటుందన్నారు. భద్రాచలం పట్టణం కూడా ఆంధ్రప్రదేశ్‌దేనని, పరిపాలనా సౌలభ్యంకోసమే దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారని గుర్తుచేశారు. పీపీఏల రద్దుపైనా కేసీఆర్ వాదన సరికాదన్నారు. ఇప్పటికే తీరని అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను మరింతగా ఇబ్బందులు చేసే కార్యక్రమాలను కేసీఆర్ మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి తగలక మానదన్నారు.