కొత్త ఐటీలకు 4 వారాల్లోనే అనుమతులు
* ఏపీలో సింగిల్ విండో విధానం
* పదిరోజుల్లో పాలసీ.. మంత్రి పల్లె వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ సింగిల్‌విండో విధానాన్ని అమలుచేసి ఐటీ రంగాన్ని అభివద్ధి చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీలో కంపెనీల స్థాపనకు ఇప్పటివరకు 400 వరకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయన్నారు. ఇకపై ఐటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసే కంపెనీలకు నాలుగువారాల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. విశాఖ ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-సమస్యలపై మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐటీ కంపెనీలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. విభజన వల్ల ఏపీలో ఐటీ రంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, ఈరాష్ట్రంలో 22 వేల మంది ఉద్యోగులుంటే, తెలంగాణలో 3.30 లక్షల మంది ఉన్నారన్నారు. ఐటీ రంగాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేయడానికి వీలుగా పదిరోజుల్లో ఐటీ పాలసీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ రీజియన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఐటీఐఆర్‌ను విశాఖనుంచి ప్రారంభిస్తామన్నారు. విశాఖలో పలు ఐటీ సెజ్‌ల్లో 334 ఎకరాల భూములు ఐటీ కంపెనీలు పొందాయని, పనిప్రారంభించని కంపెనీలు నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు.
లేకపోతే వాటికిచ్చిన భూములు వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఐటీ సెజ్‌లకు ఐలా(ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) హోదా కల్పించి ఐటీ రంగ మౌలిక సమస్యలు తీరుస్తామన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మిషన్‌ను త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామని, సిటీలో ఐటీ కంపెనీల సమస్యలు తీర్చేందుకు రూ.9.5 కోట్లతో పనులు చేయిస్తామని వివరించారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌జాజు తదితరులు ప్రసంగిస్తూ... ఐటీ కంపెనీలు తీసుకున్న భూములను తిరిగి సబ్‌లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు యాజమాన్యాలకు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాదాపూర్ తరహాలో విశాఖకూ కన్వెన్షన్ సెంటర్ మంజూరుచేస్తామని చెప్పారు. 2020నాటికి అయిదులక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు.
పరిశ్రమలు స్థాపిస్తామంటే నరకం చూపిస్తున్నారు
‘విశాఖలో రూ.10 కోట్లతో హోటల్, కమ్యునికేషన్ వ్యాపారం ప్రారంభించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా... ఒక కంపెనీకి భూమి ఇవ్వమన్నారు... మరో కంపెనీకి ఏపీఐఐసీ కాగితంపై భూమి మంజూరుచేసి ఇప్పటికీ చేతికి ఇవ్వలేదు.... కేవలం లంచం ఇవ్వలేదనే అధికారులు నాకు నరకం చూపిస్తున్నారు..’ అంటూ ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఐఏఎస్ అధికారులను నిలదీశారు. సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేష్‌కుమార్ మాట్లాడుతూ ఐటీరంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. రూ.80 కోట్లతో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మంజూరైనా ఇప్పటికీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నామన్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైన బ్రాండ్‌బ్యాండ్‌తో సహా కనీసం తాగునీరు, ఉద్యోగులకు భద్రత కల్పించడంలేదన్నారు. ఐటీ రంగానికి 24గంటల విద్యుత్ అవసరంకాగా, వారానికి ఒకరోజు పవర్‌హాలిడే వల్ల దివాళా తీసే పరిస్థితి నెలకొందన్నారు.