Single window policy
-
మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం?
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో (nsws) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వ్యాపారాల అనుమతుల విషయంలో ఈ ఎన్ఎస్డ్ల్యూఎస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలో బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి వేర్వేరు ఆమోదాలు, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ,జీఎస్టీఎన్,టీఐఎన్,టీఏఎన్, పాన్ వంటి 13 విభిన్న ఐడీల్ని ఉపయోగించాల్సి ఉంది. అయితే పైన పేర్కొన్న ఐడీ కార్డలను ఉపయోగించి అప్రూవల్ పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఆ సమస్యను అధిగమించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్క పాన్ కార్డుతో అనుమతులు ఇచ్చేలా నేషనల్ సింగిల్ విండో సిస్టం పద్దతిని అమలు చేస్తే ఎలా ఉంటుందో’నని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయంపై తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెవెన్యూ శాఖను సంప్రదించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘మేము ఇప్పటికే ఉన్న డేటాబేస్‌లలో పాన్ నెంబర్‌ను ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. కాబట్టి పాన్‌తో, కంపెనీకి సంబంధించిన ప్రాథమిక డేటా, దాని డైరెక్టర్లు, చిరునామాలు, సాధారణ డేటా ఇప్పటికే పాన్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి’ అని గోయల్ అన్నారు. ప్రస్తుతం పాన్ కార్డును వినియోగించి వ్యాపారా అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో పాలసీని కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చదవండి👉 మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు -
సినీ షూటింగ్‌లకు సింగిల్ విండో పాలసీ
సాక్షి, హైదరాబాద్: పర్యాటక స్థలాల్లో ఇబ్బందులు లేకుండా సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు సింగిల్ విండో పాలసీని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సినిమా చిత్రీకరణలకు అనువైన ప్రదేశాలు ఉన్నా నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయ ప్రాంతాలు, ప్రకృతి సహజంగా ఏర్పడిన అందమైన ప్రాంతాల్లో సినిమాల షూటింగ్‌కు అనువుగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని పర్యాటక స్థలాల్లో సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికి పర్యాటక శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ), పర్యాటక శాఖల మధ్య పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. దర్శకులు, నిర్మాతలు తెలంగాణ ప్రాంతంలో సినిమాలు తీస్తే అనవసర ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆది శేషగిరిరావు, రామారావు, టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు. -
నిర్మాణ అనుమతులకూ సింగిల్ విండో
అన్ని శాఖల నుంచి ఒకేసారి అనుమతులు: కేటీఆర్ ► చిన్న బిల్డర్లకు ప్రత్యేక మినహాయింపులు.. ► అక్రమ నిర్మాణాలు జరిపితే జరిమానాలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతు లను సింగిల్ విండో విధానంలో జారీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. అగ్నిమాపక, మైనింగ్, పోలీసు తదితర శాఖలతో పాటు ఏవియేషన్ అథారిటీ నుంచి కూడా ఒకే చోట అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ సిస్టం (డీపీఎస్)తో అవినీతి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీడీఎఫ్) మూడో వార్షిక సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో భూ రికార్డులను క్రమబద్ధీకరించే అంశంపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. ఇక బిల్డర్లు కోరిన 36 రకాల రాయితీలు, మినహాయింపులకు సీఎం కేసీఆర్ ఒకే సమావేశంలో ఆమోదం తెలిపారని.. వాటిని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఆరు జీవోలు జారీ చేసిందని తెలిపారు. బిల్డర్లు కోరుతున్న నాలా చార్జీల మినహాయింపులు, ఇతర విజ్ఞప్తులపై త్వరలో ఓ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా చిన్న బిల్డర్లకు ఉండే పరిమితుల దృష్ట్యా వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తామన్నారు. నాణ్యంగా కట్టండి.. సెట్‌బ్యాక్, డ్రైనేజీ, పార్కింగ్ సదుపాయాలు లేకుండానే బిల్డర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని.. ఇప్పటివరకు అరాచకం కొనసాగిందని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భండారీ లేఅవుట్లో ఒకదాని తర్వాత ఒక కట్టడాన్ని కట్టారని.. మరి అంత దుర్మార్గంగా కట్టాల్సిన అవసరం లేదన్నారు. డబ్బుకు ఆశపడకుండా నాణ్యమైన కట్టడాలు నిర్మించాలని బిల్డర్లకు సూచించారు. గత 30 ఏళ్లుగా నడుస్తున్న అక్రమాలను ఇప్పటికిప్పుడు కూలగొట్టడం సాధ్యం కాదని.. అయితే ఇకపై అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలోని ప్రగతినగర్, పుప్పాలగూడ, నార్సింగ్, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర నగర పంచాయతీలు ఏదో ఒక రోజు జీహెచ్ఎంసీలో విలీనమవుతాయని.. ఆ ప్రాంతాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఆగస్టులోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నగర శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టులోగా హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని, వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలా ఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. హైదరా బాద్‌కి తాగునీటి సరఫరా కోసం శామీర్ పేట్లో తలపెట్టిన భారీ రిజర్వాయర్‌ను రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షుడు సి.ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఐటీలకు 4 వారాల్లోనే అనుమతులు
* ఏపీలో సింగిల్ విండో విధానం * పదిరోజుల్లో పాలసీ.. మంత్రి పల్లె వెల్లడి సాక్షి, విశాఖపట్నం: గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ సింగిల్‌విండో విధానాన్ని అమలుచేసి ఐటీ రంగాన్ని అభివద్ధి చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీలో కంపెనీల స్థాపనకు ఇప్పటివరకు 400 వరకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయన్నారు. ఇకపై ఐటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసే కంపెనీలకు నాలుగువారాల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. విశాఖ ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-సమస్యలపై మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. విభజన వల్ల ఏపీలో ఐటీ రంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, ఈరాష్ట్రంలో 22 వేల మంది ఉద్యోగులుంటే, తెలంగాణలో 3.30 లక్షల మంది ఉన్నారన్నారు. ఐటీ రంగాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేయడానికి వీలుగా పదిరోజుల్లో ఐటీ పాలసీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ రీజియన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఐటీఐఆర్‌ను విశాఖనుంచి ప్రారంభిస్తామన్నారు. విశాఖలో పలు ఐటీ సెజ్‌ల్లో 334 ఎకరాల భూములు ఐటీ కంపెనీలు పొందాయని, పనిప్రారంభించని కంపెనీలు నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. లేకపోతే వాటికిచ్చిన భూములు వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఐటీ సెజ్‌లకు ఐలా(ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) హోదా కల్పించి ఐటీ రంగ మౌలిక సమస్యలు తీరుస్తామన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మిషన్‌ను త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామని, సిటీలో ఐటీ కంపెనీల సమస్యలు తీర్చేందుకు రూ.9.5 కోట్లతో పనులు చేయిస్తామని వివరించారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌జాజు తదితరులు ప్రసంగిస్తూ... ఐటీ కంపెనీలు తీసుకున్న భూములను తిరిగి సబ్లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు యాజమాన్యాలకు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాదాపూర్ తరహాలో విశాఖకూ కన్వెన్షన్ సెంటర్ మంజూరుచేస్తామని చెప్పారు. 2020నాటికి అయిదులక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు స్థాపిస్తామంటే నరకం చూపిస్తున్నారు ‘విశాఖలో రూ.10 కోట్లతో హోటల్, కమ్యునికేషన్ వ్యాపారం ప్రారంభించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా... ఒక కంపెనీకి భూమి ఇవ్వమన్నారు... మరో కంపెనీకి ఏపీఐఐసీ కాగితంపై భూమి మంజూరుచేసి ఇప్పటికీ చేతికి ఇవ్వలేదు.... కేవలం లంచం ఇవ్వలేదనే అధికారులు నాకు నరకం చూపిస్తున్నారు..’ అంటూ ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఐఏఎస్ అధికారులను నిలదీశారు. సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేష్కుమార్ మాట్లాడుతూ ఐటీరంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. రూ.80 కోట్లతో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మంజూరైనా ఇప్పటికీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నామన్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైన బ్రాండ్‌బ్యాండ్‌తో సహా కనీసం తాగునీరు, ఉద్యోగులకు భద్రత కల్పించడంలేదన్నారు. ఐటీ రంగానికి 24గంటల విద్యుత్ అవసరంకాగా, వారానికి ఒకరోజు పవర్‌హాలిడే వల్ల దివాళా తీసే పరిస్థితి నెలకొందన్నారు. -
ఐటీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఐటీ పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని చెప్పారు. వంద రోజుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని రఘునాథ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.