సాక్షి, హైదరాబాద్: పర్యాటక స్థలాల్లో ఇబ్బందులు లేకుండా సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు సింగిల్ విండో పాలసీని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సినిమా చిత్రీకరణలకు అనువైన ప్రదేశాలు ఉన్నా నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని వివరించారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయ ప్రాంతాలు, ప్రకృతి సహజంగా ఏర్పడిన అందమైన ప్రాంతాల్లో సినిమాల షూటింగ్‌కు అనువుగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని పర్యాటక స్థలాల్లో సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికి పర్యాటక శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ), పర్యాటక శాఖల మధ్య పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. దర్శకులు, నిర్మాతలు తెలంగాణ ప్రాంతంలో సినిమాలు తీస్తే అనవసర ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆది శేషగిరిరావు, రామారావు, టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment