ట్రంప్‌ టారిఫ్‌లు.. ‘ఇండియన్‌ ఐటీ’కి గట్టి దెబ్బే.. | Indias IT services industry likely to face Challenges due to Trump reciprocal tariffs | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టారిఫ్‌లు.. ‘ఇండియన్‌ ఐటీ’కి గట్టి దెబ్బే..

Apr 4 2025 6:15 PM | Updated on Apr 4 2025 6:36 PM

Indias IT services industry likely to face Challenges due to Trump reciprocal tariffs

డొనాల్డ్‌ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్‌ కీలకమైన ఆదాయ వనరు.

యూఎస్-ఇండియా టెక్ బంధం
దశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్‌ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్‌ టెక్‌ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.

తక్షణ పరిణామాలు 
కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇండస్ట్రీ రెస్పాన్స్..
యూఎస్‌ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.

కొత్త అవకాశాలూ..
ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.

ముందున్న మార్గం 
తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement