సినిమాలకు.. సింగిల్ విండో!
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని
- దసరాకు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం
- చిన్న సినిమాలకు ఐదో ఆటకు అనుమతిలో జాప్యం వద్దు..
- బ్లాక్‌ను అరికట్టేందుకు ఆన్‌లైన్ టికెటింగ్
సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర నిర్మాణానికి వివిధ శాఖల నుంచి అనుమతులు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి సింగిల్ విండో సిస్టమ్‌ను అమల్లోకి తెస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రక్రియను దసరా పండుగ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారులతో చర్చించారు. చలనచిత్ర నిర్మాణాలకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు నిర్మాతలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని, కాలయాపన జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
బ్లాక్ టికెటింగ్‌ను నిరోధించేందుకు ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అన్ని థియేటర్లలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే జిల్లాల్లోని సంబంధిత అధికారులకు, రాష్ట్రంలోని 437 థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం పంపినట్లు వివరించారు.
100 ఎకరాల్లో.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి అనువైన 100 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో గుర్తించామని తలసాని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. 200 నుంచి 300 సీట్ల సామర్థ్యమున్న మినీ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు.
చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో థియేటర్లలో ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు. చిన్న బడ్జెట్ చిత్రాల అర్హతను 35 నుంచి 100 స్క్రీన్లకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బాలల చలనచిత్ర ఉత్సవాల కోసం రూ.8 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.