కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో అందులోనూ .....
సింగిల్ విండో విధానంలోతక్షణమే అనుమతులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో అందులోనూ ఆన్‌లైన్‌లోనే అనుమతులు అందజేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు శివారులోని బిడిది వద్ద బాష్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమొబైల్ ఉత్పతి కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ మంది స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
దీని వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని తెలిపారు. చట్ట ప్రకారం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు. అనుమతుల్లో ఇబ్బందులు ఏర్పడితే వ్యక్తిగతంగా తనను కలుసుకుంటే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బాష్ సంస్థ వ్యవస్థాపక డెరైక్టర్ స్టీఫెన్ బ్రౌన్, ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.