న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో తమ డిమాండ్లకు చోటు కల్పించాలని పలు రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటి స్వాధీనం కోసం కొనుగోలుదారులు వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి ఊరట కల్పించే చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు గాను రూ.2,000 కోట్లతో ఓ నిధి (స్ట్రెస్డ్ అస్సెట్ ఫండ్)ని ఏర్పాటు చేయాలని రియల్టర్ల మండలి నారెడ్కో డిమాండ్ చేసింది. ఇంకా ఈ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరిందంటే...
►ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగంలో నిధుల లభ్యత పరంగా కఠిన పరిస్థితులు ఏర్పడడంతో, లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకోవాలి.
►అందుబాటు ధరల ఇళ్లపై జీఎస్టీని 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. ఇతర ప్రాజెక్టులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తూ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కల్పించాలి.
►ప్రతికూల నెట్‌వర్త్ ఉన్న డెవలపర్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
►స్టాంప్ డ్యూటీ చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రాపర్టీల సర్కిల్ రేట్లను నిర్ణయించాలి.
►ఇళ్ల అద్దె ఆదాయంపై ఫ్లాట్‌గా 10 శాతం పన్ను రేటు అమలు చేయాలి. సెక్షన్ 24(ఏ)కింద అద్దె ఆదాయంలో తగ్గింపును 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అదే, వికలాంగులు, వృద్ధులు, మహిళలకు 100 శాతం పన్ను మినహాయింపు కల్పించాలి.
►ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై ఆదాయపన్ను మినహాయింపు ఉండగా, దీన్ని రూ.3 లక్షలు చేయాలి.
జీఎస్టీ శ్లాబుల్ని హేతుబద్ధీకరించాలి వర్తకులు
ప్రమాద బీమా సదుపాయం, రాయితీపై రుణాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. జీఎస్టీ శ్లాబులను హేతుబద్ధీకరించాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. లేఖలో ఈ సంఘం ఏం పేర్కొందంటే..
►జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలి.
►కంప్యూటర్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తుల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలి.
►రిటైల్ ట్రేడింగ్, ఈ కామర్స్‌కు దేశవ్యాప్త విధానాన్ని తీసుకురావాలి.
►రిటైల్ రంగానికి ప్రత్యేకంగా ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.
►ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్‌ను నెలకొల్పాలి.
►బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపుపై రుణాలను వర్తకులకు ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం 5 శాతం చిన్న వ్యాపారులే బ్యాంకుల రుణాలు పొందుతుండగా, మిగిలిన వారు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
►18 శాతం జీఎస్టీ రేటును ఎత్తివేయాలి. కేవలం సంపన్న(లగ్జరీ) ఉత్పత్తులకే 28 శాతం శ్లాబును పరిమితం చేయాలి. ఆటో విడిభాగాలు, సిమెంట్‌ను ఈ శ్లాబ్ నుంచి తొలగించాలి. పేద ప్రజలు వాడేవి, నిత్యం వినియోగించే వాటిని 5 శాతం రేటులో ఉంచాలి.
►జీఎస్టీ కింద నమోదు చేసుకున్న వ్యాపారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
►మండి ట్యాక్స్, టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేయాలి.
‘ఇంటి’ని చక్కదిద్దరూ..!
Published Thu, Jan 24 2019 1:18 AM | Last Updated on Thu, Jan 24 2019 9:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment