Buyers
-
వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్‌ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్ -
జీఎస్టీ ఎవరు కట్టాలి? బిల్డరా? ఓనరా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిలర్లకు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) -
డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. కొనుగోలు ప్రాధమ్యాలివే.. ♦ ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం ఇష్టపడుతున్నారు. ♦ చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆల నాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండా లని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలే ని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ♦ ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రా«ధమ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌక ర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ♦ వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్స్: గ్రామీణ భారతంపై కన్ను
హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్‌ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది) తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు!
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసొస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే! స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కండీషన్స్ అప్లై ఎలాగైతే ఉంటుందో అలాగే స్థిరాస్తి రంగానికీ ఉంటుంది. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. ఇలాంటి పరిస్థితులలో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా.. గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తుంది. ఇందులో ధర చ.అ.కు రూ.5,500లకు విక్రయిస్తుంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు. రేపటి అవసరాన్ని బట్టే కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమం అని చాలా మంది సలహా ఇస్తుంటారు కానీ ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. పైగా విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని బట్టి గృహాలను కొనుగోలు చేయాలి. చాలా మంది ప్రస్తుతం ఆర్జించే ఆదాయానికి పరిమితమై కొనుగోలు నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు, పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈరోజు 2 బీహెచ్‌కే కొనే చోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. ఉత్తమ గృహ కొనుగోలుదారులు చేసేదిదే. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వీటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలలో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఇప్పటికే ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలకు, ప్రాంతాలతో దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ఏరియాలకు కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ మెరుగైంది కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, నేడు పరిస్థితి మారింది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ చదవండి: NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు భారీ ఊరట.. -
తూనికలు, కొలతల చట్టాలు సవరిస్తాం
న్యూఢిల్లీ: వ్యాపారాలు, వినియోగదారులపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా తూనికలు, కొలతల ప్రమాణాలకు సంబంధించిన లీగల్ మెట్రాలజీ చట్టం–2009లో సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అనుచిత వ్యాపార విధానాలను కట్టడి చేసేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ సవరణలను తలపెట్టినట్లు ఆయన తెలిపారు. చట్టాలు, నిబంధనలను సరళతరం చేసేందుకు సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ చెప్పారు. వినియోగదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫిర్యాదులు చేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ’ఈ–దాఖిల్’ సదుపాయానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 40,000 పైచిలుకు ఫిర్యాదులు ఈ ప్లాట్‌ఫాంపై దాఖలైనట్లు వివరించారు. అయితే, మరింత మందికి దీని గురించి తెలిసే విధంగా అవగాహనను పెంచాల్సి ఉందని చెప్పారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఫిర్యాదిదారు సులభంగా ఆన్లైన్లో అప్పీలు చేసుకోవడానికి, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కోర్టు విచారణకు హాజరవడానికి వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. చిన్న నగరాల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి .. ప్రథమ, ద్వితీయ శ్రేణి చిన్న నగరాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మూడో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. విజయవంతమైన స్టార్టప్‌లు తమ అనుభవాలను యువతతో పంచుకోవాలని, వారిలో ఎంట్రప్రెన్యూర్షిప్ స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. దేశీయంగా అంకుర సంస్థల్లో 45% స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉంటున్నాయని.. 623 జిల్లాల్లో కనీసం ఒక్కటైనా గుర్తింపు పొందిన స్టార్టప్ ఉందని ఆయన తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2018–21 మధ్య కాలంలో స్టార్టప్‌లు దాదాపు 5.9 లక్షల ఉద్యోగాలు కల్పించాయి. చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్.. -
'అద్దె ఇంట్లో ఉండలేం.. 3 నెలల్లో సొంతిల్లే కొనుక్కుంటాం'
న్యూఢిల్లీ: అపార్ట్మెంట్ విస్తీర్ణం, నిర్మాణదారుల గత చరిత్ర (ట్రాక్ రికార్డ్), ఆరోగ్య వసతులు,పచ్చదనానికి తగినంత ఆవరణ, తక్కువ జనసాంద్రత, ప్రజా రవాణా వసతులు, స్కూళ్లు, కార్యాలయాలకు అనుసంధానత.. ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులు వరుస క్రమంలో చూసే అంశాలు ఇవే. కరోనా మమహ్మారి తర్వాత కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య అంశాలుగా మారిపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా, రూఫాండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యత సర్వే 2021: కరోనా ప్రభావం’ పేరుతో ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల పరిధిలోని 2,500 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నాయి. అన్నింటికంటే ముందు ఫ్లాట్ విస్తీర్ణణమే తమకు ముఖ్యమని వీరు చెప్పారు. ఆ తర్వాత డెవలపర్ల చరిత్రను చూస్తామని తెలిపారు. చదవండి: వేలంవెర్రి, చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనా వాల్ కూడా మావే! ప్రాధాన్యతల్లో మార్పులు.: ఇళ్ల కొనుగోలుకు సంబంధించి చూసే అంశాల్లో పెద్దగా మార్పుల్లేవని.. వాటి ప్రాధాన్యతల్లోనే మార్పులు వచ్చినట్టు జేఎల్ఎల్ తన సర్వే నివేదికలో తెలిపింది. కరోనాకు ముందు 2020 మొదటి మూడు నెలల్లో నిర్వహించిన సర్వేలో.. కార్యాలయం, స్కూళ్లకు అనుసంధానం వినియోగదారుల మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది. ఆ తర్వాత ప్రజా రవాణా వసతులు, డెవలపర్ల చరిత్ర, అపార్ట్మెంట్ సైజ్, హెల్త్‌కేర్ వసతులు, వినోద కేంద్రాలు, పచ్చదనం, తక్కువ జనసాంద్రత అంశాలకు వరుస క్రమంలో గతంలో ప్రాముఖ్యమిచ్చారు. కొనుగోలుదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు తగినట్టు డెవలపర్లు డిజైన్లలో మార్పులను అమలు చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. డెవలపర్‌కు మంచి చరిత్ర ఉంటే కాస్త ఎక్కువ వ్యయం చేసేందుకు వినియోగదారులు వెనుకాడడం లేదని పేర్కొంది. ఇళ్ల కొనుగోలుకు సుముఖంగా ఉన్న వారిలో 80 శాతం మంది వచ్చే మూడు నెలల్లోనే ఆ పనిచేస్తామని చెప్పగా.. 80 % మంది రూ.75 లక్షల్లోపు ఇల్లును ఎంచుకుంటామని తెలిపారు. 89% మంది అద్దెకు ఉండడానికంటే సొంత ఇంటికే వోటు వేయడం గమనార్హం. రియల్ ఎస్టేట్‌లోకి మహిళా నిపుణులు రావాలి కేంద్ర పట్టణ వ్యవహారాల కార్యదర్శి మిశ్రా దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగానికి అపార అవకాశాలున్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. కనుక ఈ రంగంలో పనిచేసేం దుకు మహిళా నిపుణులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం ‘నరెడ్కో’ మహిళా విభాగం ‘నరెడ్కోమహి’ విభాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మిశ్రా మాట్లాడారు. ‘‘రియల్ఎస్టేట్ రంగంలో రెరా చట్టం విశ్వాసాన్ని తీసుకొచ్చింది. కనుక మహిళా నిపుణులు ఈ రంగంతో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలి. మహిళలకు అన్ని రకాల సామర్థ్యాలున్నాయి. క్లిష్టమైన, సున్నితమైన నైపుణ్యాలు వారిలో ఉన్నాయి. ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్‌లోనూ వారు తమ సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదు’’ అని మిశ్రా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఈ రంగం కీలకమైనదిగా అభి వర్ణించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మం దికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా పేర్కొన్నారు. చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు -
ధాన్యం కొనుగోలుకు బల్క్ బయ్యర్లకు అవకాశం!
న్యూఢిల్లీ: ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేసేవారికి(బల్క్ బయ్యర్స్, బిగ్ రీటెయిలర్స్, ప్రాసెసర్స్) రైతులు, సహకార సంస్థల నుంచి ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్రం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల పాటు వారికి ఆ అవకాశం కల్పించాలని కోరింది. తద్వారా వ్యవసాయ మార్కెట్లపై భారం తగ్గుతుందని, అలాగే, వినియోగదారుడికి తగినంత స్థాయిలో ఉత్పత్తులు లభిస్తాయని సూచించింది. అలాగే, వేర్‌హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టరైన గోదాములను ‘ఈ నామ్’ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్‌కు వీలైన మార్కెట్లుగా ప్రకటించాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ బుధవారం లేఖ రాశారు. అంబేడ్కర్ జయంతిన సెలవు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14ను కేంద్రం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాలు మూతపడనున్నాయి. -
రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని ఆర్–క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది. -
పారదర్శక పాలనలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రిజిస్ట్రేషన్ శాఖ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులు సైతం సులువుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్రమాలకు చెక్ పెట్టడమే ధ్యేయంగా రిజిస్ట్రేషన్ శాఖ.. న్యాయ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రంగాల నిపుణులతో సంప్రదించి ఏయే అంశాలు తప్పనిసరిగా ఉండాలో చర్చించి సులభమైన రీతిలో నమూనా దస్తావేజులను రూపొందించింది. దీంతో ఎవరి డాక్యుమెంట్లను వారే సులభంగా రూపొందించుకునేలా కసరత్తు ప్రారంభించింది. భూములు, స్థలాలు, భవనాలు స్థిరాస్తుల అమ్మకం, బహుమతి, భాగం (పార్టిషన్), తనఖా, విడుదల (రిలీజ్)కు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు 16 రకాల నమూనా డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ దిశగా కొత్త విధానాన్ని రూపొందించి కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటిదాకా దళారులే ఆధారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు (దస్తావేజులను) రాయడం కోసం ఎంత చదువుకున్న వారైనా దస్తావేజు లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. సొంతంగా దస్తావేజులు రాసుకునే వారు ఒక శాతం కూడా లేరు. దస్తావేజులు రాయడం అనేది సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల వివిధ రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోదలచిన వారు లేఖరులను కలిసి దస్తావేజులను రాయించుకుంటున్నారు. ఒక్కో దస్తావేజు తయారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ తీసుకుంటున్నారు. చాలాచోట్ల దస్తావేజు లేఖరులు/దళారులు తామే రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ రిజిస్ట్రేషన్ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకంటూ వేలల్లో డబ్బు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఇలా.. అవసరం ఉన్న వారెవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లను (విక్రయం, బహుమతి, భాగం..) డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోనే అమ్మకందారులు, కొనుగోలుదారులు, ఆస్తులు, సర్వే/ ఇంటి నంబరు, సాక్షులు, చిరునామాలు లాంటి ఖాళీలను పూరిస్తే సమగ్రమైన డాక్యుమెంట్ తయారవుతుంది. దానిని ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్/అప్లోడ్ చేస్తే నమోదు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళుతుంది. ఆస్తి వివరాలు (సర్వే నంబరు, విస్తీర్ణం/ ప్లాట్ నంబరు విస్తీర్ణం) లాంటివి నమోదు చేయగానే ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్ కోసం ఎంత రుసుం (రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం) చెల్లించాలో కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఆ మేరకు ఆన్లైన్లోనే చెల్లించే విధానం ఇప్పటికే ఉంది. ఏరోజు, ఏసమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా ఆన్లైన్లోనే నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. డబ్బు , సమయం ఆదా నూతన విధానం వల్ల డాక్యుమెంట్ల (దస్తావేజుల) తయారీ కోసం దళారులను ఆశ్రయించి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. దీనివల్ల అటు డబ్బు, ఇటు సమయం ఆదా అవుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ వినూత్న విధానం వల్ల పూర్తిగా అవినీతికి చెక్ పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి తగు మార్పు చేర్పులతో నవంబర్ ఒకటో తేదీ నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో రోజు రెండు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులకు విద్యావంతులు, పుర ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, రియల్టర్లు, బిల్డర్లు లాంటి వివిధ వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారు. కొత్త విధానం గురించి వివరించడంతోపాటు అవసరమైన మార్పు చేర్పులకు సంబంధించి వీరి నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇందులో విలువైన, ఆచరణాత్మక సూచనలు ఉంటే వీటిని కూడా చేర్చి నవంబర్ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఈ నెల 14న కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న వైఎస్సార్, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. దళారులకు బ్రేక్ ప్రస్తుతం ప్రజలు స్థిరాస్తుల విక్రయం, బహుమతి, తనఖా ఇతరత్రా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా దస్తావేజులు రాయించుకోవడం కోసం లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. కొత్త విధానం వల్ల ఎవరూ ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దస్తావేజులను కంప్యూటర్లోనే రూపొందించి సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి ఆన్లైన్లోనే పంపవచ్చు. ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ధిష్ట సమయానికి వెళ్లి గంటలోగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజు నకళ్లు కూడా తీసుకుని వెళ్లవచ్చు. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఎవరికీ నయాపైసా లంచం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందరి సమస్యా ఇదే.. విశాఖ నగరానికి చెందిన ఒక వ్యాపారి సబ్బవరంలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దస్తావేజు రాయించుకోవడం కోసం దస్తావేజు లేఖరుడైన దళారీని సంప్రదించారు. దస్తావేజు రాయడం, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బందికి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఆ దళారి రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దస్తావేజు రాసినందుకే రూ.6 వేలు తీసుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు ‘మీ దస్తావేజును మీరే తయారు చేసుకోండి..’ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. -
తినాలని ఉంది..కానీ
సాక్షి సిటీబ్యూరో: మామిడి పండు చేదెక్కింది. తినాలని ఉన్నా వాటి ధర చూసి వెనక్కు తగ్గాల్సి వస్తోంది. వేసవిలో వచ్చే మామిడిపండ్లను తినాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. మధుర ఫలం కోసం వేసవి వరకు ఎదురు చూసి తీరా వచ్చిన తరువాత వాటి ధర కారణంగా నామమాత్రంగా తింటున్నారు. ఈఏడాది సాధారణ రకం మామిడి పండ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏరకం మామిడి పండ్లను చూసినా సామాన్యుడికి అందుబాటులో లేవు. దీంతో మధుర ఫలాన్ని కొనేందుకు అవస్థలు పడుతున్నారు. కరువుకు తోడు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన మామిడి రకాలు అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి సరఫరా అనూహ్యంగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో మార్కెట్లన్నీ మామిడి దిగుమతులతో ముంచెత్తగా ఈ సారి మాత్రం వాటి సరఫరా తగ్గిపోయింది. అక్కడక్కడా వస్తున్న మేలు రలకాలను ఢిల్లీ, లక్నో వ్యాపారులు డైరక్టుగా కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది కంటే ధరలు ఎక్కువ దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత సంవత్సరంతో పోలిస్తే రెండింతలు అయ్యింది. హోల్ సేల్ మార్కెట్లో క్వింటాల్ గత సంవత్సరం రూ. 5 వేలు మోడల్ ధర కాగా అది ఈ సంవత్సరం రూ. 7 వేలకు చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో మామిడి కాయలు ( సైజు బట్టి మూడు నుంచి నాలుగు మాత్రమే వస్తాయి) రూ. 90 నుంచి 150 వరకు పలుకుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నుం చి జులై వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మామిడి రకాలు ఇక్కడే లభ్యం అయ్యేవి. అయితే ప్రస్తుతం అన్ని రకాలు అందుబాటులో లేవు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కేవలం కొన్ని రకాల మామిడి మాత్రమే నగర మార్కెట్లో లభిస్తున్నాయి. గడిచిన ఏడాది వరకు బెనీషా,ఆలంపూర్, తొతపూరి, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తదితర రకాలు అందుబాటులో వుండగా ఈ ఏడాది మాత్రం బెనీషా, రకం ఒక్కటే మార్కెట్లోకి అధికంగా వస్తోంది. గత సంవత్సర మార్చి ,ఏప్రిల్, మేమాసాల్లో గడ్డి అన్నారం మార్కెట్‌కు 92,40,239 క్వింటాళ్ళ మామిడి రాగా ఈ సంవత్సరం మాత్రం 74, 406 క్వింటాళ్ళు మాత్రమే రావడాన్ని బట్టి చూస్తే మామిడి సరఫరా తగ్గిపోయిందడానికి నిదర్శనం. -
ఈ–కామర్స్ 1.2 లక్షల కోట్ల డాలర్లు!
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్లైన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో 2021 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని నివేదిక పేర్కొంది. దేశీ కరెన్సీ రూపాయి మారకం విలువపై ఒత్తిడి, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరుగుతున్నప్పటికీ.. 2021–2026 మధ్య భారత రిటైల్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 7.8% మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం 32% వార్షిక వృద్ధి సాధిస్తున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ మరికొన్నాళ్ల పాటు మరింత అధిక వృద్ధి నమోదు చేయనుందని నివేదిక తెలిపింది. మారుతున్న కొనుగోలుదారుల ధోరణులు.. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్లో కొనుగోలు జరిపేవారి సంఖ్య పెరుగుతుండటం, వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతుండటం తదితర అంశాలు ఈ–కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. అటు ఎం–కామర్స్ (మొబైల్ ద్వారా కొనుగోళ్లు) కూడా భారీగా పెరుగుతోందని వివరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లుగా ఉన్న ఎం–కామర్స్ లావాదేవీల పరిమాణం 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,00,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, మారుతున్న షాపింగ్ ధోరణులు, స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో వృద్ధి వంటివి ఆన్లైన్ అమ్మకాల పెరుగుదలకు తోడ్ప డ్డాయి. ఇక, ప్రథమ..ద్వితీయ..తృతీయ శ్రేణి మార్కెట్స్‌లో మిలీనియల్స్ (1980–1996 మధ్య పుట్టినవారు) ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆహారం, దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీలు మొదలైన వాటి కొనుగోళ్లు అత్యధికం. సోషల్ కామర్స్ ప్రభావం... ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోందని నివేదిక పేర్కొంది. 28% మిలీనియల్స్.. సోషల్ మీడియా సిఫార్సుల మేరకు కొనుగోళ్లు జరపగా, 63% మిలీనియల్స్ తమకిష్టమైన బ్రాండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దేశీ ఈ–కామర్స్ రంగంలో కన్సాలిడేషన్ కూడా పెరుగుతోందని, 2017, 2018లో విలీన... కొనుగోళ్ల డీల్స్ 25 శాతం మేర పెరగడమే నిదర్శనమని నివేదిక పేర్కొంది. -
‘ఇంటి’ని చక్కదిద్దరూ..!
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో తమ డిమాండ్లకు చోటు కల్పించాలని పలు రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటి స్వాధీనం కోసం కొనుగోలుదారులు వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి ఊరట కల్పించే చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు గాను రూ.2,000 కోట్లతో ఓ నిధి (స్ట్రెస్డ్ అస్సెట్ ఫండ్)ని ఏర్పాటు చేయాలని రియల్టర్ల మండలి నారెడ్కో డిమాండ్ చేసింది. ఇంకా ఈ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరిందంటే... ►ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల రంగంలో నిధుల లభ్యత పరంగా కఠిన పరిస్థితులు ఏర్పడడంతో, లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకోవాలి. ►అందుబాటు ధరల ఇళ్లపై జీఎస్టీని 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. ఇతర ప్రాజెక్టులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తూ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కల్పించాలి. ►ప్రతికూల నెట్‌వర్త్ ఉన్న డెవలపర్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ►స్టాంప్ డ్యూటీ చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రాపర్టీల సర్కిల్ రేట్లను నిర్ణయించాలి. ►ఇళ్ల అద్దె ఆదాయంపై ఫ్లాట్‌గా 10 శాతం పన్ను రేటు అమలు చేయాలి. సెక్షన్ 24(ఏ)కింద అద్దె ఆదాయంలో తగ్గింపును 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అదే, వికలాంగులు, వృద్ధులు, మహిళలకు 100 శాతం పన్ను మినహాయింపు కల్పించాలి. ►ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై ఆదాయపన్ను మినహాయింపు ఉండగా, దీన్ని రూ.3 లక్షలు చేయాలి. జీఎస్టీ శ్లాబుల్ని హేతుబద్ధీకరించాలి వర్తకులు ప్రమాద బీమా సదుపాయం, రాయితీపై రుణాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. జీఎస్టీ శ్లాబులను హేతుబద్ధీకరించాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. లేఖలో ఈ సంఘం ఏం పేర్కొందంటే.. ►జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. ►కంప్యూటర్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తుల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలి. ►రిటైల్ ట్రేడింగ్, ఈ కామర్స్‌కు దేశవ్యాప్త విధానాన్ని తీసుకురావాలి. ►రిటైల్ రంగానికి ప్రత్యేకంగా ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. ►ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్‌ను నెలకొల్పాలి. ►బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపుపై రుణాలను వర్తకులకు ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం 5 శాతం చిన్న వ్యాపారులే బ్యాంకుల రుణాలు పొందుతుండగా, మిగిలిన వారు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ►18 శాతం జీఎస్టీ రేటును ఎత్తివేయాలి. కేవలం సంపన్న(లగ్జరీ) ఉత్పత్తులకే 28 శాతం శ్లాబును పరిమితం చేయాలి. ఆటో విడిభాగాలు, సిమెంట్‌ను ఈ శ్లాబ్ నుంచి తొలగించాలి. పేద ప్రజలు వాడేవి, నిత్యం వినియోగించే వాటిని 5 శాతం రేటులో ఉంచాలి. ►జీఎస్టీ కింద నమోదు చేసుకున్న వ్యాపారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ►మండి ట్యాక్స్, టోల్ట్యాక్స్ను రద్దు చేయాలి. -
కారు కొంటే.. హోండా బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: సెప్టెంబర్ 1నుంచి కార్ల ధరలు పెరిగాయని అందోళన పడుతున్నవారికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా పండుగ కానుక అందిస్తోంది. హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు నెలవారీ విలువైన బహుమతులతోపాటు, ఒక బంపర్ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా షోరూంలలో ప్రమోషనల్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్లో లక్కీ డ్రా గెలిచిన కస్టమర్లకు ఉచితంగా విదేశీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమ మోడల్ కార్లు అన్నింటిపైనా ఈ ఆఫర్ వర్తింస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశంలో ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ది గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ప్రకటించిన ఆఫర్లో నెలవారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తోడుగా మరో గ్రాండ్ ప్రైజ్‌ను కూడా అందిచనున్నామని తెలిపింది. ఇందులో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కస్టమర్‌కు లండన్, పారిస్ టూర్ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 1నుంచి నవంబరు7, 2018 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కారును కొనుగోలు చేసిన అనంతరం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ www.hondacarindia.లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. నిర్దేశిత కాలంలో బిల్లింగ్, డాక్యుమెంటేషన్ తదితర అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన కస్టమర్లు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులు. బ్రియో జాజ్, అమేజ్, డబ్యలువీఆర్-వీ, సిటీ, బీఆర్-వి ఎస్యూవీ , సీఆర్-వి, అకార్డ్ హైబ్రిడ్ సహా అన్ని హోండా కార్ల కొనుగోళ్లపై ఆ ఆఫర్ వర్తిస్తుంది. -
'ఈ- ఆక్షన్' ...మీ కోసమే!!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం:శ్రీకృష్ణ, నీలిమ అందినంత రుణం దొరుకుతోంది కదా అని తాహతుకు మించి అప్పు చేసి ఇల్లు కొన్నారు. కానీ తరవాత పరిస్థితులు తిరగబడి ఆ ఇంటి రుణానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడిపోయారు!!. రామరాజుకు సొంత కంపెనీ ఉంది. ఆదాయం బాగా వస్తున్నపుడు కంపెనీ విస్తరణ కోసం రుణాలు తీసుకున్నాడు. తను అప్పటికే కొనుగోలు చేసిన నాలుగైదు ఫ్లాట్లను కూడా సెక్యూరిటీగా తనఖా పెట్టాడు. కాకపోతే ఆ వ్యాపారంలో పోటీ పెరిగి లాభాలు పడిపోయాయి. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడ్డాడు!!. ఇలా... కారణాలు ఏవైనా కావచ్చు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ మధ్య రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పైపెచ్చు బ్యాంకులు ఇంతకుముందు చూసీ చూడనట్లు వ్యవహరించేవి. ఏడాది రెండేళ్లపాటు రుణాల వాయిదాలు చెల్లించకపోయినా పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ మారిన నిబంధనలు, పెరిగిన నిఘా, ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఇపుడవి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదాలు చెల్లించటంలో విఫలమైన డిఫాల్టర్లకు నోటీసులిస్తూ... వారు తనఖా పెట్టిన ఇళ్లను, ఇతర ఆస్తులను వేలానికి పెడుతున్నాయి. ఈ మధ్య పత్రికల్లో ఇలాంటి వేలాలకు సంబంధించిన ప్రకటనలు కూడా పెరిగాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు వేలానికి పెడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమైనా... కాస్త తక్కువలో ఇళ్లు కొనుక్కుని సెటిల్ అవుదామనుకునే ఈ డిస్ట్రెస్డ్ సేల్ ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఈ వేలానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తవుతోంది. ఔత్సాహిక కొనుగోలుదారులకు ఇది మరింత కలసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఇళ్లను కొనొచ్చా? కొంటే లాభమా... నష్టమా? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... అన్ని రకాల ఆస్తుల వేలం బ్యాంకులు వేలం వేసే వాటిలో అన్ని రకాల ఆస్తులూ ఉంటున్నాయి. ఎస్బీఐ ఇటీవలే అతిపెద్ద ఎలక్ట్రానిక్(ఈ) వేలాన్ని నిర్వహించింది. ఇందులో ఒకేసారి 1,000 ఆస్తులను వేలానికి పెట్టింది. ఇందులో ఇళ్లు, వాణిజ్య భవనాలు (ఆఫీసులు, షాపులు) ఫ్యాక్టరీ బిల్డింగులు ఉన్నాయి. వేలం వేసింది ఏ ప్రాంతం, ఎంత విస్తీర్ణంలో ఉన్నది తదితర అంశాలను బట్టి ధర ఉంటుంది. ఉదాహరణకు ముంబై శాంతాక్రజ్ ఈస్ట్‌లో రెండు పడకగదుల ఇళ్లను రూ.2 కోట్ల రిజర్వ్ ధరకు వేలానికి పెట్టింది. నవీ ముంబైలో ఫ్లాట్ లేదా షాపు ధర రూ.8.5 కోట్లు. పాతవి, తక్కువ విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్లు లేదా షాపులు, చిన్న పట్టణాల్లో ఆస్తులు రూ.50 లక్షల్లోపే ఉంటున్నాయి. ధరలూ ఆకర్షణీయమే! కొన్ని సందర్భాల్లో వేలంలోకి వచ్చేవి ఆకర్షణీయ ధరల్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే తమకున్న బకాయిలను వసూలు చేసుకుంటే చాలనుకుని బ్యాంకులు ధర తగ్గించి అమ్మకానికి పెడుతుంటాయి. వేలానికి ఉంచే అన్ని ఆస్తులపై బ్యాంకులు లాభాలను ఆశించలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఇది బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య నేరుగా జరిగే లావాదేవీ. మధ్యలో బ్రోకర్లు ఉండరు. తమ వద్ద నమోదైన వ్యాల్యూయర్ల సిఫారసుల మేరకు బ్యాంకులు వేలం ధరను ఖరారు చేస్తుంటాయి. సాధారణంగా మార్కెట్ ధర కంటే 10–15 శాతం తక్కువే ఉంటుంది. ఇందులో రిజర్వ్ ధర ఉంటుంది. బ్యాంకులు ఇంత కంటే తక్కువ ధరకు విక్రయించవని అర్థం. ఆ ధరకు అదనంగా కొంత కోట్ చేస్తూ వేలంలో పాల్గొనవచ్చు. చివరికి ఎక్కువ కోట్ చేసినవారు విజేతగా నిలుస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ ఎలా...? వేలం ప్రక్రియలో పాల్గొని బిడ్డింగ్ వేయడం చాలా సులభం. ఆక్షన్ సైట్లు, స్థానిక వార్తా పత్రికల ద్వారా ఈ–వేలం గురించి తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఈ ఆక్షన్స్, ఫోర్క్లోజర్ ఇండియా, ఈఆక్షన్.ఎన్పాసోర్స్ తదితర పోర్టల్స్ పలు బ్యాంకుల తరఫున వేలం ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. కెనరా బ్యాంకు అయితే ‘కెనరాబ్యాంకు. ఆక్షన్టైగర్.నెట్’లో వేలం వేస్తుంటుంది. ప్రతి ప్రాపర్టీ సమాచారం అక్కడే అందుబాటులో ఉంటుంది. బిడ్డింగ్‌ను కూడా అక్కడే సమర్పించొచ్చు. బిడ్ డాక్యుమెంట్‌లోనే ప్రాపర్టీకి సంబంధించి రుణ బకాయిలు తదితర సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్స్‌లో తమ పేరు, ఇతర కేవైసీ వివరాలతో నమోదు చేసుకున్న తర్వాతే బిడ్‌కు అర్హత లభిస్తుంది. పైగా వేలంలో పాల్గొని బిడ్ వేసే వారు ప్రాపర్టీ రిజర్వ్ ధరలో 10% చెల్లించాల్సి ఉంటుంది. ఏ తేదీన, ఏ సమయంలో ఆస్తిని వేలం వేస్తున్నదీ బ్యాంకు తెలియజేస్తుంది. అలాగే, ప్రత్యక్షంగా ఆ ప్రాపర్టీని చూసుకునేందుకూ ఒక తేదీని నిర్ణయిస్తుంది. ఆ రోజున వెళ్లి ప్రాపర్టీని చూసుకోవచ్చు. వేలం గెలుచుకున్న వారు విక్రయ ధరలో 25 శాతాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని తదుపరి 15 రోజుల్లో చెల్లించేయాలి. దీనికి కావాలనుకుంటే రుణం తీసుకోవచ్చు. దీంతో ఆస్తిపై హక్కులను కొనుగోలుదారులకు బ్యాంకులు బదలాయిస్తాయి. సొసైటీ నిరంభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) కూడా అందిస్తాయి. పరిశీలించాల్సినవి ఇవీ... బ్యాంకుల ఈ వేలంలో పాల్గొని ఆస్తిని సొంతం చేసుకునే వారు ఓ న్యాయవాది సహకారం తీసుకోవడం ద్వారా టైటిల్ పరంగా సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆ ఆస్తిపై ఏవైనా పెండింగ్‌లో వివాదాలున్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఇక కొనుగోలు చేస్తున్న ఆస్తికి సంబంధించి నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు ఏవైనా ఉన్నదీ తెలుసుకోవాలి. బ్యాంకులు పేర్కొన్న నిర్ణీత గడువులోపే చెల్లింపులన్నీ జరిగేలా చూసుకోవాలి. ఇక వేలాన్ని రద్దు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత బ్యాంకులు వేలం వేస్తాయి. ఈలోపు బకాయిదారుడు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించేస్తే బ్యాంకులు రద్దు నిర్ణయం తీసుకుంటాయి. కొన్ని సొసైటీలు అయితే తొలి తిరస్కరణ హక్కు కింద తామే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ప్రతికూలతలూ ఉంటాయి! ఆస్తిని ‘ఉన్నది ఉన్నట్టుగా’ అనే స్థితిలో బ్యాంకు అమ్మకానికి పెడుతుంది. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ విషయంలోనూ, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. పైపెచ్చు సదరు ఆస్తికి సంబంధించి పన్నులు, ఇతరత్రా అంశాల్లో స్థానిక సొసైటీలకు, మున్సిపాలిటీలకు ఏవైనా బకాయిలున్నా సరే వాటిని బ్యాంకు చెల్లించదు. వేలానికి పెట్టే ఇళ్లు కొత్తవి కావు కనక మరమ్మతులు వంటివేవైనా చేయించాల్సి ఉంటే వాటిని కొనుగోలుదారే చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆ ఇంటికి సంబంధించి వివాదాలు, మరమ్మతులు, బకాయిల వంటి అన్నిటికీ కొనుగోలు చేసిన వారే బాధ్యులవుతారు. వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
వినియోగదారుల చట్టం పరిధిలోకి మార్కెట్ కమిటీలు
ఏపీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు సాక్షి, హైదరాబాద్: కొనుగోలుదారులు, రైతుల నుంచి రుసుము వసూలు చేసి సేవలందిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని ఏపీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చి చెప్పింది. సౌకర్యాలేవీ ఉచితంగా కల్పించడంలేదని, క్విడ్‌ప్రోకో తరహాలో సేవలకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో కమిటీలు ఈ చట్టపరిధి లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఏపీ మార్కెట్ చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద)లోని సెక్షన్ 14 కింద వసూలైన ఫీజు సొమ్మును మార్కెట్ కమిటీ ఫండ్‌కు జమ చేయాలన్నారు. సెక్షన్ 15 ప్రకారం మార్కెట్ ఏర్పాటుకు భూమి కొనుగోలు, నిర్మాణాలు, నిర్వహణ సహా ఇతర సౌకర్యాల కల్పనకు కమిటీ ఫండ్ నుంచే డబ్బును ఖర్చు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ బుధవారం తీర్పునిచ్చారు. అప్పీలు కొట్టివేస్తూ తీర్పు... తమకు వినియోగదారుల రక్షణ చట్టం వర్తించదంటూ కృష్ణా జిల్లా మార్కెటింగ్ రీజినల్ డైరెక్టర్, గుంటూరు సహాయ డైరెక్టర్, తెనాలి మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. -
అందుబాటుకే ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆటస్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. ధర అందుబాటులో ఉంటే చాలు. ఇంటి విస్తీర్ణం తక్కువైనా.. నిర్మాణం నాణ్యంగా ఉంటే కొనడానికి సిద్ధమని కొనుగోలుదారులు అంటున్నారు. తమను దృష్టిలో పెట్టుకుని ఇళ్లను నిర్మించాలని కోరుతున్నారు. మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. ⇔ ఇప్పటిదాకా భారత స్థిరాస్తి సంస్థలు ప్రభుత్వ బ్యాంకులకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డాయి. కొంతమంది వద్ద యాభై శాతం ఫ్లాట్లు కూడా అమ్ముడవ్వలేదు. అమ్మకాల్లేక కుంగిపోవటం కంటే అందుబాటు ఇళ్లను నిర్మిస్తే నగదు లభ్యతకు ఇబ్బంది ఉండదనేవారు లేకపోలేదు. ఇందుకోసం పలు సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ⇔ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. జోరుగా నిర్మాణ పనులూ జరుగుతున్నాయి. ⇔ ఖరీదైన ఇళ్లను కొనేవారు నేటికీ ఉన్నారు. కాకపోతే వీరికంటే ఎక్కువగా అందుబాటు ధరల్లో ఇళ్లను కొనేవారెక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి బిల్డర్లు, డెవలపర్లు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల్ని మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ⇔ కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారి సంఖ్య తక్కువ. కేపీహెచ్‌బీ, కొండాపూర్, హైదర్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.25–30 లక్షల్లోపు కొనాలని భావించే కొనుగోలుదారులున్నారు. కానీ, ఈ ధరకు అమ్మే బిల్డర్ల సంఖ్య నామమాత్రమేనని చెప్పొచ్చు. ⇔ అమ్మకాల విషయంలో ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో పలు సంస్థలు వెయ్యి నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. -
గుంటూరు జిల్లాలో బాంబుల కలకలం
* పోలీసుల అదుపులో కొనుగోలుదారులు * తయారీదారుల కోసం గాలింపు రొంపిచర్ల: గుంటూరు జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకొన్న నాటుబాంబుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నాటుబాంబులను రొంపిచర్ల మండలంలో తయారుచేసి ఇతర మండలాలకు సరఫరా చేస్తున్నట్లు తెలస్తోంది. బాంబులు తయారుచేసి విక్రయించడమే కాకుండా అవసరం లేకపోతే తిరిగి అప్పజెప్పి డబ్బు ఇచ్చే విధంగా కూడా బాంబుల వ్యాపారం జరుగుతుందంటే బాంబుల తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. సోమవారం పోలీసులు పట్టుకున్న బాంబుల విలువ రూ.14 వేలు. ఈ బాంబులు కొనుగోలు చేసిన ములకలూరు గ్రామస్తులకు అవసరం లేకనో, బాంబులలో నాణ్యత లేదనో తయారుచేసిన అమ్మకందారులకు తిరిగి అప్పజెప్పే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. బాంబులు తిరిగి తీసుకొని డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని తయారీదారులు డబ్బు ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు వ్యక్తులు బాంబులు సరఫరా చేసినవారి వివరాలను కూడా తెలిపారు. దీంతో అనుమానితుల్లో ఒకరైన రొంపిచర్లకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబులు తీసుకెళుతున్న వ్యక్తులను విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం గ్రామాల మధ్య పొలంలో పట్టుకున్నారు. ఈ ప్రదేశం సుబాబుల్ తోటలతో అడవిని తలపించే విధంగా ఉండి తయారీదారులకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతంలోని వారే బాంబులు తయారుచేసి ఉండవచ్చునని అనుమానంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రదేశంలో మంగళవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. బాంబుల కొనుగోలుదారులు పోలీసుల అదుపులో ఉండడం వలన అమ్మకందారులు అందరినీ పట్టుకోవడం పోలీసులకు పెద్ద పనేం కాకపోవచ్చు. -
మీ ఫ్లాట్ యూడీఎస్ ఎంత?
అన్డివెడైడ్ షేర్‌తోనే ఇంటి విలువ లెక్కింపు స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌజ్ వంటి ఆధునిక వసతుల వల్ల కొందరు.. నాణ్యమైన నిర్మాణం, నిర్వహణ, భద్రతల వల్ల ఇంకొందరు.. .. ఏదేమైనా మనలో చాలా మంది బహుళ అంతస్తుల్లో నివాసానికి కారణాలివే. అలా అని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడంతోనే కోరిక తీరినట్టు కాదండోయ్. మీ ఇంటి అన్డివెడైడ్ షేర్ (యూడీఎస్) ఎంతనేది ముందే తెలుసుకోవాలి. అగ్రిమెంట్లో యూడీఎస్‌ను ప్రస్తావించారో లేదో పరిశీలించాలి కూడా. ఎందుకంటే మీ ఇంటి విలువను లెక్కించేది, ఇంటి విలువ పెరిగేది కూడా యూడీఎస్తోనే మరి!! - సాక్షి, హైదరాబాద్ ఫ్లాట్ కొనేముందు విస్తీర్ణం, వసతులు, లొకేషన్, వాస్తు వంటి వాటిపై శ్రద్ధ చూపినంతగా.. యూడీఎస్ మీద శ్రద్ధ చూపించరు కొనుగోలుదారులు. వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్ అనేది చాలా ముఖ్యమైంది. భూకంపాలు, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (లేదా) ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మీ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మీకిచ్చే పరిహారం యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అగ్రిమెంట్లో మీ ఇంటి యూడీఎస్ ఎంతనేది స్పష్టంగా ఉండాలన్నమాట. యూడీఎస్ అంటే.. అపార్ట్మెంట్లోని ఒక్కో ఫ్లాట్‌కు కేటాయించిన స్థలమే యూడీఎస్. అపార్ట్మెంట్ నిర్మించిన స్థలంలోని అవిభాజ్య వాటానే యూడీఎస్ అన్నమాట. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి యూడీఎస్ కూడా మారుతుంది. యూడీఎస్ అనేది ఫ్లాట్ యజమాని పేరు మీద రిజిస్టరై ఉంటుంది. అయితే కొన్ని నిర్మాణాల్లో భవనం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని బట్టి కూడా యూడీఎస్ మారుతుందండోయ్. ఎవరైనా.. ఎక్కడైనా సరే ఫ్లాట్ కొనుగోలు చేసేముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ప్రాజెక్ట్ మొత్తం స్థలం ఎంత? ఎంత భాగంలో భవనాన్ని నిర్మించారు? 2. ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్ విలువ పెరిగిందని అర్థం. అంతే తప్ప బిల్డింగ్ విలువ పెరిగిందని కాదు. అంటే ప్రాపర్టీ పెరుగుదల అనేది యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుం దన్నమాట. యూడీఎస్‌ను ఎలా లెక్కిస్తారు? యూడీఎస్ లెక్కింపు అనేది అపార్ట్మెంట్ సూపర్ బిల్టప్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియాలూ లెక్కలోకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2,400 చ.అ. స్థలంలో 4 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారనుకుందాం. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చ.అ.లనుకుందాం. ఇప్పుడీ నాలుగు ఫ్లాట్ల యూడీఎస్ ఎంతంటే? యూడీఎస్ = ఒక్కో ఫ్లాట్ సూపర్ బిల్టప్ ఏరియా/ అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియా 6 మొత్తం ల్యాండ్ ఏరియా యూడీఎస్ = 1,000 6 2,400/4,000 యూడీఎస్ = ఒక్కో ఫ్లాట్ యూడీఎస్ 800 చ.అ. కార్పెట్ ఏరియా ఫ్లాట్‌లోని గోడలున్న స్థలం కాకుం డా నికరంగా మనం ఉపయోగించే స్థలాన్ని కార్పెట్ ఏరియా అంటా రు. అంటే ఫ్లాట్‌లో కార్పెట్ పరిచి ఉండే స్థలమన్నమాట. బిల్టప్ ఏరియా ఫ్లాట్‌లోని గోడలున్న స్థలాన్ని కూడా కలిపి బిల్టప్ ఏరియా అంటారు. అంటే కార్పెట్ ఏరియా కంటే 10-15 శాతం స్థలం ఎక్కువుంటుందన్నమాట. సూపర్ బిల్టప్ ఏరియా లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్ హౌజ్ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని మొత్తం కలిపి సూపర్ బిల్టప్ ఏరియా అంటారు. ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు, న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
2 బీహెచ్‌కే నుంచి 3 వైపు!
♦ కస్టమర్లలో మారుతున్న ధోరణి ♦ 67 శాతం 3 బెడ్ నిర్మాణాలతో హైదరాబాద్ ముందంజ సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను కూడా ఎంపిక చేసి మరీ సాకారం చేసుకుంటున్నారు కొనుగోలుదారులు. అంటే ఒకప్పుడు రెండు పడక గదులు (2 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు.. ఇప్పుడు మూడు పడక గదులు (3 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మళ్లుతున్నారని దానర్థం. దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో క్వికర్‌హోమ్స్ ఓ సర్వే నిర్వహించింది. గతేడాది జనవరి-మార్చి (క్యూ1)తో పోల్చుకుంటే ఈ ఏడాది క్యూ1లో 6 నగరాల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా పెరిగాయని సర్వే పేర్కొంది. - సాక్షి, హైదరాబాద్ గతేడాది జనవరి నుంచి మార్చి మధ్య భాగ్యనగరంలోని మొత్తం నివాస సముదాయాల నిర్మాణంలో 47 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల సంఖ్య.. ఈ ఏడాది క్యూ1 వచ్చేసరికి 67 శాతానికి పెరిగింది. అలాగే ధరలోనూ ఏడాదిలో రూ.9 లక్షలు పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.92.2 లక్షలుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర.. ఈ ఏడాది కోటికి చేరింది. ♦ మిగిలిన 5 ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 20 శాతం 3 బీహెచ్‌కే నిర్మాణాలు పెరిగాయి. ఇందుకు కారణం.. 2015లో ఆఫీసు స్థలం అమ్మకం విక్రయించబటం, ఇతర మెట్రో నగరాలతో చూసుకుంటే ఇక్కడే స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటమే. ♦ సాధారణంగా నగరంలో గతేడాది 1,880 చ.అ.లుగా ఉండే 3 బీహెచ్‌కే విస్తీర్ణం... ఈ ఏడాది 1,990లకు పెరిగింది. ఆయా 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, నార్సిం గి, ముిషీరాబాద్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్నాయి. బెంగళూరు: గతేడాది 42 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు.. ఈ ఏడాది కేవలం 3 శాతం పెరుగుదలతో 45 శాతానికి పెరిగాయి. ♦ గతేడాది 3 బీహెచ్‌కే ధర రూ.86.4 లక్షలుంటే.. ఈ ఏడాది క్యూ1లో అది రూ.79.7 లక్షలకు పడిపోయింది. అంటే రూ.6.7 లక్షలు తగ్గింది. ♦ 3 బీహెచ్‌కే విస్తీర్ణం గతేడాది క్యూ1లో 1,630 చ.అ.లుంటే ఈ ఏడాది 1,530 చ.అ.లకు తగ్గింది. చెన్నై: 34 శాతంగా ఉన్న నిర్మాణాలు కాస్త మెరుగై ఈ ఏడాది క్యూ1లో 36 శాతానికి చేరాయి. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరల్లోనూ రూ.7 లక్షలు పెరిగాయి కూడా. గతేడాది క్యూ1లో రూ.90.4 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.97.2 లక్షలకు పెరిగాయి. ♦ విస్తీర్ణాలను చూస్తే.. గతేడాది 1,390 చ.అ.లున్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,310కి తగ్గింది. అంటే విస్తీర్ణం తగ్గినా.. ధర మాత్రం తగ్గకుండా పెరిగిందన్నమాట. ముంబై: ఆర్థిక రాజధానిలో 2015 తొలి మూడు నెలల్లో 14 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాదిలో 16 శాతానికి చేరాయి. ధర విషయంలో మాత్రం గణనీయంగా పడిపోయింది. ఏడాదిలో రూ.14.5 లక్షలు తక్కువైంది. గతేడాది క్యూలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర రూ.2.48 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది రూ.2.34 కోట్లకు పడిపోయింది. ♦ గతేడాది 1,508 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణం.. ఈ ఏడాది 1,417కు తగ్గింది. ఢిల్లీ-ఎన్సీఆర్: గతేడాది 36 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 48 శాతానికి పెరిగాయి. కానీ, ధర విషయంలో ఏడాదిలో రూ.18 లక్షలు తగ్గాయి. 2015 క్యూ1లో రూ.74 లక్షలున్న 3 బీహెచ్‌కే ధర.. 2016 క్యూ1లో రూ.56 లక్షలకు తగ్గాయి. ఫ్లాట్ విస్తీర్ణాలనూ తగ్గించారు. అంటే గతేడాది 1,750 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,450 చ.అ. తగ్గాయి. పుణె: గతేడాది మొత్తం నిర్మాణాల్లో 15 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 20 శాతానికి పెరిగాయి. అదేవిధంగా గతేడాది రూ.96 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.1.22 కోట్లకు చేరింది. ♦ ధరతో పాటూ 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణాలూ పెరిగాయి. అంటే గతేడాది 1,530 చ.అ.లుగా ఉన్న విస్తీర్ణం.. ఈ ఏడాది 1,716కు పెరిగాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రియల్టీ జోరు ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ రావటం, రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగవ్వటం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ పారిశ్రామికంగా వృద్ధి చెందటం, కేంద్రం నుంచి స్మార్ట్ సిటీలు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి కారణాలతో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం మెరుగైందని క్వికర్‌హోమ్స్ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో దేశంలో అత్యధిక నివాస లావాదేవీలు జరిగిన 6 ద్వితీయ శ్రేణి పట్టణాలను ఎంపిక చేసింది. విజయవాడ, లుధియానా, లక్నో, నాగ్‌పూ ర్, అహ్మదాబాద్, చంఢీఘర్లు ఈ జాబితాలో నిలి చాయని నివేదిక పేర్కొంది. అయితే ఆయా పట్టణాల్లో అపార్ట్మెంట్, విల్లాల వ్యాపారం కంటే ఓపెన్ ప్లాట్ల వ్యాపారమే ఎక్కువ శాతం జరిగిందని పేర్కొంది. ♦ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన వ్యాపార కేంద్రంగా నిలిచింది విజయవాడ. కొత్త రాజధాని అమరావతికి దగ్గర్లో ఉండటం, జాతీయ రహదారుల అభివృద్ధి, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, లక్ష చ.అ.ల్లో ఐటీ పార్క్‌ల ఏర్పాటు వంటివి బెజవాడ స్థిరాస్తి జోరుకు కారణాలు. మొత్తం స్థిరాస్తి వ్యాపారంలో 54 శాతం అపార్ట్మెంట్ల వ్యాపారం సాగుతుంటే.. 43 శాతం ఓపెన్ ప్లాట్లు, మిగిలిన 3 శాతం విల్లాల వ్యాపారం సాగుతున్నాయి. ♦ పంజాబ్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన లుధియానాలో 66 శాతం అపార్ట్మెంట్ లావాదేవీలు సాగుతుంటే.. 23 శాతం ప్లాట్స్, 10 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది. ♦ లక్నోలో 20 శాతం అపార్ట్మెంట్స్, 70 శాతం ప్లాట్లు, 10 శాతం విల్లాల లావాదేవీలు సాగుతున్నాయి. ♦ ముంబై, పుణే తర్వాత మహారాష్ట్రలో పెద్ద నగరమైన నాగ్‌పూర్‌లో 41 శాతం, 55 శాతం ప్లాట్స్, 4 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది. ♦ గుజరాత్‌లోని పెద్ద నగరం అహ్మదాబాద్. ఇక్కడ 63 శాతం అపార్ట్మెంట్స్, 22 శాతం ప్లాట్స్, 15 శాతం విల్లాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ♦ చండీఘడ్‌లో 63 శాతం అపార్ట్మెంట్లు, 30 శాతం ప్లాట్స్, 8 శాతం విల్లాల వ్యాపారం. -
ఇంటి నిర్మాణం.. ఆలస్యమైతే అమృతం హుళక్కి!
- పెరిగే ధరల భారాన్ని భరించక తప్పదు - జాప్యంతో పన్ను మినహాయింపుల్లోనూ కోత ఆలస్యం.. ఆలస్యం.. ఈ పదాన్ని నిత్యం వింటూనే ఉంటాం. అనుకోని కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆలస్యం వల్లలాభం కలిగితే, మరికొన్ని పనుల్లో ఆలస్యం వల్ల నష్టం తప్పదు. మరి ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే..? ఆ ఇంటి కొనుగోలుదారుడిపై ఈ జాప్యం ప్రభావం ఏ మేర ఉంటుంది? ఎందుకంటే ఇళ్ల నిర్మాణంలో ఇలాంటి జాప్యాలు కొత్త కాదు. కొనుగోలుదారులు వీటిని కూడా దృష్టిలో ఉంచుకోకతప్పదు. అవినాశ్ ఓ ప్రభుత్వోద్యోగి. 2011లో హైదరాబాద్ శివార్లలో ఒక ఇల్లు కొనాలనుకున్నాడు. కొందరు బిల్డర్లతో మాట్లాడాడు. వారిలో ఒక బిల్డర్ 2014 నాటికి (మూడేళ్ల కాలం) ఇంటిని కట్టిస్తామని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా... మూడే ళ్ల కాలం గడిచిపోయాక కూడా ఇల్లు పూర్తికాలేదు. ఇదేంటని బిల్డర్‌ను ప్రశ్నించాడు అవినాశ్. దీంతో అతనిచ్చిన అడ్వాన్సును తిరిగి ఇచ్చేశాడు బిల్డర్. హమ్మయ్య! అనుకున్నాడు అవినాష్. కానీ అతనికిక్కడ కనిపించని తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అవినాశ్ అడ్వాన్స్ ఇచ్చినపుడు ఆ ఫ్లాట్ ధర రూ.42 లక్షలు. కానీ మూడేళ్లు గడిచి అడ్వాన్సు వెనక్కి తీసుకునే నాటికి దాని ధర రూ.57 లక్షలకు పెరిగింది. అంటే ఇప్పుడు అవినాశ్ కొత్తగా ఇంటిని కొనాలంటే అదనంగా రూ.15 లక్షలు భరించాలి. నిజానికి ఈ పరిస్థితి ఒక్క అవినాశ్‌దే కాదు. చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బిల్డర్లు వారి డబ్బులను వెనక్కివ్వటం జరుగుతోంది. ఎందుకంటే పాత ధరలకిస్తే లాభాలు తగ్గుతాయని!!. ఈఎంఐలపై కూడా ఇదే నష్టం... ఒక వ్యక్తి ఇంటి కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద 9.7 శాతం వడ్డీరేటుతో 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అప్పుడు అతను చెల్లించే ఈఎంఐ నెలకు దాదాపుగా రూ.47,262గా ఉంటుంది. అనుకున్న సమయంలో అతను కొత్త ఇంట్లోకి చేరితే పర్వాలేదు. అలా జరగకపోతే.. అతను అప్పటికే నెలకు రూ.15,000-20,000 వరకు అద్దె చెల్లిస్తూ ఉంటాడు కదా... అప్పుడు అతను ఇటు ఈఎంఐ, అటు అద్దె చెల్లించటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు తలకిందులైపోతాయి కూడా. పన్ను ప్రయోజనాలూ పోతాయి... ఇంటిపై రుణం తీసుకున్న వారు అనుకున్న సమయానికి ఇల్లు పూర్తికాకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. సాధారణంగా ఇంటి రుణం తీసుకున్న వారు ఆ మొత్తంపై కొంత వరకు (సెక్షన్ 80సీ ప్రకారం... ఏడాదికి రూ.1.5 లక్షల వరకు) పన్ను తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. అలాగే వడ్డీ రూపంలో మొత్తంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం ముగిశాక... మూడేళ్ల లోపు ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటేనే. ఇలాకాని పక్షంలో వడ్డీ మొత్తంలో రూ.30,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇంటి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత క్లెయిమ్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుంచి... ఐదు ఈఎంఐలలో పొందాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక భారాన్ని భరించాలి లేదా నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయించాలి. చేసేదేమీ లేక చాలా మంది నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయిస్తున్నారు. ‘ఢిల్లీ వంటి పట్టణాల్లో డబ్బు రికవరీ కోసం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి’. అని నైట్ ఫ్రాంక్ ఇండియా రెసిడెన్షియల్ ఏజెన్సీ నేషనల్ డెరైక్టర్ ముదసిర్ జైదీ తెలిపారు. ‘భవిష్యత్తులో నిర్మాణ పనుల్లో జాప్యాల వల్ల తలెత్తే సమస్యలు, నష్టాల నుంచి రక్షణ లభించే విధంగా డెవలపర్లు ఒక ఒప్పందాన్ని రూపొందించాలి’ అని యాస్పైర్ హోమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ అనిల్ సచిదానంద్ పేర్కొన్నారు. -
రా.. రమ్మంటున్న రాయితీలు
- ధర తక్కువుంటే సరిపోదు.. అభివృద్ధికి ఆస్కారముండాలి - సాఫ్ట్ లాంచ్ ఆఫర్లు లాభాసాటేనంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో ఒక్కో సంస్థది ఒక్కో తీరు. కొన్ని సంస్థలు ఏదో ఒక బహుమతిని ప్రకటిస్తే.. ఇంకొన్ని ప్రత్యేక రాయితీని అందజేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు 50 లేదా 100 మంది కస్టమర్లకు రుసుములు తగ్గిస్తామంటే.. ఇంకొన్నేమో వారం రోజుల్లో తీసుకుంటే ధరలో పాతిక శాతం రాయితీ అంటూ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల నిర్మాణ రంగంలో పుట్టుకొచ్చిన కొత్త ట్రెండే సాఫ్ట్ లాంచ్ ఆఫర్లు. ఇనాగ్రల్ ఆఫర్, లాంచింగ్ ఆఫర్.. పేరు ఏదైనప్పటికీ వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఈ ఆఫర్లు లాభసాటే అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. నిజంగా లాభమేనా.. ముందే కొటే లాభమేమిటి? అన్న సందేహం చాలామందికి కలగొచ్చు. ప్రాజెక్టు మొదలయ్యాక కొనడం కంటే ముందు తీసుకుంటే తక్కువ రేటుకొస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ చదరపు అడుగుకి రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ ‘సాఫ్ట్ లాంచ్’లో చదరపు అడుగుకి రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుంది. నిన్నటి ధర నేడుండదు.. నేటి ధర రేపుండదు.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ తీరు ఇదే. మన నిర్మాణ రంగం ప్రత్యేకత ఇదే. నగరంలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధికి ఢోకా ఉండదు. ‘ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ని చూసిన వారెవ్వరైనా ఇప్పుడు నగరాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఐదేళ్లలో ఇంత మార్పులు చోటుచేసుకున్నాయా అని అనిపిస్తుంది. అదే ఉత్తరాది నగరాల్ని పరిశీలించండి. పదిహేనేళ్ల క్రితం అక్కడి మౌలిక సదుపాయాలు ఎలాగుండేవో ప్రస్తుతమూ అదే విధంగా ఉన్నాయి. మన నగరానికి.. కొన్ని ఇతర నగరాలకు గల తేడా ఇదే’ గత కొన్నేళ్లుగా వివిధ నగరాల్లో ఉద్యోగం చేసి నగరంలో స్థిరపడ్డ ఒక నిపుణుడి అభిప్రాయమిది. ఇక్కడి అభివృద్ధిని గమనించే వారంతా సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల వైపు దృష్టి పెట్టి.. చౌక ధరలో ఫ్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. మన ఇష్ట ప్రకారమే.. వెంచర్ ఏదైనా మీరు మొదట కొనుగోలు చేస్తే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద కంపెనీ మీకిస్తుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ నచ్చకపోతే మార్పులు చేయమంటే విసుక్కోకుండా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. వీరికీ లాభమే.. కేవలం కొనుగోలుదారులకే కాదు.. బిల్డర్లకు, నిర్మాణ సంస్థలకూ ఈ విధానం ద్వారా ప్రయోజనం ఉంది. అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ‘సాఫ్ట్ లాంచ్’ అమ్మకాల్ని కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటాయి. అయితే ఇదంతా బిల్డర్‌కు కానీ, నిర్మాణ సంస్థలకు కానీ మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధార పడి ఉంటుంది. నిర్ణయం మంచిదే.. సాఫ్ట్ లాంచ్‌లో కొనేటప్పుడు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. అవసరమైతే న్యాయవాదులు, నిపుణుల సలహా తీసుకోవాలి. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోండి. మీరు కొనబోయే వెంచర్ ఎక్కడుంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశమెంత? వంటి అంశాల్ని గమనించండి. చుట్టుపక్కల ఏమైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయా అన్న విషయానికి పెద్దపీట వేయాలి. - ఇంటికి అందం, ఆకర్షణ తెచ్చేది రంగులే. మారుతున్న అభిరుచులు, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇప్పుడు చాలా మంది త్రీడీ లేదా థిక్ కలర్లనే ఇష్టపడుతున్నారు. వీటిలో దాదాపు 3,800 రకాల రంగులు లభ్యమతున్నాయి. ఒకే రంగు లేత, ముదురు షేడ్లలో లభ్యమవుతోంది. ఒకే రంగు ఒక కోణంలో ఒక విధంగా, ఇంకో కోణంలో ఇంకో విధంగా ఇలా త్రీడీ రంగులున్నాయి. భవనాలకు వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని నిపుణులు మాట. -
నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!
‘పైన పటారం..లోన లోటారం’ అనే నానుడి భాగ్యనగరంలోని చాలా ప్రాజెక్ట్‌లకు వర్తిస్తుంది. బ్రోచర్‌ను అందంగా డిజైన్ చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే బిల్డర్లు చాలా మందే ఉన్నారు. నచ్చిన ఫ్లాటు కనబడితే చాలు.. డెవలపర్ పూర్వాపరాలను చూడకుండానే నిర్ధారిత సొమ్మును కట్టి బోలెడుమంది ఫ్లాట్లను కొంటుంటారు. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేవనో.. అమ్మకాలు కావటం లేదనో.. నిర్మాణ పనులు నిలిచిపోతే నష్టపోయేది కొనుగోలుదారుడే. అందుకే నమూనా చూసి ఫ్లాట్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడితే బోల్తా పడినట్టే కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు కానీ అమ్మకాల సమయంలోకానీ కొనుగోలుదారులతో బిల్డర్లు, మార్కెటింగ్ సిబ్బంది ఆత్మీయంగా మాట్లాడతారు. నిర్ధారిత సొమ్మును చెల్లిస్తే రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిస్తామని నమ్మబలుకుతారు. గడువులోగా ఫ్లాట్ తాళాలు అందించకపోతే బ్యాంక్ వడ్డీ కొనుగోలుదారుల మీదే పడుతుంది. ఒకపక్క బ్యాంక్ వడ్డీ, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. సరిగ్గా ఈ సమయంలో ఫ్లాట్లను అమ్మిన వ్యక్తితో మాట్లాడదామంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకడు. సంస్థలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నించినా ఫలితముండదు. ప్రాజెక్టు ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని కొందరు బిల్డర్లు ఒప్పందాల్లో పేర్కొంటారు. కాకపోతే ఈ పరిహారం కొనుగోలుదారులకు ఏమాత్రం చాలదు. ఉదాహరణకు ఫ్లాట్ ఆలస్యమైతే చ.అ.కు రూ.5 చొప్పున పరిహారం ఇస్తామంటారు. అయితే కొనుగోలుదారులు కట్టే నెలసరి వాయిదాలతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు. సమయానికి అందించినా.. గడువు లోగా ఫ్లాట్లను పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు. ఈ జాబితాలో చిన్న బిల్డర్లే కాదు పెద్ద సంస్థలూ ఉన్నాయి. ఏలియెన్స్, హిల్‌కౌంటీ, ప్రజయ్ వంటివే ఇందుకు ఉదాహరణలు. ఏదైనా సంస్థ నిర్ణీత గడువులోపే ఇళ్లను అందించినా.. నిర్మాణ లోపాలు స్వాగతం పలుకుతుంటాయి. శ్లాబులు, బాత్రూముల నుంచి నీరు కారడాలు, తలుపులు సరిగ్గా పట్టకపోవడం, ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా వేయడం, బయటి ప్రాంతాలు, గోడలకు రంగులు సరిగ్గా వేయకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. నిర్మాణ లోపాలు లేకుండా బిల్డర్లు ఫ్లాట్లు అందించగానే అంతా సవ ్యంగా ఉందని భావించరాదు. నిజానికి గృహప్రవేశం చేశాకే అసలైన సమస్యలు పుట్టుకొస్తాయి. అధిక శాతం మంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. 2006లో జీవో నెం. 86 అమల్లోకి వచ్చాక నిర్మాణం కట్టే ప్రతి బిల్డరూ ఈ పత్రం తప్పక తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్మాణం అక్రమ కట్టడంగా పరిగణిస్తారు. పత్రాలు పక్కాగా.. లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందువల్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి. వసతులూ ప్లాన్‌లో.. కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగ సుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ ఆ ఇల్లును ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు సొమ్ము చెల్లించక తప్పదు. నాణ్యత లేకుంటే చిక్కులే.. నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది. ♦ ఇంటికి వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. సున్నితమైన మనస్సు ఉన్న వారు లేత రంగులు, ప్రేమ పిపాసులు గులాబీ రంగు, సంపద కోరుకునే వారు బంగారు వర్ణం, ఆహ్లాదం కోరుకునే వారు లావెండర్ వంటి రంగులు ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. గొప్పదనాన్ని చెప్పాలనుకునే వారు ముదురు రంగులు ఎంచుకుంటారని నిపుణుల మాట. ♦ ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడమూ ఓ కళే. టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. లేకపోతే ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే అందవికారంగా కనిపిస్తుంది. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గత పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి realty@sakshi.com -
రియల్ వేషాలిక చెల్లవు!
‘మోసపూరిత బిల్డర్ల నుంచి కొనుగోలుదారుల్ని రక్షించేందుకు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి కోసం ప్రత్యేక స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకొస్తాం’ ఇది ప్రభుత్వ ప్రకటన. ‘స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి వస్తే నిర్మాణ రంగానికి మేలు కంటే కీడే ఎక్కువ. ఈ బిల్లుతో అవినీతికి ఆస్కారం ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది’ ఇది నిర్మాణ రంగంలోని నిపుణుల ఆవేదన. ‘ప్రకటనలతో ఆకర్షించి, నిర్మాణ పనుల్ని సాగదీస్తూ, సమయానికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న బిల్డర్లు, డెవలపర్లకు గుణపాఠం చెప్పాలంటే స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి రావాల్సిందే’ ఇది కొనుగోలుదారులు అభిప్రాయం. కొనుగోలుదారుల చేతికి బ్రహ్మాస్త్రం.. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు స్థిరాస్తి రంగంలో మోసాలకు కళ్లెం అవకతవకలకు పాల్పడితే జైలు శిక్ష.. గుర్తింపు రద్దు కూడా సాక్షి, హైదరాబాద్: తప్పుడు ప్రకటనలతో కొనుగోలుదారులను మోసం చేసే రియల్టర్ల వేషాలిక సాగవు. భారత నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చి, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రూపొందించిన ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2013’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు స్థిరాస్తి నిపుణులెవరిని కదిలించినా ఇదే చర్చ. అసలు స్థిరాస్తి నియంత్రణ బిల్లు అంటే ఏంటి? దీంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? వంటి అనేక విషయాలపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం. రెండు నెలల్లోగా రిజిస్టర్.. స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి వచ్చాక రెండు నెలల్లోగా బిల్డర్లు, ఏజెంట్లు, ప్రమోటర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక ్చరల్ ఇంజనీర్లు తమ పేర్లను, చిరునామాలను నమోదు చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ లే-అవుట్, అభివృద్ధి గడువు, భూమి స్థితి, చట్టపరమైన ఆమోదాల పరిస్థితి ఇలా స్థిరాస్తికి సంబంధించిన ప్రతి ఒక్కటీ నియంత్రణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలి. పొందిన అనుమతులన్నింటినీ బిల్డర్లు తమ వెబ్సైట్లో ప్రదర్శించాలి. ఫ్లాట్లను సూపర్ బిల్టప్ ఏరియా ప్రాతిపదికన కాకుండా కార్పెట్ ఏరియా ప్రాతిపదికన విక్రయించాలి. ప్రస్తుత ప్రాజెక్ట్‌లూ బిల్లు పరిధిలోకే.. కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లే కాదు స్వీయ అవసరాల కోసం కట్టే ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణం పూర్తయి ఇంకా ధ్రువీకరణ పత్రాలు రాని ప్రాజెక్ట్‌లూ ఈ బిల్లు పరిధిలోకే వస్తాయి. వెయ్యి చ.మీ. లేదా కనీసం 30 ఫ్లాట్లుంటే ప్రతి ప్రాజెక్ట్ బిల్లు పరిధిలోకే వస్తుంది. నిర్మాణం చేపట్టబోయే ప్రాజెక్ట్ ఎంతకాలంలో పూర్తవుతుందో ముందుగానే వెల్లడించాలి. 50 శాతం సొమ్ము ఎస్క్రో ఖాతాలో.. బిల్డర్ ప్రారంభించే ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. ఆ ప్రాజెక్ట్ కోసం సమకూర్చే నిధులను వాటి కోసమే ఖర్చు చేయాలి. కొనుగోలుదారుల నుంచి స్వీకరించిన సొమ్ములో కనీసం 50 శాతం సొమ్మును డెవలపర్లు ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఒక ప్రాజెక్ట్‌లోని కొనుగోలుదారుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్లను, స్ట్రక్చరల్ డిజైన్లను మార్చడానికి వీల్లేదు. తప్పు చేస్తే జైలు శిక్షే.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమాచారం తప్పుగా ఇచ్చినట్లయితే 5 శాతం జరిమానా. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లయితే నిర్మాణ సంస్థ గుర్తింపును రద్దు చేసే అధికారం నియంత్రణ సంస్థకు ఉంటుంది. ప్రాజెక్ట్‌ను నమోదు చేయించుకోకపోతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం సొమ్మును జరిమానా చెల్లించాలి. అప్పటికీ నిబంధనలను పాటించకపోతే మరో 10 శాతం జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. రెండూ విధించవచ్చు కూడా. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.. స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో బిల్డర్లకు, బిల్డర్లతో కొనుగోలుదారులకూ ఎలాంటి సమస్యలెదురైనా సవాల్ చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. వేగవంత పరిష్కారం కోసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయ నిర్ణయాధికారులను నియమిస్తారు. వారి నిర్ణయాన్ని, నియంత్రణ సంస్థల నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసుకోవచ్చు.తుది విజ్ఞప్తులను హైకోర్టులో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేస్తారు. లేదా రెండు రాష్ట్రాలకు కలిపి ఒక సంస్థను లేదా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తారు. స్థిరాస్తి నిపుణులేమంటున్నారంటే.. స్థిరాస్తి నియంత్రణ బిల్లు దేశీయ నిర్మాణ రంగానికి వ్యతిరేకంగా ఉంది. బడా బిల్డర్లు మాత్రమే తట్టుకొని నిలబడగలుగుతారు. ధరలను అమాంతం పెంచేస్తారు. దీంతో సామాన్యుని సొంతింటి కల మరింత దూరమవుతుంది. ⇒ నిర్మాణాలకు అనుమతులనిచ్చే సంస్థలను నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకురాలేదు. అధిక శాతం నిర్మాణాలు ఆలస్యం జరిగేది ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఆలస్యం చేయడం వల్లే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణంలో ఆలస్యమైతే కేవలం బిల్డర్లు, డెవలపర్లకు జైలు శిక్ష విధించడం సరైంది కాదు. ⇒ స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో చిన్న, మధ్య తరహా బిల్డర్లు నిలదొక్కుకోలేరు. కొనుగోలుదారులు చెల్లించే 50 శాతం సొమ్మును బ్యాంకులో జమ చేయాలనడం సరికాదు. దీంతో నగదు నిల్వల్లేక ఆయా బిల్డర్లు వ్యాపారాన్ని విస్తరించలేరు. స్థిరాస్తి నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయి అధికారాల్ని కల్పించడం వల్ల మళ్లీ లెసైన్సుల రాజ్యం మొదలవుతుంది. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి... realty@sakshi.com -
స్థిర నివాసానికైతే పూర్తయినవే బెటర్
గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా? కొనుగోలుదారుల్లో ఇదే తర్జనభర్జన. బయట చూస్తేనేమో పండగ వాతావరణం. కానీ, మూడు నెలలుగా మార్కెట్ పరిస్థితులేమో వెనుకడుగు వేయిస్తున్నాయి. సొంతిల్లు కొనాలన్న కోరిక గట్టిగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయలేనివారిలో మీరూ ఉన్నారా? పండగ సమయంలో ఇలాంటి వారికున్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ మాట్లాడింది. వారి సూచనల సమాహారమే ఈ కథనం.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకున్నప్పటికీ కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం. మరోసారి నిర్మాణ సామాగ్రి కష్టాలు. ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు. ఇలా రకరకాల సమస్యలతో హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఇబ్బందిపడుతోంది. దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతుండగా... కొందరు బిల్డర్లు మాత్రం కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. రెండు మూడేళ్లుగా ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువవుతోంది. * గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోస్తే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూడటం తప్ప ఏమీ చేయలేం. అందుకని పది, పదిహేను నిర్మాణాలు చూసి, ప్రతి అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంచుకున్నాకే సొమ్ము చెల్లించాలి. స్థిర నివాసమా? స్థిర నివాసం కోసమైతే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లో కొంటేనే బెటర్. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువ. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు కూడా. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. డిసెంబర్‌లోగా నగరంలో పూర్తి కానున్న కొన్ని ప్రాజెక్టులివిగో... * బొల్లారంలో ఆర్క్ హోమ్స్. ఖాళీల సంఖ్య: 70. ధర చ.అ.: రూ. 2,049. * మేడిపల్లిలో హరే రాం రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 20. ధర రూ. 26 లక్షలు * పీఅండ్ టీ కాలనీలో మాధవ రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 5. ధర రూ. 25.50 లక్షలు * ఉప్పల్‌లో మేఘన రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 20. ధర రూ. 32.50 లక్షలు * మూసాపేటలో రెయిన్బో విస్టాస్. ఖాళీలు:25. ధర 2 బీెహ చ్‌కే-రూ. 50లక్షలు, 3 బీహెచ్‌కే-రూ. 65 లక్షలు * గచ్చిబౌలిలో ఆర్వీ శిల్పహిల్ టాప్. ఖాళీల సంఖ్య: 12. ధర చ.అ. రూ. 4,000 * సుచిత్ర సర్కిల్లో ఆర్వీ ఆద్విక్. ఖాళీల సంఖ్య: ‘అముక్త’ బ్లాక్‌లో 21. ధర చ.అ. రూ. 2,400 * అల్మాస్‌గూడలో శ్రీ శ్రీ హోమ్స్. ఖాళీల సంఖ్య: 15. ధర రూ. 25- 30 లక్షలు * పద్మారావ్‌నగర్‌లో హార్మోనీ హైట్స్. ఖాళీల సంఖ్య: 15. ధర చ.అ. రూ. 3,750 * బోయిన్‌పల్లిలో శాటిలైట్ టౌన్షిప్. ఖాళీల సంఖ్య: 15. ధర చ.అ. రూ. 2,500 * మోతీనగర్‌లో జనప్రియ మెట్రోపొలిస్. ఖాళీలు 50. ధర చ.అ.రూ. 3,220 పెట్టుబడి కోణమా..? పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కానీ మొదట స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. నిర్మాణ పనులు మొదలైన, ఆరంభ దశలో ఉన్న ఇళ్ల ధరలు గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటికంటే కనీసం 20 నుంచి 25 శాతం తక్కువకు వస్తాయన్న విషయం గమనించాలి. హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొన్ని.. బండ్లగూడలో 40 ఎకరాల్లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ‘ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఫేజ్-1లో భాగంగా 5 ఎకరాల్లో 14 అంతస్తుల్లో, రెండు బ్లాకుల్లో మొత్తం 407 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. చదరపు అడుగు ధర రూ. 3 వేలుగా నిర్ణయించారు. 24 నెలల్లో తొలి దశను పూర్తి చేస్తామని సంస్థ సీఎండీ ఎస్ రాంరెడ్డి చెప్పారు. 500 చ.అ. సింగిల్ బెడ్ రూమ్ నుంచి 2,050 చ.అ. విస్తీర్ణం గల త్రిబుల్ బెడ్ రూమ్ వరకు ఫ్లాట్లుంటాయి. సింగిల్‌బెడ్ ఫ్లాట్ ధర రూ.15 లక్షల లోపు ఉంటుంది. 2, 3 ఫేజ్‌ల్లో ఎక్కువ ఫ్లాట్లు మధ్యతరగతి ప్రజల కోసమే కేటాయిస్తున్నారు. విజయదశమి రోజున ఏవీ కన్స్ట్రక్షన్స్ మేడిపల్లి హైవే రోడ్డుపై రెండున్నర ఎకరాల్లో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం 210 ఫ్లాట్ల వచ్చే ఈ ప్రాజెక్ట్‌లో చ.అ. ధర రూ. 2,500లుగా నిర్ణయించామని సంస్థ ఎండీ జే. వెంకట్‌రెడ్డి చెప్పారు.