
న్యూఢిల్లీ: ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేసేవారికి(బల్క్ బయ్యర్స్, బిగ్ రీటెయిలర్స్, ప్రాసెసర్స్) రైతులు, సహకార సంస్థల నుంచి ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్రం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల పాటు వారికి ఆ అవకాశం కల్పించాలని కోరింది. తద్వారా వ్యవసాయ మార్కెట్లపై భారం తగ్గుతుందని, అలాగే, వినియోగదారుడికి తగినంత స్థాయిలో ఉత్పత్తులు లభిస్తాయని సూచించింది. అలాగే, వేర్‌హౌజింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టరైన గోదాములను ‘ఈ నామ్’ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు వీలైన మార్కెట్లుగా ప్రకటించాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ బుధవారం లేఖ రాశారు.
అంబేడ్కర్ జయంతిన సెలవు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14ను కేంద్రం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాలు మూతపడనున్నాయి.