
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్‌లైన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో 2021 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని నివేదిక పేర్కొంది. దేశీ కరెన్సీ రూపాయి మారకం విలువపై ఒత్తిడి, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరుగుతున్నప్పటికీ.. 2021–2026 మధ్య భారత రిటైల్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 7.8% మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం 32% వార్షిక వృద్ధి సాధిస్తున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ మరికొన్నాళ్ల పాటు మరింత అధిక వృద్ధి నమోదు చేయనుందని నివేదిక తెలిపింది.
మారుతున్న కొనుగోలుదారుల ధోరణులు..
ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్‌లో కొనుగోలు జరిపేవారి సంఖ్య పెరుగుతుండటం, వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతుండటం తదితర అంశాలు ఈ–కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. అటు ఎం–కామర్స్ (మొబైల్ ద్వారా కొనుగోళ్లు) కూడా భారీగా పెరుగుతోందని వివరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లుగా ఉన్న ఎం–కామర్స్ లావాదేవీల పరిమాణం 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,00,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, మారుతున్న షాపింగ్ ధోరణులు, స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో వృద్ధి వంటివి ఆన్‌లైన్ అమ్మకాల పెరుగుదలకు తోడ్ప డ్డాయి. ఇక, ప్రథమ..ద్వితీయ..తృతీయ శ్రేణి మార్కెట్స్‌లో మిలీనియల్స్ (1980–1996 మధ్య పుట్టినవారు) ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆహారం, దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీలు మొదలైన వాటి కొనుగోళ్లు అత్యధికం.
సోషల్ కామర్స్ ప్రభావం...
ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోందని నివేదిక పేర్కొంది. 28% మిలీనియల్స్.. సోషల్ మీడియా సిఫార్సుల మేరకు కొనుగోళ్లు జరపగా, 63% మిలీనియల్స్ తమకిష్టమైన బ్రాండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దేశీ ఈ–కామర్స్ రంగంలో కన్సాలిడేషన్ కూడా పెరుగుతోందని, 2017, 2018లో విలీన... కొనుగోళ్ల డీల్స్ 25 శాతం మేర పెరగడమే నిదర్శనమని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment