
గత ఏడాది రూ.1,83,01,500 కోట్ల వ్యయం
యూఎస్, చైనా, జర్మనీని మించిన వృద్ధి
వచ్చే ఏడాది మూడవ స్థానానికి భారత్ ∙డెలాయిట్–ఆర్‌ఏఐ తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: వస్తు సేవల కోసం 2013లో భారతీయులు వెచ్చించిన మొత్తం రూ.87,15,000 కోట్లు. 2024లో ఇది రెట్టింపై రూ.1,83,01,500 కోట్లకు చేరుకుందని డెలాయిట్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం 7.2 శాతం వార్షిక వృద్ధితో దూసుకెళ్లిందని, అమెరికా, చైనా, జర్మనీ కంటే భారత్ వేగంగా ఉందని తెలిపింది. భారత్‌లో కస్టమర్ల విచక్షణా వ్యయంపై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ నివేదికను రూపొందించింది.
2026 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరించే దిశగా జనాభాపర లాభాలను పొందేందుకు భారత్ మంచి స్థితిలో ఉందని వివరించింది. వ్యవస్థీకృత రిటైల్, అనుభవ ఆధారిత వినియోగం పెరుగుదల.. వెరశి వినియోగాన్ని పెంచడంలో సహాయపడిందని తెలిపింది. వ్యవస్థీకృత రిటైల్ వేగంగా విస్తరిస్తోంది. ఏటా 10 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. ఇది 2030 నాటికి రూ.20,04,450 కోట్లకు చేరుకుంటుందని అంచనా అని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..
పెరగనున్న సంపాదనపరులు..
2030 నాటికి సంవత్సరానికి రూ.8,71,500 కంటే ఎక్కువ సంపాదించే భారతీయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు దూసుకెళ్లి 16.5 కోట్లకు చేరుతుందని అంచనా. 2024లో ఈ సంఖ్య 6 కోట్లు. ఇది దేశంలోని మధ్యతరగతి వర్గాల వృద్ధిని, విచక్షణా వ్యయం వైపు ప్రాథమిక మార్పును ప్రతిబింబిస్తుంది. పెరుగుతున్న సంపదతో వినియోగదారులు ధర కంటే నాణ్యత, సౌలభ్యం, అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రీమియమైజేషన్, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతోసహా అనేక కీలక శక్తులు వినియోగంలో దూకుడును నడిపిస్తున్నాయి. ఫిన్‌టెక్ సొల్యూషన్స్, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు వినియోగదారులు బ్రాండ్లతో ఎలా నిమగ్నమవ్వాలో పునరి్నర్మిస్తున్నాయి. ఈ–కామర్స్ స్వీకరణను పెంచుతున్నాయి. డిజిటల్ వినియోగానికి ఆజ్యం పోస్తున్నాయి.
జెన్ జడ్, మిలీనియల్స్..
జనాభాలో 52 శాతం ఉన్న జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఈ మార్పును నడిపిస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లు, స్థిర ఉత్పత్తులు, వ్యక్తిగతీకరించిన అనుభవాల కోసం డిమాండ్‌ను పెంచుతున్నాయి. ‘భారత వినియోగదారుల వ్యవస్థ ప్రాథమిక పరివర్తనకు లోనవుతోంది. విచక్షణతో కూడిన వ్యయాల పెరుగుదల, డిజిటల్ వాణిజ్యాన్ని విస్తరించడం, అందుబాటులో రుణాలు.. వెరశి బ్రాండ్లు తమ నియమాలను పునరి్నర్వచించుకుంటున్నాయి’ అని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్, కంజ్యూమర్ ఇండస్ట్రీ లీడర్ ఆనంద్ రామనాథన్ అన్నారు. ‘2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం రూ.3,48,600 దాటుతుందని అంచనా. ఇది వివిధ రంగాలలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. వ్యాపారాలు వినియోగదారుల అంచనాలను అందిపుచ్చుకోవడానికి అద్భుత అవకాశాన్ని కలిగి ఉన్నాయి. అందుబాటు ధర, సౌలభ్యం, స్థిరత్వాన్ని సమతుల్యం చేయడం ద్వారా సమాచారం, సాంకేతికతను ఉపయోగించుకుని అత్యంత వ్యక్తిగతీకరించిన అనుభవాలను సృష్టిస్తాయి’ అని
వివరించారు.
వృద్ధి దశలోకి ప్రవేశం..
పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ స్వీకరణ, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల ద్వారా భారత్‌లో విచక్షణా వ్యయం కొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. ‘వ్యవస్థీకృత రిటైల్, నూతన వాణిజ్య నమూనాలు విస్తరిస్తున్న కొద్దీ ఈ ధోరణులకు అనుగుణంగా ఉండే వ్యాపారాలు వృద్ధి, ఆవిష్కరణలకు అపార అవకాశాలను తెరుస్తాయి. డిజిటల్, ఆర్థిక సమ్మిళిత వృద్ధి దేశంలో ఖర్చులను పెంచుతోంది. రుణ లభ్యత అపూర్వ వేగంతో విస్తరిస్తోంది. క్రెడిట్ కార్డుల సంఖ్య గత ఏడాది దేశవ్యాప్తంగా 10.2 కోట్లు ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 29.6 కోట్లకు దూసుకెళుతుందని అంచనా. దీనివల్ల వినియోగదారులు చేస్తున్న ఖర్చులు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment