అందుబాటుకే ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆటస్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. ధర అందుబాటులో ఉంటే చాలు. ఇంటి విస్తీర్ణం తక్కువైనా.. నిర్మాణం నాణ్యంగా ఉంటే కొనడానికి సిద్ధమని కొనుగోలుదారులు అంటున్నారు. తమను దృష్టిలో పెట్టుకుని ఇళ్లను నిర్మించాలని కోరుతున్నారు. మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం ఇళ్లకు శ్రీకారం చుట్టాయి.
⇔ ఇప్పటిదాకా భారత స్థిరాస్తి సంస్థలు ప్రభుత్వ బ్యాంకులకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డాయి. కొంతమంది వద్ద యాభై శాతం ఫ్లాట్లు కూడా అమ్ముడవ్వలేదు. అమ్మకాల్లేక కుంగిపోవటం కంటే అందుబాటు ఇళ్లను నిర్మిస్తే నగదు లభ్యతకు ఇబ్బంది ఉండదనేవారు లేకపోలేదు. ఇందుకోసం పలు సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి.
⇔ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. జోరుగా నిర్మాణ పనులూ జరుగుతున్నాయి.
⇔ ఖరీదైన ఇళ్లను కొనేవారు నేటికీ ఉన్నారు. కాకపోతే వీరికంటే ఎక్కువగా అందుబాటు ధరల్లో ఇళ్లను కొనేవారెక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి బిల్డర్లు, డెవలపర్లు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల్ని మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
⇔ కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారి సంఖ్య తక్కువ. కేపీహెచ్‌బీ, కొండాపూర్, హైదర్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.25–30 లక్షల్లోపు కొనాలని భావించే కొనుగోలుదారులున్నారు. కానీ, ఈ ధరకు అమ్మే బిల్డర్ల సంఖ్య నామమాత్రమేనని చెప్పొచ్చు.
⇔ అమ్మకాల విషయంలో ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో పలు సంస్థలు వెయ్యి నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి.