బంగారం.. మరింత పెరిగే అవకాశం! | Will Gold Rates Increase in The Coming Days | Sakshi
Sakshi News home page

బంగారం.. మరింత పెరిగే అవకాశం!

Jan 31 2025 6:46 AM | Updated on Jan 31 2025 10:25 AM

Will Gold Rates Increase in The Coming Days

అంతర్జాతీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లో 2,852 డాలర్లకు అప్‌

దేశీయంగా మరింత పెరిగే అవకాశం

న్యూఢిల్లీ: యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం, 2024 నాలుగో త్రైమాసికంలో అమెరికా జీడీపీ నెమ్మదించిందన్న పరిణామాల నేపథ్యంలో పసిడి ఆల్‌టైమ్‌ రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఏప్రిల్‌ కాంట్రాక్టుకు సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) ధర ఒక దశలో ఏకంగా 2,852 డాలర్లకు ఎగిసింది. ఈ నేపథ్యంలో 2025లో 3,290 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బుధవారం అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా పసిడి రేట్లకు ఆజ్యం పోసినట్లు తెలిపాయి. తాజా పరిణామంతో దేశీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం మరింత పెరగవచ్చని పేర్కొన్నాయి.

మరోవైపు,  ఢిల్లీలో గురువారమూ పసిడి కొత్త జీవితకాల గరిష్టాలను తాకింది. 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.83,800కు చేరింది. బుధవారం 10 గ్రా. రూ.910 లాభపడి రూ.83,750 వద్ద ముగియడం తెలిసిందే. 99.5 స్వచ్ఛత బంగారం సైతం రూ.50 పెరిగి రూ.83,400కు చేరింది. మరోవైపు వెండికి సైతం డిమాండ్‌ పెరిగింది.

కొనుగోళ్ల మద్దతుతో కిలోకి ఏకంగా రూ.1,150 పెరిగి రూ.94,150కి చేరింది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ బంగారం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్‌ నెల కాంట్రాక్టుల ధర రూ.541 పెరిగి రూ.81,145కు చేరింది. బడ్జెట్లో దిగుమతి సుంకాలు పెంచొచ్చన్న అంచనాలతో బంగారం సానుకూలంగా ట్రేడ్‌ అవుతోందని నిపుణులు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement