Real Estate: Home, Plot Sales Down As Buyers Wait And Watch Mode In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ట్రెండ్‌ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు!

Published Sat, Dec 3 2022 4:03 PM | Last Updated on Sat, Dec 3 2022 5:11 PM

Real Estate: Home, Plot Sales Down As Buyers Wait And Watch Mode In Hyderabad - Sakshi

మార్కెట్‌ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ చేసే పని! ఇదే సూత్రం రియల్‌ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసొస్తుంది. మార్కెట్‌ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్‌ బయ్యర్‌ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే! స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు కండీషన్స్‌ అప్లై ఎలాగైతే ఉంటుందో అలాగే స్థిరాస్తి రంగానికీ ఉంటుంది. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే డెవలపర్‌ ట్రాక్‌ రికార్డ్, ఆర్థ్ధిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్‌ ప్లాట్, అపార్ట్‌మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్‌ చేయాలని బిల్డర్‌ నిర్ణయించుకుంటాడు. ఇలాంటి పరిస్థితులలో కొత్త డెవలపర్‌ ల్యాండ్‌ కొని, ప్రాజెక్ట్‌ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా.. గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్‌ గ్రూప్‌ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తుంది. ఇందులో ధర చ.అ.కు రూ.5,500లకు విక్రయిస్తుంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్‌ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు. 

రేపటి అవసరాన్ని బట్టే కొనాలి.. 
ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమం అని చాలా మంది సలహా ఇస్తుంటారు కానీ ఒడిదుడుకుల మార్కెట్‌లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్‌ ట్రాక్‌ రికార్డ్, ఆర్థ్ధిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. పైగా విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని బట్టి గృహాలను కొనుగోలు చేయాలి. చాలా మంది ప్రస్తుతం ఆర్జించే ఆదాయానికి పరిమితమై కొనుగోలు నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు, పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈరోజు 2 బీహెచ్‌కే కొనే చోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. 

ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. ఉత్తమ గృహ కొనుగోలుదారులు చేసేదిదే. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వీటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలలో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్‌ డెస్టినేషన్‌. ఎందుకంటే 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ దుండిగల్‌ ఎగ్జిట్‌ కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలకు, ప్రాంతాలతో దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ఏరియాలకు కనెక్టివిటీ పెరిగింది. 

కనెక్టివిటీ మెరుగైంది 
కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, నేడు పరిస్థితి మారింది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్‌ఆర్, లింక్‌ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్‌మెంట్‌ లేదా విల్లా కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపిస్తున్నారు.
– నరేంద్ర కుమార్‌ కామరాజు, ఎండీ, ప్రణీత్‌ గ్రూప్‌

చదవండి: NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు భారీ ఊరట..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement