2 బీహెచ్కే నుంచి 3 వైపు! | 2bhk to focus on 3bhk | Sakshi
Sakshi News home page

2 బీహెచ్కే నుంచి 3 వైపు!

Published Sat, May 21 2016 4:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

2 బీహెచ్కే నుంచి 3 వైపు!

2 బీహెచ్కే నుంచి 3 వైపు!

కస్టమర్లలో మారుతున్న ధోరణి  
67 శాతం 3 బెడ్ నిర్మాణాలతో హైదరాబాద్ ముందంజ

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను కూడా ఎంపిక చేసి మరీ సాకారం చేసుకుంటున్నారు కొనుగోలుదారులు. అంటే ఒకప్పుడు రెండు పడక గదులు (2 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు.. ఇప్పుడు మూడు పడక గదులు (3 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మళ్లుతున్నారని దానర్థం. దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణెల్లో క్వికర్‌హోమ్స్ ఓ సర్వే నిర్వహించింది. గతేడాది జనవరి-మార్చి (క్యూ1)తో పోల్చుకుంటే ఈ ఏడాది క్యూ1లో 6 నగరాల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా పెరిగాయని సర్వే పేర్కొంది.   - సాక్షి, హైదరాబాద్

గతేడాది జనవరి నుంచి మార్చి మధ్య భాగ్యనగరంలోని మొత్తం నివాస సముదాయాల నిర్మాణంలో 47 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల సంఖ్య.. ఈ ఏడాది క్యూ1 వచ్చేసరికి 67 శాతానికి పెరిగింది. అలాగే ధరలోనూ ఏడాదిలో రూ.9 లక్షలు పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.92.2 లక్షలుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర.. ఈ ఏడాది కోటికి చేరింది.

 మిగిలిన 5 ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 20 శాతం 3 బీహెచ్‌కే నిర్మాణాలు పెరిగాయి. ఇందుకు కారణం.. 2015లో ఆఫీసు స్థలం అమ్మకం విక్రయించబటం, ఇతర మెట్రో నగరాలతో చూసుకుంటే ఇక్కడే స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటమే.

 సాధారణంగా నగరంలో గతేడాది 1,880 చ.అ.లుగా ఉండే 3 బీహెచ్‌కే విస్తీర్ణం... ఈ ఏడాది 1,990లకు పెరిగింది. ఆయా 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, నార్సిం గి, ముిషీరాబాద్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్నాయి.

 బెంగళూరు: గతేడాది 42 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు.. ఈ ఏడాది కేవలం 3 శాతం పెరుగుదలతో 45 శాతానికి పెరిగాయి.

 గతేడాది 3 బీహెచ్‌కే ధర రూ.86.4 లక్షలుంటే.. ఈ ఏడాది క్యూ1లో అది రూ.79.7 లక్షలకు పడిపోయింది. అంటే రూ.6.7 లక్షలు తగ్గింది.

 3 బీహెచ్‌కే విస్తీర్ణం గతేడాది క్యూ1లో 1,630 చ.అ.లుంటే ఈ ఏడాది 1,530 చ.అ.లకు తగ్గింది.

 చెన్నై: 34 శాతంగా ఉన్న నిర్మాణాలు కాస్త మెరుగై ఈ ఏడాది క్యూ1లో 36 శాతానికి చేరాయి. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరల్లోనూ రూ.7 లక్షలు పెరిగాయి కూడా. గతేడాది క్యూ1లో రూ.90.4 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.97.2 లక్షలకు పెరిగాయి.

 విస్తీర్ణాలను చూస్తే.. గతేడాది 1,390 చ.అ.లున్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,310కి తగ్గింది. అంటే విస్తీర్ణం తగ్గినా.. ధర మాత్రం తగ్గకుండా పెరిగిందన్నమాట.

 ముంబై: ఆర్థిక రాజధానిలో 2015 తొలి మూడు నెలల్లో 14 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాదిలో 16 శాతానికి చేరాయి. ధర విషయంలో మాత్రం గణనీయంగా పడిపోయింది. ఏడాదిలో రూ.14.5 లక్షలు తక్కువైంది. గతేడాది క్యూలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర రూ.2.48 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది రూ.2.34 కోట్లకు పడిపోయింది.

 గతేడాది 1,508 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణం.. ఈ ఏడాది 1,417కు తగ్గింది.

 ఢిల్లీ-ఎన్‌సీఆర్: గతేడాది 36 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 48 శాతానికి పెరిగాయి. కానీ, ధర విషయంలో ఏడాదిలో రూ.18 లక్షలు తగ్గాయి. 2015 క్యూ1లో రూ.74 లక్షలున్న 3 బీహెచ్‌కే ధర.. 2016 క్యూ1లో రూ.56 లక్షలకు తగ్గాయి. ఫ్లాట్ విస్తీర్ణాలనూ తగ్గించారు. అంటే గతేడాది 1,750 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,450 చ.అ. తగ్గాయి.

 పుణె: గతేడాది మొత్తం నిర్మాణాల్లో  15 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 20 శాతానికి పెరిగాయి. అదేవిధంగా గతేడాది రూ.96 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.1.22 కోట్లకు చేరింది.

 ధరతో పాటూ 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణాలూ పెరిగాయి. అంటే గతేడాది 1,530 చ.అ.లుగా ఉన్న విస్తీర్ణం.. ఈ ఏడాది 1,716కు పెరిగాయి.

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రియల్టీ జోరు
ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ రావటం, రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగవ్వటం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ పారిశ్రామికంగా వృద్ధి చెందటం, కేంద్రం నుంచి స్మార్ట్ సిటీలు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి కారణాలతో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం మెరుగైందని క్వికర్‌హోమ్స్ నివేదిక చెబుతోంది.

ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో దేశంలో అత్యధిక నివాస లావాదేవీలు జరిగిన 6 ద్వితీయ శ్రేణి పట్టణాలను ఎంపిక చేసింది. విజయవాడ, లుధియానా, లక్నో, నాగ్‌పూ ర్, అహ్మదాబాద్, చంఢీఘర్‌లు ఈ జాబితాలో నిలి చాయని నివేదిక పేర్కొంది. అయితే ఆయా పట్టణాల్లో అపార్ట్‌మెంట్, విల్లాల వ్యాపారం కంటే ఓపెన్ ప్లాట్ల వ్యాపారమే ఎక్కువ శాతం జరిగిందని పేర్కొంది.

 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన వ్యాపార కేంద్రంగా నిలిచింది విజయవాడ.  కొత్త రాజధాని అమరావతికి దగ్గర్లో ఉండటం, జాతీయ రహదారుల అభివృద్ధి, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, లక్ష చ.అ.ల్లో ఐటీ పార్క్‌ల ఏర్పాటు వంటివి బెజవాడ స్థిరాస్తి జోరుకు కారణాలు. మొత్తం స్థిరాస్తి వ్యాపారంలో 54 శాతం అపార్ట్‌మెంట్ల వ్యాపారం సాగుతుంటే.. 43 శాతం ఓపెన్ ప్లాట్లు, మిగిలిన 3 శాతం విల్లాల వ్యాపారం సాగుతున్నాయి.

పంజాబ్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన లుధియానాలో 66 శాతం అపార్ట్‌మెంట్ లావాదేవీలు సాగుతుంటే.. 23 శాతం ప్లాట్స్, 10 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది.
లక్నోలో 20 శాతం అపార్ట్‌మెంట్స్, 70 శాతం ప్లాట్లు, 10 శాతం విల్లాల లావాదేవీలు సాగుతున్నాయి.
ముంబై, పుణే తర్వాత మహారాష్ట్రలో పెద్ద నగరమైన నాగ్‌పూర్‌లో 41 శాతం, 55 శాతం ప్లాట్స్, 4 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది.
గుజరాత్‌లోని పెద్ద నగరం అహ్మదాబాద్. ఇక్కడ 63 శాతం అపార్ట్‌మెంట్స్, 22 శాతం ప్లాట్స్, 15 శాతం విల్లాల కార్యకలాపాలు సాగుతున్నాయి.
చండీఘడ్‌లో 63 శాతం అపార్ట్‌మెంట్లు, 30 శాతం ప్లాట్స్, 8 శాతం విల్లాల వ్యాపారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement