అదనపు రుణానికి రూట్‌.. టాపప్‌ హోమ్‌లోన్‌! | Explanation Of Top-Up Home Loan About Sakshi Special Story | Sakshi
Sakshi News home page

అదనపు రుణానికి రూట్‌.. టాపప్‌ హోమ్‌లోన్‌!

Published Mon, Sep 2 2024 1:24 AM | Last Updated on Mon, Sep 2 2024 8:55 AM

Explanation Of Top-Up Home Loan About Sakshi Special Story

వేగంగా, డిజిటల్‌గా మంజూరు

ఎలాంటి పత్రాలు అవసరం లేదు

వడ్డీ రేటు ఇతర రుణాల కంటే తక్కువ

అన్నీ ఆలోచించాకే నిర్ణయం

ముఖ్య అవసరాలకే పరిమితం కావాలి  

సొంతిల్లు.. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఒకటి. రుణంపై సొంతిల్లు సమకూర్చుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలా గృహ రుణం తీసుకున్న తర్వాతి కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం అదనపు రుణం తీసుకునే అవకాశం ఉంటే..? గృహ నవీకరణ లేదా విద్యా సంబంధిత ఫీజుల చెల్లింపు లేదా అనారోగ్యం.. అవసరం ఏదైనా గృహ రుణంపై టాపప్‌ రుణం సులభంగా లభిస్తుంది. 

కాకపోతే ఈ విధంగా తీసుకుంటున్న రుణం ఏ అవసరాలకు వినియోగిస్తున్నారనేది ఇంత వరకు బ్యాంక్‌లు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలే ఆర్‌బీఐ ఈ విషయమై బ్యాంక్‌లను హెచ్చరించింది. కనుక టాపప్‌ హోమ్‌లోన్‌ను ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనేది రుణ గ్రహీతలు సైతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. చౌకగా లభించే ఈ రుణాన్ని ముఖ్యమైన అవసరాల్లో వినియోగించుకోవడం ద్వారా తగినంత ప్రయోజనం పొందొచ్చు.  

టాపప్‌ అంటే... 
అప్పటికే తీసుకున్న గృహ రుణంపై అదనపు రుణాన్ని తీసుకోవడమే టాపప్‌ హోమ్‌లోన్‌ అవుతుంది. దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ తరహా రుణాలను ఆఫర్‌ చేస్తుంటాయి. ఇంటి విలువ ఎంత? ఇంటికి తీసుకున్న రుణానికి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నారు? అప్పటి వరకు ఎంత మేర చెల్లించారు? తదితర అంశాల ఆధారంగా ఈ రుణానికి అర్హత లభిస్తుంది. ఇది సెక్యూర్డ్‌ లోన్‌ కిందకే వస్తుంది. కనుక బ్యాంక్‌లకు వీటిపై రిస్క్‌ తక్కువే. అయితే రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ రుణంపై బ్యాంకింగ్‌ నిర్ణయం తీసుకుంటుంది.

ఎలా పనిచేస్తాయి? 
‘‘గృహ రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ.. 18–24 నెలలు గడిచిన తర్వాత టాపప్‌ లోన్‌ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది’’ అని విష్‌ఫిన్‌ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. వాస్తవంగా జారీ అయిన గృహ రుణం నుంచి అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి పోను మిగిలిన మొత్తం టాపప్‌గా లభిస్తుంది. అంటే అప్పటి వరకు తీర్చిన రుణం మొత్తమే తిరిగి రుణంగా తీసుకోవచ్చు. 

ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్‌ హోమ్‌లోన్‌కు అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి.

 రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు టాపప్‌ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్‌ చేస్తున్నట్టు పైసాబజార్‌ హోమ్‌ లోన్స్‌ హెడ్‌ రతన్‌ చౌదరి తెలిపారు. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందొచ్చని చౌదరి సూచించారు.  

సులభతరం 
టాపప్‌ హోమ్‌లోన్‌ను చాలా సంస్థలు డిజిటల్‌గా మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా రుణం చేతికి అందుతుంది. అప్పటికే గృహ రుణం కోసం అన్ని పత్రాలు 
సమరి్పంచి ఉంటారు కనుక.. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం ఏర్పడదు. అన్ని పత్రాలు దగ్గర ఉండడంతో బ్యాంక్‌లు వేగంగా నిర్ణయం తీసుకుంటాయి. రుణ గ్రహీత తాజా క్రెడిట్‌ రిపోర్ట్‌ను తప్పకుండా పరిశీలిస్తాయి.  

చౌక ఆప్షన్‌ 
అన్ని రుణాల్లోకి గృహ రుణం చౌక వడ్డీ రేటుకే లభిస్తుంది. గృహ రుణంపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటే.. టాపప్‌కి సైతం అమలవుతుంది. పర్సనల్‌ లోన్, క్రెడిట్‌కార్డుపై రుణం, బంగారంపై రుణం కంటే టాపప్‌ హోమ్‌లోన్‌ చౌక అని పైసాబజార్‌ రతన్‌ చౌదరి తెలిపారు. ఒకవేళ అప్పటికే క్రెడిట్‌ కార్డ్‌పై రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని, అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంటే.. అటువంటి వారు సైతం టాపప్‌ హోమ్‌లోన్‌ తీసుకుని వాటిని తీర్చివేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్, క్రెడిట్‌ కార్డు రుణాలు అన్‌ సెక్యూర్డ్‌ కిందకు వస్తాయి. అందుకే వాటిపై వడ్డీ రేటు ఎక్కువ. గృహ రుణం సెక్యూర్డ్‌ (ఇల్లు తనఖాపై) కనుక వడ్డీ రేటు తక్కువ.  

అవసరం మేరకే..  
సులభంగా, చౌకగా వస్తుందని చెప్పి టాపప్‌ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపించే ముందు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన చేయడం ఎంతో అవసరం. టాపప్‌ రుణాలతో వచ్చే పెద్ద సమస్య నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగిపోవడమేనని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ (ఆర్‌ఐఏ), సహజ్‌ మనీ వ్యవస్థాపకులు అభిషేక్‌ కుమార్‌ తెలిపారు.

 టాపప్‌ హోమ్‌ రుణాలు అనుత్పాదక అవసరాలకు వినియోగం అవుతుండడంపై ఆర్‌బీఐ ఇటీవలే బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలను అప్రమత్తం చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరింది. ముఖ్యంగా ఈ తరహా రుణాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. లోన్‌–టు–వేల్యూ రేషియో (ప్రాపర్టీ విలువపై జారీ చేసే రుణం మొత్తం/ఎల్‌టీవీ), రిస్క్‌లు, రుణ నిధుల వినియోగంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఈ తరహా రుణాలు స్పెక్యులేటివ్‌ అవసరాలకు తీసుకోవడం లేదని బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీని నమ్మించాల్సి రావచ్చు.

 ఇలా తీసుకున్న నిధులను ట్రేడింగ్‌లో నష్టపోయి, తిరిగి చెల్లింపులు చేయలేకపోతే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంక్‌ ఇంటిని జప్తు చేస్తుందన్నది మర్చిపోవద్దు. ‘‘టాపప్‌ హోమ్‌ లోన్స్‌ అన్నవి సాధారణంగా గృహ నవీకరణ కోసమే. పిల్లల విద్య లేదా వైద్య వ్యయాలు వంటి ఇతర అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రుణం తీసుకునే సమయంలోనే దీనిపై బ్యాంక్‌లు నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి’’ అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి వివరించారు. అయితే ఈ రుణాన్ని స్పెక్యులేటివ్‌ అవసరాలకు వినియోగించరాదని సూచించారు. ఇదే విషయం రుణ ఒప్పంద నిబంధనల్లోనూ స్పష్టంగా ఉంటుంది.

రుణం రాకపోతే..? 
చాలా సంస్థలు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ సమయంలో (గృహ రుణం బదిలీ) టాపప్‌ రుణాలు ఆఫర్‌ చేస్తున్నట్టు పైసాబజార్‌ చౌదరి తెలిపారు. ఇంటి రుణం ఇచి్చన సంస్థ దగ్గర టాపప్‌ హోమ్‌ లోన్‌ పొందలేకపోతే.. లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్టు అయితే.. అప్పుడు మిగిలి ఉన్న గృహ రుణాన్ని (బ్యాలెన్స్‌) మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ద్వారా టాపప్‌ హోమ్‌లోన్‌ను పొందొచ్చని చౌదరి సూచించారు.  

ఇవి గమనించాలి.. 
→ విహార యాత్ర, ఖరీదైన వస్తు కొనుగోళ్ల కోసం టాపప్‌ హోమ్‌లోన్‌ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. తమ ఆస్తి విలువ పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చు. 
→ టాపప్‌ హోమ్‌ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధికి (రెండు నుంచి నాలుగేళ్లు) పరిమితం చేసుకోవాలి. దీర్ఘకాలం ఎంపిక చేసుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. 
→ గృహ రుణం, దానిపై టాపప్‌తో కలిపి అసలు ఇంటి విలువలో 75 శాతం మించకుండా చూసుకోవడం సౌకర్యం. 
→ ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్‌ చార్జీలను చాలా సంస్థలు వసూలు చేస్తున్నాయి. 
→ బ్యాంక్‌తో సంప్రదింపులు చేయడం ద్వారా వీలైతే వడ్డీ రేటులో రాయితీ పొందొచ్చు.  
→ టాపప్‌ హోమ్‌లోన్‌ను ఖరీదైన ఇతర రుణాల చెల్లింపులకు వినియోగించుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement