పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్‌గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది.
ఇది ఎలా పనిచేస్తుంది..?
రివర్స్ మార్ట్‌గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్‌గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్‌గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్‌గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్‌లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్‌టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్‌గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్‌గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి.
చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
రుణాన్ని చెల్లించక్కర్లేదు..
వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్‌గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్‌గా రివర్స్ మార్ట్‌గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్‌ను బ్యాంక్‌లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు.
చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు!
రెండు రకాల చెల్లింపులు...
రివర్స్ మార్ట్‌గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్‌లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్‌గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్‌టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
ఎప్పుడైనా చెల్లించొచ్చు..
రివర్స్ మార్ట్‌గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్‌కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్‌కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు.
రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్‌గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్‌గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్‌గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్‌బీఐ రివర్స్ మార్ట్‌గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది.
విలువ మదింపు..
రివర్స్ మార్ట్‌గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్‌లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్‌గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్‌ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్‌లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్‌లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్‌గేజ్ రుణానికి ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్.
సమర్పించాల్సినవి ఇవీ..
రివర్స్ మార్ట్‌గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్‌మెంట్
సమర్పించాల్సి ఉంటుంది.
చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు!
ఎందుకు ఆదరణ లేదు..?
రివర్స్ మార్ట్‌గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్‌సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్‌గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే.
నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్ అక్కడ మొదలైంది!
వీటిని దృష్టిలో పెట్టుకోవాలి
►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్‌గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది.
► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు.
►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి.
►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి.
► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్‌గేజ్ చేసుకోవచ్చు.
► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు.
► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్‌గేజ్‌కు అవకాశం లేదు.
►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు.
► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్‌టీ చార్జీలను చెల్లించాలి.
►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు.
► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్‌లు మదింపు వేస్తాయి.
►రివర్స్ మార్ట్‌గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి.
►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి.
చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
Comments
Please login to add a commentAdd a comment