additional loans
-
అదనపు రుణానికి రూట్.. టాపప్ హోమ్‌లోన్!
సొంతిల్లు.. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఒకటి. రుణంపై సొంతిల్లు సమకూర్చుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలా గృహ రుణం తీసుకున్న తర్వాతి కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం అదనపు రుణం తీసుకునే అవకాశం ఉంటే..? గృహ నవీకరణ లేదా విద్యా సంబంధిత ఫీజుల చెల్లింపు లేదా అనారోగ్యం.. అవసరం ఏదైనా గృహ రుణంపై టాపప్ రుణం సులభంగా లభిస్తుంది. కాకపోతే ఈ విధంగా తీసుకుంటున్న రుణం ఏ అవసరాలకు వినియోగిస్తున్నారనేది ఇంత వరకు బ్యాంక్‌లు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలే ఆర్బీఐ ఈ విషయమై బ్యాంక్‌లను హెచ్చరించింది. కనుక టాపప్ హోమ్‌లోన్‌ను ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనేది రుణ గ్రహీతలు సైతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. చౌకగా లభించే ఈ రుణాన్ని ముఖ్యమైన అవసరాల్లో వినియోగించుకోవడం ద్వారా తగినంత ప్రయోజనం పొందొచ్చు. టాపప్ అంటే... అప్పటికే తీసుకున్న గృహ రుణంపై అదనపు రుణాన్ని తీసుకోవడమే టాపప్ హోమ్‌లోన్ అవుతుంది. దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇంటి విలువ ఎంత? ఇంటికి తీసుకున్న రుణానికి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నారు? అప్పటి వరకు ఎంత మేర చెల్లించారు? తదితర అంశాల ఆధారంగా ఈ రుణానికి అర్హత లభిస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కిందకే వస్తుంది. కనుక బ్యాంక్‌లకు వీటిపై రిస్క్ తక్కువే. అయితే రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ రుణంపై బ్యాంకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.ఎలా పనిచేస్తాయి? ‘‘గృహ రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ.. 18–24 నెలలు గడిచిన తర్వాత టాపప్ లోన్ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది’’ అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. వాస్తవంగా జారీ అయిన గృహ రుణం నుంచి అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి పోను మిగిలిన మొత్తం టాపప్‌గా లభిస్తుంది. అంటే అప్పటి వరకు తీర్చిన రుణం మొత్తమే తిరిగి రుణంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్ హోమ్‌లోన్‌కు అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి. రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు టాపప్ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ హోమ్ లోన్స్ హెడ్ రతన్ చౌదరి తెలిపారు. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందొచ్చని చౌదరి సూచించారు. సులభతరం టాపప్ హోమ్‌లోన్‌ను చాలా సంస్థలు డిజిటల్‌గా మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా రుణం చేతికి అందుతుంది. అప్పటికే గృహ రుణం కోసం అన్ని పత్రాలు సమరి్పంచి ఉంటారు కనుక.. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం ఏర్పడదు. అన్ని పత్రాలు దగ్గర ఉండడంతో బ్యాంక్‌లు వేగంగా నిర్ణయం తీసుకుంటాయి. రుణ గ్రహీత తాజా క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పకుండా పరిశీలిస్తాయి. చౌక ఆప్షన్ అన్ని రుణాల్లోకి గృహ రుణం చౌక వడ్డీ రేటుకే లభిస్తుంది. గృహ రుణంపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటే.. టాపప్కి సైతం అమలవుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్‌కార్డుపై రుణం, బంగారంపై రుణం కంటే టాపప్ హోమ్‌లోన్ చౌక అని పైసాబజార్ రతన్ చౌదరి తెలిపారు. ఒకవేళ అప్పటికే క్రెడిట్ కార్డ్‌పై రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని, అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంటే.. అటువంటి వారు సైతం టాపప్ హోమ్‌లోన్ తీసుకుని వాటిని తీర్చివేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్, క్రెడిట్ కార్డు రుణాలు అన్ సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకే వాటిపై వడ్డీ రేటు ఎక్కువ. గృహ రుణం సెక్యూర్డ్ (ఇల్లు తనఖాపై) కనుక వడ్డీ రేటు తక్కువ. అవసరం మేరకే.. సులభంగా, చౌకగా వస్తుందని చెప్పి టాపప్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపించే ముందు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన చేయడం ఎంతో అవసరం. టాపప్ రుణాలతో వచ్చే పెద్ద సమస్య నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగిపోవడమేనని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (ఆర్ఐఏ), సహజ్ మనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ తెలిపారు. టాపప్ హోమ్ రుణాలు అనుత్పాదక అవసరాలకు వినియోగం అవుతుండడంపై ఆర్బీఐ ఇటీవలే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరింది. ముఖ్యంగా ఈ తరహా రుణాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. లోన్–టు–వేల్యూ రేషియో (ప్రాపర్టీ విలువపై జారీ చేసే రుణం మొత్తం/ఎల్టీవీ), రిస్క్‌లు, రుణ నిధుల వినియోగంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఈ తరహా రుణాలు స్పెక్యులేటివ్ అవసరాలకు తీసుకోవడం లేదని బ్యాంక్/ఎన్బీఎఫ్సీని నమ్మించాల్సి రావచ్చు. ఇలా తీసుకున్న నిధులను ట్రేడింగ్‌లో నష్టపోయి, తిరిగి చెల్లింపులు చేయలేకపోతే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంక్ ఇంటిని జప్తు చేస్తుందన్నది మర్చిపోవద్దు. ‘‘టాపప్ హోమ్ లోన్స్ అన్నవి సాధారణంగా గృహ నవీకరణ కోసమే. పిల్లల విద్య లేదా వైద్య వ్యయాలు వంటి ఇతర అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రుణం తీసుకునే సమయంలోనే దీనిపై బ్యాంక్‌లు నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అయితే ఈ రుణాన్ని స్పెక్యులేటివ్ అవసరాలకు వినియోగించరాదని సూచించారు. ఇదే విషయం రుణ ఒప్పంద నిబంధనల్లోనూ స్పష్టంగా ఉంటుంది.రుణం రాకపోతే..? చాలా సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో (గృహ రుణం బదిలీ) టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ చౌదరి తెలిపారు. ఇంటి రుణం ఇచి్చన సంస్థ దగ్గర టాపప్ హోమ్ లోన్ పొందలేకపోతే.. లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్టు అయితే.. అప్పుడు మిగిలి ఉన్న గృహ రుణాన్ని (బ్యాలెన్స్) మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ద్వారా టాపప్ హోమ్‌లోన్‌ను పొందొచ్చని చౌదరి సూచించారు. ఇవి గమనించాలి.. → విహార యాత్ర, ఖరీదైన వస్తు కొనుగోళ్ల కోసం టాపప్ హోమ్‌లోన్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. తమ ఆస్తి విలువ పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చు. → టాపప్ హోమ్ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధికి (రెండు నుంచి నాలుగేళ్లు) పరిమితం చేసుకోవాలి. దీర్ఘకాలం ఎంపిక చేసుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. → గృహ రుణం, దానిపై టాపప్‌తో కలిపి అసలు ఇంటి విలువలో 75 శాతం మించకుండా చూసుకోవడం సౌకర్యం. → ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను చాలా సంస్థలు వసూలు చేస్తున్నాయి. → బ్యాంక్‌తో సంప్రదింపులు చేయడం ద్వారా వీలైతే వడ్డీ రేటులో రాయితీ పొందొచ్చు. → టాపప్ హోమ్‌లోన్‌ను ఖరీదైన ఇతర రుణాల చెల్లింపులకు వినియోగించుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మరో 2 బిలియన్ డాలర్లు.. రిలయన్స్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 16,400 కోట్లు) సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశీ కరెన్సీలో తక్కువ వడ్డీ రేట్లకు ఈ నిధులను సమీకరించే యోచనలో కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ఈ రెండు సంస్థలు ఇటీవలే 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 24,600 కోట్లు) మొత్తాన్ని సిండికేట్ లోన్ ద్వారా సమీకరించాయి. రెండు డజన్ల తైవాన్ బ్యాంకులతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ తదితర 55 దిగ్గజ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఆ ఒప్పందాల ప్రాతిపదికనే కొత్తగా 2 బిలియన్ డాలర్లను రిలయన్స్, జియో సమీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) -
హెచ్‌డీఎఫ్‌సీకి ఐఎఫ్‌సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్‌సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్‌సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
ఏపీకి అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏపీ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 15 శాతం టార్గెట్ పూర్తి చేసింది. ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్డీపీలో నాలుగు శాతం నికర రుణాల పరిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇవీ చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు -
నాలుగు శ్లాబులుగా జీఎస్టీ!
6, 12, 18, 26 శాతంగా పన్ను రేట్లు • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీ ప్రతిపాదన, నేడు తుది నిర్ణయం • నిత్యావసరాలపై తక్కువ, విలాస వస్తువులపై అధికం • విలాస వస్తువులు, పొగాకుపై అదనపు సెస్ వసూలు • రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు ప్రతిపాదనలకు అంగీకారం • పరిహారం కోసం సెస్సు ఆదాయంతో రూ. 50 వేల కోట్ల నిధి సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జఎస్టీ) రేట్లపై ఎట్టకేలకు ముందడుగు పడింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు పన్ను శ్లాబుల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 6, 12, 18, 26 శాతంగా రేట్లను వర్గీకరిస్తూ పన్ను వసూలు చేయాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో బుధవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిత్యావసర వస్తువులపై తక్కువ రేటు, విలాస వస్తువులపై అధిక పన్ను రేటు విధించాలని ప్రతిపాదనల్లో సూచించారు. ప్రతిపాదన సారాంశం.. ‘ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని... పన్ను నుంచి ఆహార పదార్థాల్ని మినహాయించాలి. అలాగే దాదాపు 50 శాతం నిత్యావసర వస్తువుల్ని పన్ను నుంచి మినహాయించడం కానీ తక్కువ రేటు విధించడం కానీ చేయాలి. 70 శాతం వస్తువులపై పన్ను రేటు 18 శాతం కంటే తక్కువ ఉండాలి. విలాసవంతమైన కార్లు, పొగాకు, సిగరెట్లు, శీతల పానియాలు, కాలుష్యకారక వస్తువులపై అదనపు సెస్ విధించాలి. బంగారంపై మాత్రం 4 శాతం రేటు ఉండాలి. ఎఫ్ఎంసీజీ (త్వరగా ఖర్చయ్యే వస్తువులు, ఉదా: సబ్బులు), కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులు(గృహోపకరణాలు, కార్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు)పై 26 శాతం పన్ను విధించాలి’ అని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిపై 31 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. నేడు పన్ను రేట్లపై తుది నిర్ణయం విజ్ఞాన్‌భవన్‌లో మూడు రోజులు జరిగే ఈ సమావేశాల్లో బుధవారం తుది పన్ను రేట్లపై ఒక నిర్ణయానికి రానున్నారు. మంగళవారం భేటీలో ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిం చాలి? రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే పరిహారం ఎలా చెల్లించాలి? అన్న అంశాలపై చర్చించా రు. పన్ను ఆదాయం వృద్ధి రేటు 14 శాతం ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రాలకు వస్తున్న పన్ను ఆదాయంపై 14 శాతం అదనపు ఆదాయం జీఎస్టీ అమలుతో రాకపోతే, తగ్గిన మొత్తాన్ని కేంద్రం పరిహారంగా చెల్లిస్తుంది. ఈ ప్రతిపాదన కు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ... ఆదాయం లెక్కింపునకు 2015-16ను ఆధార సంవత్సరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. ‘గత ఐదేళ్ల ఆదాయాన్ని లెక్కించేందుకు 14 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్రాలు ఇంతకంటే తక్కువ ఆదాయం పొందితే... కేంద్రం పరిహారమిస్తుంది. విలాస వస్తువులు, పొగాకువంటి పదార్థాలపై విధించే సెస్‌తో రూ. 50 వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం’ అని జైట్లీ పేర్కొన్నారు. సేవలపై మూడు శ్లాబులే.. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... సేవలపై పన్ను 6, 12, 18 శాతంగా మాత్రమే ఉంటుందని, గరిష్టంగా 18 శాతం విధిస్తారన్నారు. తుది నిర్ణయం తీసుకోలేదు: యనమల శ్లాబులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బుధవారం చర్చ కొనసాగుతుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. పేదలపై భారం ఉండరాదు: ఈటెల సామాన్యులకు భారం కాకుండా పన్ను విధానం ఉండాలని మొదటి నుంచి తెలంగాణ కోరుతోందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమావేశం అనంతరం అరుణ్ జైట్లీని కలిసి వెనకబడిన జిల్లాలకు రెండో విడత నిధులు రూ. 400 కోట్లు ఇవ్వాలని కోరారు.