
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి.
75 శాతానికి రెడీ
ఐఎఫ్‌సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్‌సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం!