international finance
-
హెచ్‌డీఎఫ్‌సీకి ఐఎఫ్‌సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్‌సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్‌సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
ఆర్థికమంత్రితో ఐఎఫ్‌సీ ఎండీ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్‌లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్‌కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్‌లో ఐఎఫ్‌సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్‌సీ భావిస్తోంది. తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్‌సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్‌ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు. -
ఫెడరల్ బ్యాంక్‌లో ఐఎఫ్‌సీకి 5 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) సుమారు అయిదు శాతం వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం రూ. 916 కోట్లు వెచ్చింది. దీంతో ఫెడరల్ బ్యాంక్‌లో ఐఎఫ్‌సీ కీలక వాటాదారుగా మారింది. షేరు ఒక్కింటికి రూ. 87.39 రేటు చొప్పున ఐఎఫ్‌సీ, ఐఎఫ్‌సీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రోత్ ఫండ్, ఎల్పీ (ఎఫ్ఐజీ), ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఏషియా ఫండ్, ఎల్పీ (ఈఏఎఫ్)లకు 10.48 కోట్ల షేర్లను (4.99 శాతం వాటా) కేటాయించే ప్రతిపాదనకు ఫెడరల్ బ్యాంక్ బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసింది. తాజాగా సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులతో (ఈఎస్జీ) పాటు ఇతరత్రా కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. గ్రీన్హౌస్ గ్యాస్ (జీహెచ్జీ) ఉద్గారాలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి జీహెచ్జీ ఉద్గారాలను తగ్గించుకోవడానికి భారత్‌కు గణనీయంగా పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి పర్యావరణ అనుకూల పెట్టుబడులకు సంబంధించి భారత్‌లో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నాయని ఐఎఫ్‌సీ అంచనా వేస్తోంది. -
మందగమనాన్ని సంస్కరణలతో ఎదుర్కొంటాం
► బాధ్యతాయుత ఆర్థిక ► ప్రణాళికలతో అధిగమిస్తాం ► కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దావోస్: సంస్కరణలను కొనసాగించడం, బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికలతో అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావాలను భారత్ఎదుర్కొనగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. 2001, 2008 ఆ తర్వాత 2015లోనూ అంతర్జాతీయంగా మందగమనం .. సంక్షోభం తలెత్తిన తరుణంలో భారత ఎకానమీ ధీటుగా ఎదురునిల్చిందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ ఈ విషయాలు తెలిపారు. ప్రపంచ ఎకానమీ తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతుండటంపై సదస్సుకు హాజరైన అగ్రనేతల్లో ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. పలు అంశాలు అంతర్జాతీయ అనిశ్చితికి దారితీశాయని, దీంతో పెట్టుబడుల సరళి సర్దుబాటుకు లోనవుతోందని జైట్లీ పేర్కొన్నారు. పలు మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని, ఇన్వెస్టర్లు రిస్కుకు దూరంగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు. 100 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ మార్పులు...: డబ్ల్యూఈఎఫ్ డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఇటు సమాజం, అటు పరిశ్రమలో పెను మార్పులు రానున్నాయని, వచ్చే పదేళ్లలో ఈ విలువ దాదాపు 100 లక్షల కోట్ల (100 ట్రిలియన్) డాలర్ల మేర ఉండనుందని డబ్ల్యూఈఎఫ్ ఒక నివేదికలో వెల్లడించింది. మొబైల్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్లు తదితర డిజిటల్ టెక్నాలజీల ప్రభావాలను అధ్యయన ం చేసిన మీదట డబ్ల్యూఈఎఫ్ దీన్ని రూపొందించింది. ఈ సాంకేతికతను ఉపయోగించి విద్యుత్ రంగంలో 2025 నాటికి దాదాపు 867 బిలియన్ డాలర్ల మేర ప్రభావం చూపే కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అందులో పేర్కొంది. వీటన్నింటివల్ల సమాజంతో పాటు పర్యావరణానికీ మేలు కలుగుతుందని ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కో-హెడ్ మార్క్ స్పెల్మన్ తెలిపారు. వ్యాపార లబ్ధిని మించి దీర్ఘకాలికంగా విలువను పెంచడంపై దృష్టి పెడితే సమాజమూ, వ్యాపారాలూ లాభపడగలవన్నారు.