మందగమనాన్ని సంస్కరణలతో ఎదుర్కొంటాం
► బాధ్యతాయుత ఆర్థిక
► ప్రణాళికలతో అధిగమిస్తాం
► కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
దావోస్: సంస్కరణలను కొనసాగించడం, బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికలతో అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావాలను భారత్‌ఎదుర్కొనగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. 2001, 2008 ఆ తర్వాత 2015లోనూ అంతర్జాతీయంగా మందగమనం .. సంక్షోభం తలెత్తిన తరుణంలో భారత ఎకానమీ ధీటుగా ఎదురునిల్చిందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ ఈ విషయాలు తెలిపారు.
ప్రపంచ ఎకానమీ తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతుండటంపై సదస్సుకు హాజరైన అగ్రనేతల్లో ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. పలు అంశాలు అంతర్జాతీయ అనిశ్చితికి దారితీశాయని, దీంతో పెట్టుబడుల సరళి సర్దుబాటుకు లోనవుతోందని జైట్లీ పేర్కొన్నారు. పలు మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని, ఇన్వెస్టర్లు రిస్కుకు దూరంగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు.
100 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ మార్పులు...: డబ్ల్యూఈఎఫ్
డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఇటు సమాజం, అటు పరిశ్రమలో పెను మార్పులు రానున్నాయని, వచ్చే పదేళ్లలో ఈ విలువ దాదాపు 100 లక్షల కోట్ల (100 ట్రిలియన్) డాలర్ల మేర ఉండనుందని డబ్ల్యూఈఎఫ్ ఒక నివేదికలో వెల్లడించింది. మొబైల్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్లు తదితర డిజిటల్ టెక్నాలజీల ప్రభావాలను అధ్యయన ం చేసిన మీదట డబ్ల్యూఈఎఫ్ దీన్ని రూపొందించింది.
ఈ సాంకేతికతను ఉపయోగించి విద్యుత్ రంగంలో 2025 నాటికి దాదాపు 867 బిలియన్ డాలర్ల మేర ప్రభావం చూపే కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అందులో పేర్కొంది. వీటన్నింటివల్ల సమాజంతో పాటు పర్యావరణానికీ మేలు కలుగుతుందని ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కో-హెడ్ మార్క్ స్పెల్‌మన్ తెలిపారు. వ్యాపార లబ్ధిని మించి దీర్ఘకాలికంగా విలువను పెంచడంపై దృష్టి పెడితే సమాజమూ, వ్యాపారాలూ లాభపడగలవన్నారు.