న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్‌లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్‌కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్‌లో ఐఎఫ్‌సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్‌ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్‌సీ భావిస్తోంది.
తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్‌సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్‌ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment