క్యూ2లో 5.4 శాతం జీడీపీ వృద్ధిపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
రానున్న త్రైమాసికాల్లో చక్కటి పురోగమనం సాధ్యమేనని భరోసా
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 5.4 శాతం పురోగతి ‘‘తాత్కాలిక ధోరణి’’ మాత్రమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాబోయే త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ చక్కటి వృద్ధిని చూస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రాంట్ల కోసం తొలి సప్లిమెంటరీ డిమాండ్‌కు సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ, భారతదేశం స్థిరమైన వృద్ధిని చూసిందని, గత మూడేళ్లలో దేశం జీడీపీ వృద్ధి రేటు సగటున 8.3 శాతంగా నమోదైందని తెలిపారు. ఆమె ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు...
→ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) తొలి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 6.7 శాతం, 5.4 శాతాలుగా నమోదయ్యాయి. రెండవ త్రైమాసిక ఫలితం ఊహించినదానికన్నా తక్కువగానే ఉంది. రెండవ త్రైమాసికం భారత్‌కే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకుసైతం ఒక సవాలుగా నిలిచింది.
→ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. సవాళ్లను ఎదుర్కొంటూనే, వారి ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ఎకానమీ పురోగతికి దోహదపడుతున్న భారత ప్రజలకు ఈ ఘనత దక్కుతుంది.
→ తయారీ రంగంలో విస్తృత స్థాయి మందగమనం లేదు. మొత్తం తయారీ బాస్కెట్‌లోని సగం రంగాలు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. తయారీలో పూర్తి మందగమనాన్ని ఊహించలేం. ఎందుకంటే సవాళ్లు కొన్ని విభాగాలకే పరిమితం అయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలోని 23 తయారీ రంగాలలో సగం ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి.
→ జూలై–అక్టోబర్ 2024 మధ్య కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 6.4 శాతం పెరిగడం ఒక హర్షణీయ పరిణామం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన కేటాయింపులు రూ.11.11 లక్షల కోట్లు పూర్తి స్థాయిలో వ్యయమవుతాయని భావిస్తున్నాం. మూలధన వ్యయాల ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
→ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, యూపీఏ హయాంలో కొనసాగిన ‘రెండంకెల రేటు’తో పోలి్చతే ఎన్‌డీఏ పాలనా కాలంలో ధరల
స్పీడ్ తక్కువగా ఉంది. 2024–25 ఏప్రిల్
నుంచి అక్టోబర్ మధ్య ఈ రేటు 4.8 శాతం. కోవిడ్ మహమ్మారి దేశాన్ని కుదిపివేసిన తర్వాత ఇంత తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. ఫుడ్, ఇంధన ధరల ఒడిదుడుకులతో సంబంధంలేని కోర్ ద్రవ్యోల్బణం (తయారీ తత్సబంధ) ఇదే కాలంలో కేవలం 3.6 శాతంగా ఉండడం
గమనార్హం.
→ 2017–18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 3.2 శాతానికి తగ్గింది.
రూ.44,143 కోట్ల అదనపు వ్యయాలకు ఆమోదం
ఆర్థిక మంత్రి సమాధానం తర్వాత లోక్‌సభ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 44,143 కోట్ల అదనపు నికర వ్యయానికి ఆమోదం కోరుతూ సంబంధిత గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్‌లను ఆమోదించింది. ప్రధానంగా వ్యవసాయం, ఎరువులు, రక్షణ మంత్రిత్వ శాఖలు అధిక వ్యయం చేస్తున్న నేపథ్యంలో ఈ అనుబంధ డిమాండ్ అవసరం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment