![India GDP Growth Rebound: Sitharaman on Fastest Economy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/niramal20.jpg.webp?itok=rZWnOHfW)
మనది వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ
లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4 శాతం వృద్దిరేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంగళవారం లోక్‌సభలో విత్తమంత్రి హోదాలో నిర్మల ప్రసంగించారు. ‘‘ ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్‌ను రూపొందించాం. కేంద్రప్రభుత్వం తెచ్చే రుణాల్లో 99 శాతం నిధులను మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూల ధన వ్యయాల కోసమే ఖర్చుచేస్తున్నాం. తద్వారా భవిష్యత్ సంపదను సృష్టిస్తున్నాం.
ద్రవ్యోల్బణం కట్టడికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకే ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నుంచి ఆరు శాతం మధ్యే తచ్చాడుతోంది. ఆహార వస్తువులకు సంబంధించి ద్రవ్యోల్బణం సైతం మధ్యస్థాయిలోనే కట్టడిలో ఉంది. 2024–24 ఆర్థిక సంవత్సరానికి మూడేళ్ల ముందువరకు భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 8 శాతంగా నమోదైంది’’ అని మంత్రి అన్నారు. అయితే గత నాలుగేళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి 6.4 శాతంగా నమోదుకావచ్చన్న విశ్లేషణలు వెలువడటం తెల్సిందే. ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థి కశాఖ ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే సైతం తదుపరి ఆర్థికసంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8శాతం మధ్యలో కదలాడవచ్చని పేర్కొనడం విదితమే.
‘‘ గత 12 త్రైమాసికాల్లో కేవలం రెండు త్రైమా సికాల్లోనే భారత వృద్ధిరేటు 5.4 శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో తైమాసికంలో వృద్ధిరేటు గత యేడు త్రైమాసికాల కనిష్టమైన 5.4 శాతానికి పడి పోయింది. అయితే ఆ తర్వాత ఆర్థిక పునాదులు బలపడటంతో వృద్ధిరేటు మళ్లీ పుంజుకుంది. ఇకపై భారత్ వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీడీపీలో మొత్తం సేవలు, వస్తూత్పత్తుల విలువ ఏకంగా 61.8 శాతానికి పెరిగింది. 2002–03 సంవత్సరం నుంచి చూస్తే ఇది ఈస్థాయికి పెరగడం ఇదే తొలిసారి. వచ్చే ఆర్థికసంవత్సరంలో మౌలికవసతుల కల్పన కోసం చేసే మూల ధన వ్యయం రూ.15.48 లక్షల కోట్లకు చేరుకోనుంది.
ఇది జీడీపీలో 4.3 శాతానికి సమానం. కొత్త ఆర్థికసంవత్సరంలో ఆర్థిక లోటును రూ.15.68 లక్షల కోట్లకు పరిమితంచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇది జీడీపీలో 4.4 శాతానికి సమానం.అంతర్జాతీయంగా ఎన్నో అంతర్యుద్ధాలు, యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిర పరిస్థితుల మధ్య నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చాం. గత పదేళ్లలో యావత్ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వీటన్నింటినీ సరిచూసుకుంటూ జాతీయ ప్రయోజనాలకు పట్టంకడుతూ బడ్జెట్ కేటాయింపులు చేశాం’’ అని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment