ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.
2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.
భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment